‘కరోనా’ వేళ.. ఇదేమి తీరు?

ABN , First Publish Date - 2020-09-14T10:57:28+05:30 IST

ఆసరా’ పథకానికి, విద్యార్థులకు సంబంధం ఏంటో తెలియదు. కరోనా విజృంభిస్తున్న వేళ 14 ఏళ్లలోపు విద్యార్థులను ఎందుకు ..

‘కరోనా’ వేళ.. ఇదేమి తీరు?

 ‘ఆసరా’ వారోత్సవాలకు విద్యార్థులు 

కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన 


శ్రీకాళహస్తి, సెప్టెంబరు 13: ‘ఆసరా’ పథకానికి, విద్యార్థులకు సంబంధం ఏంటో తెలియదు. కరోనా విజృంభిస్తున్న వేళ 14 ఏళ్లలోపు విద్యార్థులను ఎందుకు పిలిపించారో అర్థం కాదు. మాస్కుల్లేకుండా, భౌతిక దూరం పాటించకుండా వారితో ‘జగన్‌’ పాటలకు డ్యాన్సులు వేయించడం.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారితో డ్యాన్సు వేయడం విమర్శలకు తావిచ్చింది. ఇదంతా కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధమని చెప్పాల్సిన అధికారులు.. చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటన ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణ వద్ద చోటుచేసుకుంది. ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ వారోత్సవాలకు ఎమ్మెల్యే మధు మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు.


అనంతరం సీఎం జగన్‌ను పొగిడే పాటకు పురపాలక బడుల్లోని విద్యార్థులతో నృత్యం చేయించారు. మూడు వేలకుపైగా కరోనా కేసులు నమోదైన శ్రీకాళహస్తిలో.. ఇలా విద్యార్థులతో చేయించడంపై విమర్శలు నెలకొన్నాయి. మున్సిపల్‌ కమిషనరు శ్రీకాంత్‌, మెప్మా పీడీ జ్యోతి సాక్షిగా ఈ సంఘటన జరిగింది. కరోనా కాలంలో ఇలా చేయడం పిల్లల జీవితాలతో ఆడుకోవడమేనని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాదు నుంచి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలోనూ భారీ ర్యాలీ నిర్వహించి శ్రీకాళహస్తిలో కరోనా వ్యాప్తికి కారకుడయ్యారని విమర్శించారు.


Updated Date - 2020-09-14T10:57:28+05:30 IST