-
-
Home » Andhra Pradesh » Chittoor » minimum response to Amul
-
అమూల్‌కు స్పందన అంతంతమాత్రమే
ABN , First Publish Date - 2020-11-21T07:12:36+05:30 IST
కలెక్టర్ నుంచి కార్యదర్శి వరకు 14 రోజుల పాటు అధికారులు పడిన కష్టానికి తొలిరోజు ఫలితం చూస్తే అంతంత మాత్రంగానే కనపడుతోంది.

తొలిరోజు పాలసేకరణ 114 లీటర్లే
మదనపల్లె టౌన్, నవంబరు 20: కలెక్టర్ నుంచి కార్యదర్శి వరకు 14 రోజుల పాటు అధికారులు పడిన కష్టానికి తొలిరోజు ఫలితం చూస్తే అంతంత మాత్రంగానే కనపడుతోంది. అమూల్ నిర్వహణలో విజయ డెయిరీకి పాలసేకరణ ప్రారంభమైన తొలిరోజు ఉదయం కేవలం 114 లీటర్ల మాత్రమే పాలసేకరణ అయ్యిందంటే రైతులు ఇంకా అధికారులను, అమూల్‌ను విశ్వసించలేదని తెలుస్తోంది. అటు ప్రైవేటు డెయిరీల పోటీని, ఇటు పాల ఏజెంట్ల వ్యవస్థను ఢీ కొనాలంటే అధికారులు ఇంకా ఎన్ని ఎత్తులు వేయాల్సి వుందో అనే భావం రైతుల్లో వ్యక్తమవుతోంది. పాలసేకరణలో పేరుగాంచిన చిత్తూరు జిల్లాలో అమూల్ సహకారంతో విజయ డెయిరీని నిర్వహించి విజయం సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సుకతతో వుంది. దీని కోసం మదనపల్లె పట్టణ శివారులోని చిప్పిలి వద్ద విజయ డెయిరీ నిర్వహణను అమూల్‌కు అప్పగించారు. అంతే కాకుండా 14 రోజుల నుంచి గుజరాత్ నుంచి అమూల్ సహకార డెయిరీ ప్రతినిధులు, శ్రీకాకుళం నుంచి పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మదనపల్లెకు వచ్చి పాల రైతులతో సమావేశం నిర్వహించారు. మరో వైపు కలెక్టర్ భరత్‌గుప్తా, జేసీ వీరబ్రహ్మం మదనపల్లెకు వచ్చి పాల ఉత్పత్తి మహిళా సంఘాలతో రెండు సార్లు సమావేశాలు నిర్వహించారు. దీంతో పాటు మదనపల్లె, రామసముద్రం మండలాల్లోని 32 ఆర్‌బీకేల వద్ద పాలసేకరణ కోసం ఏర్పాట్లు చేశారు. అటు డీఆర్‌డీఏ, ఇటు పశుసంవర్థకశాఖతో పాటు పంచాయతీ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి పాలను అమూల్ డెయిరీకి పోస్తే మంచి ధరలు వస్తాయని చెప్పారు. కాగా శుక్రవారం నుంచి రెండు మండలాల్లో 32 ఆర్‌బీకేల ద్వారా పాలసేకరణ ప్రారంభించారు. రామసముద్రం మండలంలో సరైన యంత్రాలు లేకపోవడం, చెంబకూరు బీఎంసీని అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం తదితర కారణాలతో ఈ మండలంలో తొలిరోజు ఒక్క లీటర్ కూడా పాలు సేకరించలేకపోయారు. మదనపల్లె మండలంలోని అంకిశెట్టిపల్లెలో 60 లీటర్లు, పొన్నేటిపాళెంలో 6లీటర్లు, పనసమాకులపల్లెలో 8.5 లీటర్లు, మునగమాకులపల్లె గ్రామాల్లో 39 లీటర్లు కలిపి మొత్తం 114 లీటర్లు మాత్రమే గురువారం ఉదయం సేకరించి చిప్పిలి సమీపంలోని విజయాడెయిరీకి తరలించారు.లీటరు ఽపాల ధర రూ.32 వచ్చిందని రైతులు తెలిపారు.
ఏజెంట్ల వ్యవస్థతో పోటీ పడి గెలిచేరా?
పాలసేకరణకు సంబంధించి జిల్లాలో ప్రైవేటు డెయిరీలు రాజ్యమేలుతున్నాయి. ఆవుల కొనుగోలుకు రుణాలు, సబ్సిడీ ధరలతో పశువుల దాణా, పాల రవాణా, నాణ్యతను బట్టి పాలధరల చెల్లింపులో తేడాలతో డెయిరీలు పోటీ పడి పాలు సేకరిస్తున్నాయి. ప్రతి గ్రామంలో ఏజెంట్లను పెట్టి కమీషన్ ఇస్తూ, నెలకు రెండు సార్లు బిల్లులు చెల్లిస్తున్నాయి.ఏడాదిలో లీటరుకు ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తున్నాయి. ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు 30 ఏళ్లుగా గ్రామాల్లో వేళ్లూనుకున్న పాల ఏజెంట్ల వ్యవస్థ ముందు అమూల్ నిలిచేనా అన్నది ప్రశ్నగా మిగిలిపోనుంది.