మామ వారసత్వాన్ని అందుకున్న అల్లుడు
ABN , First Publish Date - 2020-12-06T15:27:29+05:30 IST
తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా..
టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా నరసింహప్రసాద్
తిరుపతి(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పంతగాని నరసింహ ప్రసాద్ నియమితులయ్యారు. సినీ ప్రముఖుడు, దివంగత మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ అల్లుడైన నరసింహప్రసాద్ కడప జిల్లా రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజక వర్గ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో అక్కడినుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అయినా ప్రభుత్వ వైఫల్యాలను తనదైన సాంస్కృతిక శైలిలో ఎండగడుతూ ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో ప్రశంసలు అందుకున్నారు. దాదాపు 20 ఏళ్లపాటు శివప్రసాద్ టీడీపీ సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ఆయనకు సహాయకుడిగా వ్యవ హరిస్తూ వచ్చారు.ఆయన మరణానంతరం శివప్రసాద్ రాజకీయ వారసుడిగా నరసింహప్రసాద్ తెరపైకొచ్చారు.కుటుంబ వారసత్వ మే కాక సృజనతో కూడిన సాంస్కృతిక వారసత్వాన్నే అందిపుచ్చుకున్న నరసింహప్రసాద్‌కు ఉన్నత పదవి దక్కడం పట్ల పార్టీ నేతలు ఆయన్ను అభినందిస్తున్నారు.కాగా డిజిటల్ సాంకేతిక విప్లవంతో ప్రజలను చైతన్యపర్చేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని నరసింహప్రసాద్ చెప్పుకొచ్చారు.