కరోనా అనుమానితుడు వస్తే ఏం చేయాలి?

ABN , First Publish Date - 2020-03-23T10:15:57+05:30 IST

కరోనా సోకిందన్న అనమానాలపై విదేశాల నుంచి వచ్చిన యువకుడు వస్తే ఏం చేయాలి? చేపట్టాల్సిన జాగ్రత్తలు.. వైద్య సేవలు తదితరాలపై ఆదివారం తిరుపతిలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

కరోనా అనుమానితుడు వస్తే   ఏం చేయాలి?

రుయా వైద్యులు, సిబ్బందికి మాక్‌ డ్రిల్‌ 


తిరుపతి (వైద్యం), మార్చి 22: కరోనా సోకిందన్న అనమానాలపై విదేశాల నుంచి వచ్చిన యువకుడు వస్తే ఏం చేయాలి? చేపట్టాల్సిన జాగ్రత్తలు.. వైద్య సేవలు తదితరాలపై ఆదివారం తిరుపతిలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఎస్వీ వైద్య కళాశాల, రుయా వైద్యులు కలిసి ఈ ప్రదర్శన చేపట్టారు. ఆ మాక్‌ డ్రిల్‌ ఇలా సాగింది.. ‘విదేశాల నుంచి వచ్చిన నాకు కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంగా ఉంది. వైద్యం అందించండి’ అంటూ రుయాస్పత్రిలోని ఐసొలేషన్‌ వార్డుకు ఓ యువకుడు వచ్చాడు. వెంటనే వైద్యులు, సిబ్బంది అప్రమత్తమై వ్యక్తికి మాస్కు ధరింపజేశారు. మీటరు దూరంలో కూర్చొబెట్టి.. పేరు, వయసు, ఏ దేశం నుంచి వచ్చారు, తరచూ విదేశాలకు వెళ్తారా? ఇండియాకు వచ్చాక ఎప్పటి నుంచి ఆరోగ్యం బాగలేదు అంటూ ప్రశ్నించారు. దగ్గు, జలుబు ఉందా? ముక్కులోంచి నీరు కారుతోందా? గొంతు నొప్పిగా ఉందా? శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయా? విరేచనాలు అవుతున్నాయా అంటూ ఆరోగ్య సమస్యలను నోట్‌ చేసుకున్నారు.


పాస్‌ పోర్టు వివరాలు, ఇంటి చిరునామా నమోదు చేసుకున్నారు. స్వీడెన్‌ దేశానికి వెళ్లిన మీరు మధ్యలో చైనాలో ఏమైనా పర్యటించారా? ఇండియాలో ఏ విమానాశ్రయంలో దిగారు? తిరుపతికి వచ్చేవరకు మధ్యలో ఎక్కడ తిరిగారు? ఎవరిని కలిశారంటూ సమాచారం రాబట్టారు. ఆపై ఆ యువకుడికి శానిటైజేషన్‌ చేసి, వైద్య పరీక్షల కోసం ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు, గొంతు, ముక్కులోంచి స్వాబ్‌, రక్తం శాంపిల్స్‌ను సేకరించి వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు వచ్చే వరకు అతడిని వార్డులో అడ్మిట్‌ చేసి, ప్రాథమిక వైద్య సేవలు అందిస్తామని వైద్యులు తెలిపారు. ఇలా మాక్‌ డ్రిల్‌ సాగింది. ఈ కార్యక్రమంలో ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జయభాస్కర్‌, రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్వీ రమణయ్య, మెడిసిన్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ ఐవీ రామచంద్రరావు, డాక్టర్‌ సుబ్బారావు, అసిస్టెంట్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ హరికృష్ణ, డాక్టర్‌ ఫయీమ్‌, డాక్టర్‌ శ్రీనివాసులు, డాక్టర్‌ హరికుమార్‌, ఉమా మహేశ్వర్‌ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-03-23T10:15:57+05:30 IST