కొత్తపల్లె పంచాయతీ కార్యదర్శి చర్యతో శ్రీరంగరాజపురంలో కలకలం..

ABN , First Publish Date - 2020-10-14T17:19:25+05:30 IST

ఎంపీడీవో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లె..

కొత్తపల్లె పంచాయతీ కార్యదర్శి చర్యతో శ్రీరంగరాజపురంలో కలకలం..

చచ్చిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో

ఎంపీడీవోపై వేధింపుల ఆరోపణలు


శ్రీరంగరాజపురం: ఎంపీడీవో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లె పంచాయతీ కార్యదర్శి కోదండరామిరెడ్డి పంపించిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. గతంలో కోదండరామిరెడ్డి  సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో గొడవ పడడంతో ఎంపీడీవో పార్వతమ్మ జనవరిలో డిప్యుటేషన్‌ మీద నారాయణవనం మండలం అరణ్య కండ్రిగ పంచాయతీకి పంపారు. డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారంతా సొంత పంచాయతీలకు వెళ్లి విధుల్లో చేరాలని సెప్టెంబర్‌లో కలెక్టర్‌ ఆదేశించారు.దీంతో సెప్టెంబర్‌ 28వ తేదీన తాను కొత్తపల్లె పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరడానికి వస్తే ఎంపీడీవో తన జాయినింగ్‌ రిపోర్టును డీపీవోకు పంపలేదని.... తనను విధుల్లో చేర్చుకోలేదని కోదండరామిరెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు.


నిత్యం కార్యాలయంలో అవమానాలు ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోవాలని  సూసైడ్‌ నోట్‌ రాయడంతో పాటు, సెల్ఫీ వీడియో తీసి సహచర ఉద్యోగులకు,భార్యకు పంపానని చెప్పారు.ఎంపీడీవో అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్న కారణంగానే తనను డిప్యుటేషన్‌పై పంపిందన్న కోదండరామిరెడ్డి తన మరణానికి ఆమే బాధ్యత వహించాలని  సెల్పీలో తెలిపాడు. ఆ వీడియోను సహచర కార్యదర్శులకు, భార్యకు పంపాడు. కోదండరామిరెడ్డి వీడియోను చూసిన సహచరులు వెంటనే కొత్తపల్లెకు బయలుదేరి మార్గమధ్యంలో ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చిన కోదండరామిరెడ్డిని అడ్డుకున్నారు.ఈలోపు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న కోదండరామిరెడ్డి భార్య మాట్లాడుతూ దీనంతటికీ ఎంపీడీవోయే కారణమని ఆరోపించారు.ఆమెపై స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయమై ఎంపీడీవో  పార్వతమ్మను వివరణ కోరగా తాను 28వతేదినే కోదండరామిరెడ్డిని విధుల్లో జాయిన్‌ చేసుకున్నానని చెప్పారు. ఆయన తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు.

Updated Date - 2020-10-14T17:19:25+05:30 IST