నామినేషన్‌ ఉపసంహరించుకున్న వారిపైనా దాడులా..?

ABN , First Publish Date - 2020-03-21T11:06:53+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ ఉపసంహరించుకున్న వారిపైనా దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నామినేషన్‌ ఉపసంహరించుకున్న వారిపైనా దాడులా..?

 వైసీపీ పైశాచికత్వానికి ఇది పరాకాష్ట 

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ


తిరుపతి సిటీ, మార్చి 20: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ ఉపసంహరించుకున్న వారిపైనా దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.తంబళ్లపల్లెకు చెందిన బి.సుగుణమ్మ తంబళ్లపల్లె జడ్పీటీసీ స్థానానికి  స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలంటూ వైసీపీ నేతలు హెచ్చరిస్తుండడంతో సుగుణమ్మ భర్త రాజారెడ్డితో కలసి ఊరు విడిచి వెళ్లిపోయారు.దీంతో ఇంట్లో మిగిలిన రాజారెడ్డి తల్లి కాంతమ్మ(64)ను,ఇద్దరు కుమార్తెలను సుగుణమ్మ ఆచూకీ చెప్పాలంటూ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో బెదిరించారు.తెలియదని ఎంత చెప్పినా, వినకుండా కాంతమ్మను బలవంతంగా జీపులో ఎక్కించుకుని బంధువుల ఊళ్లన్నీ తిప్పారు. బెదిరింపులు తారస్థాయికి చేరడంతో భరించలేకపోయిన కాంతమ్మ గురువారం గుళిక మందుతిని ఆత్మహత్యకు ప్రయత్నించింది.ప్రస్తుతం స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంతమ్మను శుక్రవారం నారాయణ పరామర్శించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు, పోలీసులు వేధించడం వల్లే కాంతమ్మ ఆత్మహత్యకు ప్రయత్నించిందన్నారు.నామినేషన్ల ప్రక్రియలో చేసిన అల్లర్లు, దాడులు, దౌర్జన్యాలు చాలదన్నట్లు ఎన్నికలు వాయిదా పడిన తరువాత కూడా ఇలా చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. తంబళ్లపల్లె ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేశారు. ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కాంతమ్మ కుటుంబానికి సీపీఐ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సీపీఐ నేతలు జనార్దన్‌, చిన్న పెంచలయ్య, విశ్వనాథ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు శివారెడ్డి, శశి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-21T11:06:53+05:30 IST