స్త్రీల ఉన్నతికి మళయాళస్వామి కృషి
ABN , First Publish Date - 2020-02-08T12:12:31+05:30 IST
ఏర్పేడు వ్యాసాశ్రమంలో గురుపూజోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమైనాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరిస్వామి లాంఛనంగా ప్రారంభించారు.

- 1927లో వ్యాసాశ్రమంలో కన్య గురుకులం ఏర్పాటు
- ఆ సందర్భాన్ని స్మరిస్తూ గురుపూజోత్సవాలు
ఏర్పేడు: ఏర్పేడు వ్యాసాశ్రమంలో గురుపూజోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమైనాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరిస్వామి లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు ఉత్సవంలో ఆశ్రమ వ్యవస్థాపకులు మళయాళస్వామి పాదుకలకు పరిపూర్ణానందస్వామి ప్రత్యేక అభిషేక పూజలను చేశారు. ఆశ్రమంలో ఉన్న కన్య గురుకులం, అధిష్ఠాన మందిరం, బుగ్గబావి మొదలగు ప్రదేశాలను పూలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దారు.
పురుషులతో సమానంగా స్త్రీలను ప్రత్యేకంగా గౌరవించి సమాజంలో వారికి గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మళయాళస్వామి 1927లో కన్య గురుకులాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వ్యాసాశ్రమంలో గురుపూజోత్సవాలు జరుగుతున్నాయి. మాఘమాసంలో వచ్చే త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి రోజుల్లో గురుపూజోత్సవాలు జరపాలని మళయాళస్వామి నిర్ణయించారు. ఆయన నిర్ణయం ప్రకారం ప్రతి యేడాది మాఘమాసంలో ఈ గురుపూజోత్సవాలు జరుగుతున్నాయి. తొలిరోజు స్త్రీలు, పురుషులు స్వామివారి పాదుకలకు పూజలు చేశారు. ఆరుగురు స్త్రీలు, ఆరుగురు పురుషులకు పూజాదికాలు నిర్వహించారు. ఈ పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, పూర్వవిద్యార్థులు, ఆశ్రమ విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు స్త్రీల పూజ
గురుపూజోత్సవాల్లో రెండో రోజు శనివారం స్త్రీల పూజ జరగనుంది. ఈ పూజల్లో స్త్రీలు పెద్దసంఖ్యలో పాల్గొని మళయాళస్వామి పాదుకలకు పూజలు చేస్తారు. వ్యాసాశ్రమానికి అనుబంధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమాల పీఠాధిపతులు ఈ ఉత్సవానికి హాజరవుతారు.
తెలుగునాట ఆధ్యాత్మిక గ్రంథాలు స్వామి చలవ
వ్యాసాశ్రమ వ్యవస్థాపకుడు మళయాళస్వామి 1885లో కేరళ రాష్ట్రంలోని గురువాయర్ ఎన్ గంజూరులో జన్మించారు. కులమత బేధాలు లేకుండా మన సంస్కృతి, భాష అందరికీ అందాలని ప్రబోధించిన నారాయణ గురుకు ప్రథమ శిష్యుడు మళయాళస్వామి. ఈయన 1913 నుంచి 1925 వరకు 12 సంవత్సరాల పాటు తిరుమలలోని గోగర్భంలో తపస్సు చేశారు. 1926లో ఏర్పేడులో వ్యాసాశ్రమాన్ని స్థాపించి ఎందరికో ఆశ్రయం కల్పించారు.
1962లో మళయాళస్వామి కాలధర్మం చెందారు. ఆయన మృతదేహాన్ని ఆశ్రమ ప్రాంగణంలోని అధిష్టాన మందిరంలో ఖననం చేసి ఆ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన విగ్రహానికి ముందు భాగంలో ఆయన పాదుకలను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఆశ్రమ భక్తులు, పీఠాధిపతులు ఈ గురుపూజోత్సవాల్లో ఆయన పాదుకలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దయగల హృదయమే భగవన్నియలయమని, మానవసేవే మాధవ సేవని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మళయాళస్వామి. తెలుగు నాట ప్రతి ఇంటా భగవద్గీత, గీతాపారాయణం ఇంత ప్రాచుర్యం పొందాయంటే మళయాళస్వామి ప్రయత్నం వలనే సాధ్యమైంది. అట్టడుగు వర్గాల మహిళలు కూడా జిజ్ఞాసులుగా మారారంటే అది ఆయన చలవే. ఎందరో పేద విద్యార్థులకు, సాధువులకు వ్యాసాశ్రమం నిలయమై భాసిస్తోంది.