ప్రాచ్య పరిశోధనా సంస్థ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2020-12-05T06:40:30+05:30 IST

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధనా సంస్థ (ఓఆర్‌ఐ) అభివృద్ధికి కృషి చేస్తామని వీసీ రాజారెడ్డి పేర్కొన్నారు.

ప్రాచ్య పరిశోధనా సంస్థ అభివృద్ధికి కృషి
ఓఆర్‌ఐలోని గ్రంథాలను పరిశీలిస్తున్న వీసీ రాజారెడ్డి

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 4: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధనా సంస్థ (ఓఆర్‌ఐ) అభివృద్ధికి కృషి చేస్తామని వీసీ రాజారెడ్డి పేర్కొన్నారు. వీసీగా నియమితులైన తర్వాత తొలిసారిగా ఆయన శుక్రవారం ఓఆర్‌ఐను సందర్శించారు. అక్కడి శ్రీవారి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. సీపీ బ్రౌన్‌ పరిష్కరించిన హితోపదేశం, శ్రీ కృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాల్యద వంటి విలువైన గ్రంథాలను ఓఆర్‌ఐ ప్రచురించడం గర్వకారణమన్నారు. వాల్మీకి రామాయణం, మల్లినాథసూరి రాసిన కిరాతార్జునీయం, తత్వ సంగ్రహ రామాయణం లాంటి సంస్కృత, తెలుగు గ్రంథాలు ఓఆర్‌ఐలో లభ్యమవుతున్నాయని చెప్పారు. 1806లో వెలువడిన సంస్కృత వ్యాకరణం, 1814నాటి తెలుగు వ్యాకరణం నేటికీ ఓఆర్‌ఐలో ఉండటం అభినందనీయమన్నారు. ఏనుగు దంతపు చెక్కతో తయారు చేసిన తాళపత్ర గ్రంథం, బౌద్ధ త్రిపీటకాలు, కైఫీయత్తులు, రాజయోగామృతసారం వంటివి ఆసక్తిదాయకంగా ఉన్నాయన్నారు. 16 వేల రాత ప్రతులతో దక్షిణాదిలోనే ఓఆర్‌ఐ ప్రఖ్యాతి గాంచిందని ఓఆర్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.సురేంద్రారెడ్డి తెలిపారు. రాత ప్రతులను శుభ్రం చేయడం, సంరక్షించడం, డిజిటలైజేషన్‌ ప్రక్రియల గురించి ఆయన వీసీకి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ పీసీ వేంకటేశ్వర్లు, డాక్టర్‌ గురుమూర్తి, ప్రొఫెసర్‌ కృష్ణారెడ్డి, ప్రొఫెసర్‌ దామోదరం, డాక్టర్‌ వెంకటేషన్‌, డాక్టర్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T06:40:30+05:30 IST