-
-
Home » Andhra Pradesh » Chittoor » NO Ugadi celebrations
-
శార్వరి నామ ఉగాది శుభాఆంక్షలు!
ABN , First Publish Date - 2020-03-25T10:46:12+05:30 IST
తెలుగునేల చరిత్రలో తొలి ఉగాది ఆంక్షలతో మొదలవుతోంది.

గడప దాటకుండా పండుగ జరుపుకోండి
లాక్‌డౌన్ రెండో రోజూ యథేచ్ఛగా జన సంచారం
పుత్తూరు, కుప్పం, వి.కోట, మదనపల్లెల్లో ఇష్టారాజ్యం
ప్రమాదకర రీతిలో వారపు సంతలు
పలుచోట్ల పోలీసుల లాఠీచార్జి
పుంగనూరు, పలమనేరుల్లో వ్యాపారులపై కేసులు
పెద్ద సంఖ్యలో వాహనాలకు జరిమానా
తిరుపతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తెలుగునేల చరిత్రలో తొలి ఉగాది ఆంక్షలతో మొదలవుతోంది. ఇది నిర్బంధం కాదు, ప్రజా సంక్షేమ నిర్ణయం. మంగళవారం రాత్రి 12 గంటల నుంచీ మూడు వారాల పాటూ సంపూర్ణంగా లాకౌట్ మొదలవుతుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి జిల్లా ప్రజలు బద్ధులై ఉండాలి. కనిపించని శత్రువు మనదాకా రాలేదులే అని మంగళవారం సాయంత్రం ఉగాది సరకుల కోసం జనం ఎగబడ్డ తీరు మరింత భయం గొలుపుతోంది. ఉగాది పేరుతో మనం సంచిలో కరోనాను ఇంటికి మోసుకురావడం క్షేమకరం కాదు. ఉగాది పచ్చడితో పాటూ కరోనాను పంచకుండా ఎవరిళ్ళలో వాళ్ళు దీపం వెలిగించుకుని దన్నం పెట్టుకోవడమే దేవుడైనా కోరుకునేది.
లాక్‌డౌన్ రెండో రోజు ఉగాది పేరుతో మంగళవారం జనం యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమించారు. ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా రోడ్లపై గుంపులు కట్టారు. అవసరంగా కొందరు, అవసరార్థం మరికొందరు వాహనాల్లో రాకపోకలు కొనసాగిస్తూనే కనిపించారు. పుత్తూరు, కుప్పం, వి.కోట, మదనపల్లె పట్టణాల్లో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించి ఆందోళన కలిగించింది. పోలీసులు కఠిన చర్యలకు దిగడంతో మధ్యాహ్నం నుంచి కొంత అదుపులోకి వచ్చింది. పుత్తూరులో పోలీసులు లాఠీలకు పనిచెప్పగా, కుప్పంలో పోలీసులు జనాన్ని తరిమి చెదరగొట్టారు. మదనపల్లెలోనూ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. పుంగనూరులో షాపులు తెరిచిన వ్యాపారులను అరెస్టు చేశారు. జిల్లావ్యాప్తంగా రోడ్లపై కనిపించిన వాహనాలకు పోలీసులు పెద్ద ఎత్తున జరిమానాలు విధించారు. జిల్లా కేంద్రంలో బరితెగించిన ఓ ప్రైవేటు విద్యాసంస్థ విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తుండగా కలెక్టర్ ఆ స్కూలును సీజ్ చేయాలంటూ ఆదేశించారు. మొత్తం మీద మొదటి రోజు కంటే రెండవ రోజు లాక్‌డౌన్ జిల్లావ్యాప్తంగా కాస్తంత మెరుగ్గానే అమలైందనే చెప్పాలి.
పలుచోట్ల యధేచ్చగా జనం అతిక్రమణలు
జిల్లాలో పలుచోట్ల లాక్‌డౌన్ నిబంధనలను, పోలీసు హెచ్చరికలను బేఖాతరు చేశారు. యధేచ్చగా రోడ్లపైకి వచ్చి, గుంపులు కట్టి, వాహనాల్లో రాకపోకలు సాగిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అత్రిమించారు. పుత్తూరు పట్టణంలో మామూలు రోజుల్లో వచ్చినట్టుగానే జనం మంగళవారం కూడా రోడ్లపైకి వచ్చారు. గుంపులుగా గుమిగూడారు. వాహనాల రాకపోకలు కూడా యధాప్రకారం కొనసాగాయి. దీంతో ప్రమాదం గుర్తించిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. లాఠీలు ఝలిపించడంతో జనం చెల్లాచెదురై పరుగులు పెట్టారు. శ్రీకాళహస్తిలో కూరగాయల దినసరి మార్కెట్ జనంతో కిటకిటలాడుతుండగా డీఎస్పీ అక్కడికి చేరుకుని 144 సెక్షన్ విధించారు.
పుంగనూరులో 144 సెక్షన్ అమలులో వున్నా దుకాణాలు తెరవడంతో ఆరుగురు వ్యాపారులపై పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. 40 వాహనాలకు జరిమానా విధించారు. పలమనేరు పట్టణంలోనూ దుకాణాలు తెరిచిన నలుగురు వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మదనపల్లెలో ఉదయం 10 గంటల వరకూ రోడ్లపై జన సంచారం, వాహనాల రాకపోకలు సాధారణ పరిస్థితులను తలపించాయి. దానికి తోడు మదనపల్లెలో మంగళవారం జరిగే వారపు సంతలో విపరీత రద్దీ ఏర్పడింది. వాల్మీకిపురంలో వారపు సంతలోనూ జనం అధికంగా చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జనాన్ని బలవంతంగా పంపించివేశారు. చిత్తూరు నగరంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై కనిపించిన కార్లు, ద్విచక్ర వాహనాలకు జరిమానా వేశారు. వి.కోటలో టమోటా మార్కెట్ రద్దీగా కనిపించింది. పూతలపట్టులో 144 సెక్షన్ విధించినా వీధులన్నీ జనంతో నిండుగా కనిపించాయి.
మిగిలిన చోట్ల మెరుగ్గా..
తిరుపతి, చిత్తూరు నగరాలతో పాటు పుంగనూరు, పీలేరు, చంద్రగిరి, పలమనేరు, తంబళ్ళపల్లె, బి.కొత్తకోట, కలికిరి, సత్యవేడు, నగరి తదితర పట్టణాల్లో మంగళవారం లాక్‌డౌన్ చాలావరకు పక్కాగానే అమలైంది. తిరుపతిలో ‘ఉగాది’ కొనుగోళ్లతో కూరగాయల మార్కెట్ కిటకిటలాడుతూ అత్యంత ప్రమాదకర వాతావరణం కనిపించింది. ఉదయం 9 గంటలనుంచి రోడ్లపై వాహనాల సంచారాన్ని గట్టిగానే కట్టడి చేశారు. చిత్తూరులో ఎస్పీ సెంథిల్ కుమార్, తిరుపతిలో అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి స్వయంగా పర్యటిస్తూ లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. తిరుపతిలో శాసనసభ్యుడు కరుణాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గిరీష కలసి నగరంలో తిరిగి వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాల్మీకిపురంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోలీసులతో కలసి రోడ్డుపైకి వచ్చి వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి జాగ్రత్తలు చెప్పారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి, తిరుచానూరు, మంగళం ప్రాంతాల్లో పర్యటించారు.