వలసకూలీల మహాప్రస్థానం

ABN , First Publish Date - 2020-05-17T16:03:07+05:30 IST

నాగరికతకు చిహ్నాలైన రహదారులు రోదిస్తున్నాయి. ఒక అనాగరిక దృశ్యానికి సాక్ష్యం అయినందుకు దుఃఖిస్తున్నాయి. ఒకరా ఇద్దరా..

వలసకూలీల మహాప్రస్థానం

ఆంధ్రజ్యోతి పరిశీలనలో కడుపుదేవే కన్నీటి దృశ్యాలు


ఆంధ్రజ్యోతి -తిరుపతి: నాగరికతకు చిహ్నాలైన రహదారులు రోదిస్తున్నాయి. ఒక అనాగరిక దృశ్యానికి సాక్ష్యం అయినందుకు దుఃఖిస్తున్నాయి. ఒకరా ఇద్దరా వేల మంది. పిల్లా జెల్లాతో మూటాముళ్లు నెత్తికెత్తుకుని నడుస్తున్నారు. పాదాలు బొబ్బలెక్కి రసికారుతున్నా నడుస్తూనే ఉన్నారు. నెత్తి మాడి చెమట ధారలు కడుతున్నా నడుస్తూనే ఉన్నారు. ఆకలితో పేగులు అరుస్తున్నా.. దాహంతో నాలుక పిడచకట్టుకుపోతున్నా నడుస్తూనే వున్నారు. దాతలు పంచే పొట్లాల కోసం ఎగబడుతూ, దారిన పోయే ఆగని లారీల వైపు ఆశగా చూస్తూ నడుస్తూనే ఉన్నారు. ఇళ్ళలో ఉన్న భద్రజీవుల చల్లని బతుకులు చూస్తూనే నడుస్తున్నారు.


నడుస్తూ నడుస్తూనే రాలిపోతున్నారు. అయినా ఆగడం లేదు. రెక్కల్ని నమ్ముకుని వేల కిలోమీటర్లు ఎగిరి వచ్చినవాళ్ళు.. పాదాలకు నమస్కరించుకుని నడుస్తూనే ఉన్నారు. ఊపిరుండగానే తమ ఊళ్ళకు చేర్చమని దయలేని భగవంతుడిని వేడుకుంటూ నడుస్తూనే ఉన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన భరోసా ఏమైందని ఎవ్వరినీ అడక్కుండానే నడుస్తున్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో మా వాటా ఎంత అని ప్రశ్నించకుండానే నడుస్తున్నారు. విదేశాల్లో ఉన్నవారి కోసం విమానాలు సిద్ధం చేసినవారు తమ కోసం రైళ్లూ, బస్సులూ అయినా ఎందుకు నడపలేదని నిలదీయకుండానే వీరంతా నడుస్తున్నారు.  దేశం నుదుటి మీద నెత్తుటి గాయాల పాదముద్రలు అద్దుతూ వీరు నడుస్తూనే ఉన్నారు. మానవత్వం సిగ్గుతో తలదించుకునేలా.. నడుస్తూ..నడుస్తూ..నడుస్తూనే ఉన్నారు. శనివారం ఉదయం జిల్లాలో రహదారులమీద ఆంధ్రజ్యోతి కంటబడ్డ కొన్ని కన్నీటి నడక చిత్రాలు ఇవి..తిరుపతి నుంచీ రేణిగుంట మీదుగా నెల్లూరు వెళ్ళే జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డులో పలువురు వలస కూలీలు బృందాలుగా సాగిపోవడం కనిపించింది.

- తిరుపతి-రేణిగుంట బైపాస్‌ రోడ్డులోని తిరుచానూరు సమీపంలో పలుచోట్ల బెంగళూరు నుంచీ కాలినకడన వచ్చిన యువకులు వెంట లగేజీలతో గుంపులు గుంపులుగా రోడ్డుపక్కన నిలబడి వచ్చిన ప్రతి లారీ ఆపుతూ కనిపించారు. బైపాస్‌ రోడ్డులో దారి పొడవునా బెంగళూరు నుంచీ ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన యువకులు చిన్న చిన్న బృందాలుగా సైకిళ్ళపై వెళుతూ కనిపించారు.

- రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీసు స్టేషన్‌ ఎదుట షాపింగ్‌ కాంప్లెకు వసారాలో తమిళనాడు తిరువల్లూరు, కాంచీపురాల నుంచీ కాలినడకన వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న యూపీ బాందా జిల్లా, సోన్‌భద్ర జిల్లాలకు చెందిన వలస కూలీల సమూహం కనిపించింది.

- గాజులమండ్యం పోలీస్‌ స్టేషన్‌కు కిలో మీటరు దూరంలో నెల్లూరు మార్గంలో బెంగళూరు నుంచీ సైకిళ్ళపై సాగిపోతూ కనిపించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లా డొమారియా గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు.

- రేణిగుంట మీదుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచీ ఆయా ప్రభుత్వాల అనుమతులతో వలస కూలీలను తీసుకెళుతున్న బస్సులు, మినీ బస్సులు పెద్ద సంఖ్యలో కనిపించాయి.

- పీలేరు పొలిమేర్లలో కడప మార్గంలో ఆరుగురు యువకులు కడప వైపు సైకిళ్లపై వెళుతూ కనిపించారు. పలకరించగా తాము మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచీ వచ్చామని, చిత్తూరులో ఇటుకల బట్టీల్లో పనిచేసేవారమని చెప్పారు. లాక్‌డౌన్‌తో పనులు లేకపోగా 13 రోజుల కూలి డబ్బులు కూడా యజమాని ఎగ్గొట్టారని వాపోయారు. చేతిలో వున్న డబ్బుతో సైకిళ్ళు కొనుగోలు చేసి నాగపూర్‌ బయల్దేరామని చెప్పారు.

- పీలేరు పట్టణ శివార్లలో నలుగురు వలస కూలీలు చిత్తూరు వైపు వెళుతూ కనిపించారు.

- మదనపల్లె-బెంగళూరు మార్గంలో కర్ణాటక సరిహద్దు అయిన చీకిలిబైలు చెక్‌పోస్టు వద్ద ఉదయం 6 గంటలకు నలుగురు యువకులు సైకిళ్ళపై వస్తూ కనిపించారు. కర్నాటక రాష్ట్రం చింతామణిలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు చెప్పారు.అయితే వారిని చెక్‌పోస్టులో పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు.

- ఉదయం 7.30 గంటల సమయంలో చిత్తూరు బైపాస్‌ రోడ్డు మీదుగా బెంగళూరు నుంచీ ఏడుగురు యువకులు ఒడిశాకు సైకిళ్ళపై వెళుతూ కనిపించారు. గత మంగళవారం బయల్దేరిన తమకు చిత్తూరు చేరడానికే నాలుగు రోజులు పట్టిందని చెప్పారు.

- పూతలపట్టు సమీపంలో జాతీయ రహదారిపై వలస కూలీలతో నిండిన కర్ణాటక బస్సు ఆగి వుండడం కనిపించింది. ఆరా తీస్తే మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీల నుంచీ కర్ణాటక ప్రభుత్వం మనిషికి రూ. 5500 చొప్పున వసూలు చేసి వారిని బస్సుల్లో సొంత ఊళ్ళకు తరలిస్తున్నట్టు తెలిసింది.పీలేరు: పీలేరు-కడప జాతీయ రహదారిపై ముగ్గురు వ్యక్తులు చేతి సంచులు పట్టుకుని పీలేరు వైపు నడిచివస్తూ కనిపించారు. పలకరిస్తే తాము తమిళనాడులోని ఆంబూరు, అనైకట్టు ప్రాంతాలకు చెందిన వారమని, ఎర్రచందనం కేసుల్లో జైలు శిక్ష పడగా కడప జైలులో వున్నామని చెప్పారు. బెయిల్‌ రావడంతో విడుదల చేశారని, సొంతూళ్ళకు వెళ్ళడానికి వాహనాలు లేక నడిచి వెళుతున్నట్టు చెప్పారు. లారీలు ఆపినా ఆపడం లేదని వాపోయారు.నడిచి ఉత్తరప్రదేశ్‌కి

శ్రీకాళహస్తి స్కిట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద ఉదయం 7 గంటల సమయంలో 12 మంది యువకులు నెల్లూరు వైపు కాలినడకన వెళుతుండడం కనిపించింది. పలకరించగా తాము చెన్నైలో పెయింటింగ్‌ పని చేసేవారమని లాక్‌డౌన్‌ కారణంగా సొంత ఊరైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సోనభద్ర జిల్లాకు వెళుతున్నామని చెప్పారు. కాలినడకన వెళ్ళడానికి నెలరోజులు పడుతుందని వాపోయారు.సైకిళ్ళపై మధ్యప్రదేశ్‌కి

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణ శివార్లలోని నాయుడుపేట రోడ్డులో ఉదయం 6.45 గంటలకు నలుగురు యువకులు సైకిళ్ళపై వెళుతూ కనిపించారు. వారితో మాట్లాడగా తాము చెన్నై నుంచీ వస్తున్నామని స్వస్థలమైన మధ్యప్రదేశ్‌ శిధి జిల్లా వెళుతున్నామని చెప్పారు. చెన్నైలో కారు షెడ్డులో మెకానిక్కులుగా పనిచేసేవారమని చెప్పారు.కాళ్లు బొబ్బలెక్కినా... కన్న వూరికి ఒంటరి నడక

మదనపల్లె టౌన్‌:  కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింగనూరుకు చెందిన వంశీ..మూడు నెలల కిందట బతుకుదెరువు కోసం వలసకార్మికుడిగా పీలేరు వచ్చాడు. అక్కడ ఓ డాబాలో సప్లయర్‌గా చేరాడు. లాక్‌డౌన్‌తో డాబా మూతపడటం.. 50 రోజులుగా చేతిలోని చిల్లర ఖర్చయిపోయింది. దీంతో శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరాడు. రాత్రి రోడ్డు పక్కన కల్వర్టు పక్కన నిద్రపోయాడు. ఉదయం ఐదుకే నిద్రలేచి రోడ్డుబాట పట్టాడు. దారిమధ్యలో ఓ దాత ఇచ్చిన రెండు లేస్‌ ప్యాకెట్లు తింటూ, బాటిల్లో నీళ్లు పట్టుకుని గొంతు తడుపుకుంటూ వెళుతున్నాడు. చెమటకు అట్టకట్టిన షర్టుతో, కాలికి చెప్పులు లేక బొబ్బలెక్కిన అరికాళ్లలో నీరుబుడ్డలు పగిలి రసి కారుతున్నా నడుస్తూనే ఉన్నాడు. కనీసం మొబైల్‌ కూడా లేని ఇతను కనిపించే వారిని దారి అడుగుతూ వెళుతున్నాడు.ఛిద్రమైన బతుకు చిత్రం!

తిరుపతి: రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మూతపడిన షాపింగ్‌ కాంప్లెక్సు వసారాలో విశ్రమిస్తున్న ఈ వలస కూలీల బతుకు చిత్రం లాక్‌డౌన్‌తో చిధ్రమైపోయింది. 18 మందితో కూడిన ఈ బృందంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వేర్వేరు జిల్లాలకు చెందిన వారున్నారు. బాందా జిల్లా దేవరార్‌ గ్రామానికి చెందిన అరవింద్‌ కుమార్‌ పెళ్ళి కాగానే భార్యతో కలసి చెన్నై చేరుకున్నారు. అక్కడ రకరకాల పనులు చేసి చివరికి తిరువళ్ళూరులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఇంట్లో భార్యా బిడ్డలు సమోసాలు తయారు చేస్తే అరవింద్‌ అరక్కోణం నుంచీ చెన్నై వరకూ లోకల్‌ ట్రైన్లలో తిరుగుతూ వాటిని అమ్ముతుంటారు. పదిహేనేళ్ళుగా అదే బతుకుదెరువు. లాక్‌డౌన్‌తో అంతా కుదేలైంది. సొంత ఊరికి వెళ్లిపోదామని గత బుధవారం తిరువళ్ళూరు నుంచి నడిచి బయలుదేరారు.శనివారం వేకువ జామున గాజులమండ్యం కూడలి చేరుకుని విశ్రాంతి కోసం ఆగారు. తిరువళ్ళూరు నుంచీ ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లా 1727 కిలోమీటర్ల దూరంలో వుంది. చేతిలో నీళ్ళ సీసాలు తప్ప మరేమీ లేవు. దారి వెంబడీ దాతల సాయంతో కడుపు నింపుకుంటూ కాలినడకన స్వస్థలం సాగిపోయే ప్రయత్నం చేస్తున్నారు. భార్యా బిడ్డలతో మండే ఎండల్లో ఎంత దూరమని నడిచి వెళతారన్న ప్రశ్నకు తమిళనాడు ప్రభుత్వం వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేయలేదని, దీంతో ఇంతకు మించి తమకు మరో మార్గం లేకపోయిందంటూ సమాధానమిచ్చారు. దారిలో వారి ప్రాంతానికే చెందిన ఇంకొందరు కలిశారు. అందరూ కలిసి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ సాగుతున్నారు.


కోల్‌కతాకు నడుస్తున్నారు

మదనపల్లె: కోల్‌కతాకు చెందిన 10 కుటుంబాలు పిల్లాపాపలతో ఏడు నెలల క్రితం బెంగళూరుకు వలసవెళ్లాయి. నిర్మాణరంగంలో వివిధ విభాగాల్లో పనిచేసే, వీరిని లాక్‌డౌన్‌ చిన్నాభిన్నం చేసింది. తినడానికి తిండి లేక, ఉండటానికి ఆశ్రయం లేక, అయిన వారి వద్దకు చేరే అవకాశం లేక ఇబ్బందులు పడుతూ తమ ప్రాంతానికి నడిచి బయలుదేరారు. ఐదు రోజుల కిందట బెంగళూరులో బయలుదేరిన 15 మంది బృందం దారిలో మదనపల్లె వద్ద ఆంధ్రజ్యోతి కంటపడ్డారు. తలలపై మూటలు, చేతిలో సంచి, చంకల్లో చంటిబిడ్డలతో భయంభయంగా నడుస్తున్న వీరు  రోజుకు 20-30 కి.మీ. నడుస్తున్నామని చెప్పారు. ఇప్పటికి వంద కిలోమీటర్లు నడిచి వచ్చిన వీరు మరో 1600 కిలోమీటర్లు నడవాలి. మదనపల్లె, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, విజయనగరం దాటి ఒడిశాకు చేరుకుని, అక్కడి నుంచి బరంపూర్‌, కటక్‌ మీదుగా కలకత్తా చేరుకుంటామని తమ లక్ష్యం గురించి వివరించారు.  తెలియని తోవ, ఊహకు అందని గమ్యం.. అయినా నడుస్తూనే ఉన్నారు.


బెంగళూరు నుంచి ఒడిశాకు.. 

చిత్తూరు నగర బైపా్‌స రోడ్డులో శనివారం ఉదయం 7:30 గంటలకు సైకిళ్ళ మీద వెళ్తున్న ఒక బృందం ఆంధ్రజ్యోతి కంటబడింది. ఒడిశాకు చెందిన ఈ ఏడుగురు బెంగళూరులోని ఓ మైక్రో ల్యాబ్‌ కంపెనీలో నెలకు రూ.11 వేల జీతానికి పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆ కంపెనీ మూసేశారు.ఇళ్ల నుంచి నగదు తెప్పించుకుని కొంత కాలం గడిపారు.ఇట్లా ఇక బతకలేమనుకుని ఒడిశాకు బయలుదేరారు. రైళ్లూ , బస్సులూ, కార్లూ తమను తమ ఊళ్ళకు చేర్చవని కొత్త సైకిళ్లను కొనుగోలు చేశారు. బ్యాగులు సర్దుకుని నాలుగు రోజుల కిందట బెంగళూరులో బయల్దేరారు. శనివారం ఉదయానికి చిత్తూరుకు చేరుకున్నారు. ఇప్పటికే బాగా అలసిపోయి ఉన్న ఈ యువకులు ఇంకా 1500 కిలోమీటర్ల దూరం సైకిళ్ల మీదే ప్రయాణించాల్సి ఉంది. 


చిత్తూరు నుంచి నాగ్‌పూర్‌కి

పీలేరు టౌన్‌: ఎక్కడి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, ఎక్కడి ఆంధ్రలోని చిత్తూరు. రెండింటి మధ్యా దాదాపు 1300 కిలోమీటర్ల దూరం ఉంది. కడుపు కోసం అంత దూరం దాటొచ్చి 5 నెలల కిత్రం పనికి కుదిరారు. లాక్‌ డౌన్‌ వచ్చింది. పనులు లేవు, జీతం ఇచ్చుకోలేనన్నాడు ఆసామి. చేసేది లేక, పస్తులుండలేక అయినోళ్ల చెంతకు చేరుదామనుకున్నారు. ప్రయా ణ సౌకర్యాలు లేవు. ఉన్న డబ్బులన్నీ పోగేసుకుని చిత్తూరులో కొత్త సైకిళ్లు కొన్నారు. పిక్కల మీద నమ్మకంతో బయలు దేరారు నాగరపూర్‌కు చెందిన సికిందర్‌, సురేశ్‌, రాకేశ్‌, లల్లా, జోగిందర్‌, శ్రీరామ్‌. చిత్తూరు నుంచి సైకిళ్లపై నాగ్‌పూర్‌ వెళుతూ వారు శనివారం ఉదయం 7.55 గంటల ప్రాంతంలో పీలేరు-కడప మార్గంలో ఆంధ్రజ్యోతి కంట పడ్డారు. 

Updated Date - 2020-05-17T16:03:07+05:30 IST