వక్ఫ్‌ బోర్డు నుంచి పర్వీన్‌ తాజ్‌ తొలగింపు

ABN , First Publish Date - 2020-12-05T06:51:27+05:30 IST

మాజీ జడ్పీటీసీ పర్వీన్‌ తాజ్‌ను రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సభ్యత్వం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

వక్ఫ్‌ బోర్డు నుంచి పర్వీన్‌ తాజ్‌ తొలగింపు

కలికిరి, డిసెంబరు 4: జిల్లా టీడీపీ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ పర్వీన్‌ తాజ్‌ను రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సభ్యత్వం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బి.కొత్తకోటకు చెందిన పర్వీన్‌ తాజ్‌ను 2018 మార్చి 13న ఏపీ స్టేట్‌ వక్ఫ్‌ బోర్డు సభ్యురాలిగా ప్రభుత్వం నామినేట్‌ చేసింది. తాజాగా వివిధ కారణాల రీత్యా ఆమెను బోర్డు నుంచి తొలగించారు. దీనికి సంబంధించిన వివరాలు.. వక్ఫ్‌ బోర్డు సభ్యురాలు పర్వీన్‌ తాజ్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అతావుల్లా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె వ్యక్తిగత వివరాలతో ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఓటరు కార్డులో ఆమె పేరు గిరిజశ్రీ అలియాస్‌ పర్వీన్‌ తాజ్‌ తండ్రి బి. రెడ్డెప్పగా పేర్కొన్నారని పిటిషనరు పేర్కొన్నారు. అంతేగాకుండా గతంలో బీసీ రిజర్వేషన్‌ కింద ఆమె జడ్పీటీసీకి పోటీ చేశారని చెప్పారు. ముస్లిం మతంలోని సున్నీ, షియా తెగలకు చెందిన ఒక్కొక్కరిని వక్ఫ్‌ బోర్డులో నామినేట్‌ చేసే అవకాశముంది. మతపరంగా కూడా తగినంత పాండిత్యం కలిగినట్లు ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వివరించారు. పర్వీన్‌ నియామకానికి సంబంధించిన రికార్డులు వక్ఫ్‌ బోర్డు కార్యాలయంలో కూడా అందుబాటులో లేకపోవడంతో దీని పైన పది రోజుల్లోగా ఆధారాలు సమర్పించాలని పర్వీన్‌ తాజ్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆమె నుంచి వచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో పర్వీన్‌ తాజ్‌ను వక్ఫ్‌ బోర్డు నుంచి తొలగిస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి మహ్మద్‌ ఇలియాస్‌ రిజ్వి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

Updated Date - 2020-12-05T06:51:27+05:30 IST