ఈ పాపం ఎవరిది?.. రిజల్ట్ రాకముందే ఓ కరోనా అనుమానితుడిని డిశ్చార్జ్ చేయడంతో..
ABN , First Publish Date - 2020-07-18T23:36:50+05:30 IST
ప్రైమరీ కాంటాక్టు విషయంలో అధికారుల నిర్లక్ష్యంతో 70 ఏళ్ల వృద్ధురాలు కరోనా బారిన పడ్డారు. ఆ కుటుంబమూ ప్రమాదంలో పడింది. వీటిపై బాధితుడు ‘ఆంధ్రజ్యోతి’కి ఫోనుచేసి తన ఆవేదన వెళ్లగక్కారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. తిరుపతి అర్బన్ మంగళం తుడా క్వార్టర్స్‌లో

రిజల్టు రాకనే క్వారంటైన్ నుంచి అనుమానితుడి డిశ్చార్జి
ఇంటికొచ్చిన రెండో రోజే ముదుసలి తల్లికి అనారోగ్యం.. కరోనా నిర్ధారణ
తిరుపతి (ఆంధ్రజ్యోతి): ప్రైమరీ కాంటాక్టు విషయంలో అధికారుల నిర్లక్ష్యంతో 70 ఏళ్ల వృద్ధురాలు కరోనా బారిన పడ్డారు. ఆ కుటుంబమూ ప్రమాదంలో పడింది. వీటిపై బాధితుడు ‘ఆంధ్రజ్యోతి’కి ఫోనుచేసి తన ఆవేదన వెళ్లగక్కారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. తిరుపతి అర్బన్ మంగళం తుడా క్వార్టర్స్‌లో 42 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. 70 ఏళ్ల తల్లి, భార్య, 5, 7 ఏళ్ల పిల్లలున్నారు. కరోనా సోకిన ఓ వ్యక్తికి ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న ఇతడు.. గత నెల 29న ఆయాసంగా అనిపించడంతో పాత ప్రసూతి ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షకు శాంపిల్ ఇచ్చారు. అదే రోజు అతడిని అధికారులు వికృతమాల క్వారంటైన్‌కు పంపించారు. ఈ నెల 7న ‘శాంపిల్ రిజెక్టెడ్’ అంటూ సమాచారం రావడంతో 8న మళ్లీ శాంపిల్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. దాని ఫలితం రాకనే 11వ తేదీన డిశ్చార్జి చేశారు. అతడు ఇంటికొచ్చిన రెండో రోజు (13వ తేది) రాత్రి తల్లికి జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు ఎదురయ్యాయి. 14వ తేది తెల్లవారుజామున సమస్య తీవ్రం కావడంతో 108కి ఫోన్ చేశారు. కానీ స్పందన లేదు. హడావిడిగా ఆటోలో స్విమ్స్‌కి తీసుకెళ్లారు.
ఆ రోజు నుంచే ఆస్పత్రి మూసేస్తున్నామని సిబ్బంది సమాధానమిచ్చారు. కొందరి సలహాతో పక్కనే ఉన్న పద్మావతి కొవిడ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆటోలో ఉన్న వృద్ధురాలిని చూడకుండానే వైద్యులు మందులు రాసిచ్చి వాడమన్నారు. ఎమర్జెన్సీ వార్డుకెళ్లి శాంపిల్ ఇస్తే.. రిజల్టు వచ్చాక చూద్దామంటూ సలహా ఇచ్చారు. తల్లీకొడుకులు (అతడిది మూడోసారి) శాంపిల్ ఇవ్వగా.. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు పోలీసులు ఫోన్ చేసి ఆయన తల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని సమాచారమిచ్చారు. అంబులెన్సు తీసుకొస్తున్నామని, అంతవరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. అయితే సాయంత్రం 6 గంటలపైన అంబులెన్సు వచ్చింది. డ్రైవరు తప్ప ఎవరూ లేకపోవడంతో కుటుంబీకులే ఆమెను వాహనం ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పటికీ అతడి రిజల్టు ఏమిటన్నది తెలియరాలేదు. ఈ పరిణామాలతో కుంగిపోయిన ఆ వ్యక్తి ‘ఆంధ్రజ్యోతి’కి ఫోనుచేసి ఆవేదన వెళ్లగక్కారు. ఆటో డ్రైవరు చూపిన మానవత్వం కూడా వైద్యులు చూపలేదన్నారు.
నా పరిస్థితి ఏమిటో?
బాధితుల నుంచి కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రక్రియలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు చాలా కీలకం. క్వారంటైన్‌లో ఉంచి కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ వస్తే కొవిడ్ ఆస్పత్రికి.. నెగటివ్ వస్తే జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపాలి. కానీ, ఏదీ తేల్చకండా నిర్లక్ష్యంతో ఇంటికి పంపేయడం ఏ ప్రమాణాలతో చూసినా తప్పే. మూడు సార్లు శాంపిల్స్ ఇచ్చినా రిజల్ట్ రాకపోవడం, తల్లికి పాజిటివ్ రావడంతో బీపీ, షుగర్‌తో బాధపడుతున్న తన పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన చెందుతున్నారు. భార్య, చిన్న పిల్లలు కూడా ప్రమాదంలో పడినట్టేనని వాపోయారు. కాగా, తల్లికి పాజిటివ్ వచ్చినా వీరి కుటుంబాన్ని క్వారంటైన్‌కు పంపలేదు. ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్ష చేసుకోండని వలంటీరు చెప్పారన్నారు.