తాళం వేశారు.. తలుపులు తెరిచారు

ABN , First Publish Date - 2020-06-04T10:39:15+05:30 IST

గొళ్లెం పెట్టకుండా తాళం వేసినట్టుగా మారింది అయిదో లాక్‌డౌన్‌ తీరు. లాక్‌డౌన్‌ నెలాఖరుదాకా కొనసాగుతుందని చెప్పి అన్నీ ..

తాళం వేశారు.. తలుపులు తెరిచారు

విరుచుకుపడుతున్న వైరస్‌

పెరుగుతున్న మరణాలు


తిరుపతి- ఆంధ్రజ్యోతి:గొళ్లెం పెట్టకుండా తాళం వేసినట్టుగా మారింది అయిదో లాక్‌డౌన్‌ తీరు. లాక్‌డౌన్‌ నెలాఖరుదాకా కొనసాగుతుందని చెప్పి అన్నీ తెరిచేయడంతో కరోనా వైరస్‌కూడా స్వేచ్ఛగా విజృంభిస్తోంది. యుద్ధదీక్షతో విధులు నిర్వహించిన అధికార యంత్రాంగం, మద్యం అనుమతి తర్వాత నిస్తేజంగా మారిపోయింది. ముక్కుకి మాస్కు, చేతులకు శానిటైజర్‌ పూసుకుంటే చాలు అనే భ్రమలో జనం కూడా పడిపోయారు. జనజీవనం సాధారణం అయ్యేకొద్దీ కరోనా కేసులూ పెరుగుతున్నాయి. పట్టణాలకే పరిమితమైన కేసులు పల్లెలకూ విస్తరిస్తున్నాయి. తాజా పరిణామాలతో చిత్తూరు జిల్లా అతలాకుతలం అవుతోంది.


భవిష్యత్తు భయపెడుతోంది. నిదానంగా జిల్లాలో మరణాలు కూడా పెరగడం ప్రమాద తీవ్రతను హెచ్చరిస్తోంది. ప్రభుత్వం చేతులెత్తేసింది కదా అని ప్రజలు కూడా అన్నీ వదిలేస్తే మాత్రం దారుణ ఫలితాలు చవిచూడాల్సి వస్తుంది. సామాజిక వ్యాప్తి దశలోకి ప్రవేశిస్తే మాత్రం జిల్లాలో వైరస్‌ అదుపు అసాధ్యం అవుతుంది. 


కరోనాకు బార్లా తెరిచిన సరిహద్దులు

అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో నిమిత్తం లేకుండా జిల్లాలోకి జనం రాక విపరీతంగా పెరిగిపోయింది. జిల్లా నుంచీ విద్యార్థులు, వలస కూలీలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇతర ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు... ఇలా వేలాది మంది ఇతర రాష్ట్రాల్లో వుంటున్నారు. వీరితో పాటు అనేక పనుల మీద తాత్కాలికంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వారు కూడా లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో సంబంధం లేకుండా చాలా రోజుల కిందటే ఇలాంటి వారు జిల్లాకు తిరిగి రావడం మొదలైంది. ఇపుడు కేంద్రం అనుమతితో తిరిగొస్తున్న వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. వాస్తవానికి జిల్లాలోని స్వస్థలాలకు తిరిగి వస్తున్న వారు తాము వస్తున్న రాష్ట్రం నుంచీ లేదా ఏపీ ప్రభుత్వం నుంచీ అనుమతులు పొందాలి. కానీ జిల్లాకు రోజువారీ వస్తున్న వారిలో 10 శాతం మంది మాత్రమే ఇలా అనుమతులు కలిగి వుంటున్నారు.


మిగిలిన 90 శాతం మంది వీలైన మార్గాల్లో సరిహద్దులు దాటి జిల్లాలో అడుగుపెడుతున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో వున్నందున యాదమరి, వి.కోట వంటి మండలాల్లో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద రాకపోకలను కఠినంగా నియంత్రిస్తున్నారు. మిగిలిన చోట్ల ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా రాత్రిళ్ళు కార్లు, జీపులు, ద్విచక్ర వాహనాల్లో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచీ జనం సరిహద్దులు దాటి జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. చెక్‌పోస్టుల్లో సిబ్బంది మామూళ్ళు తీసుకుని వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. కర్నాటక, తమిళనాడుల నుంచీ యువకులు రాత్రిళ్ళు ద్విచక్ర వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధాన రహదారులు వదిలేసి సరిహద్దులకు చేరువగా వున్న గ్రామాల మీదుగా జిల్లాలోకి వచ్చి వెళుతున్నారు.  వీరికి వైద్య పరీక్షలు జరగడం లేదు. వలంటీర్లు గుర్తించి అధికారులకు సమాచారమిచ్చిన చోట్ల మాత్రం కరోనా టెస్టులు చేయించడం జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచీ వస్తున్న వారిలో అత్యధికులు హోమ్‌ క్వారంటైన్‌ పాటించడం లేదు. కుటుంబీకులతో, బంధుమిత్రులతో, స్వస్థలాల్లో పరిచయస్తులతో కలుస్తున్నందున వైరస్‌ సులువుగా వ్యాపిస్తోంది.


కుటుంబీకులు, బంధుమిత్రులే కాకుండా సంబంధం లేని పలువురు ఇతరుల్ని కూడా ఇలాంటి వ్యక్తులు వైరస్‌ బారినపడేలా చేస్తున్నారు. జిల్లాలో ఇపుడు నమోదవుతున్న కేసుల్లో 90 శాతం కేసులు ఇతర రాష్ట్రాల నుంచీ వస్తున్నవారివి, వారి ద్వారా కుటుంబీకులకు సోకుతున్నవే కావడం గమనార్హం. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా వీరి రాక విషయం దాచిపెడుతున్నారు. 


 నిబంధనలు హుష్‌..కాకీ!

జిల్లాలో జనం ఇళ్ళ వెలుపలకు వచ్చినపుడు నిబంధనలు పెద్దగా పాటించడం లేదు. చాలామంది మాస్కులు ధరించకుండా, శానిటైజర్లు లేకుండానే రోడ్ల మీద కనిపిస్తున్నారు.


మున్సిపల్‌ పట్టణాలు, నగరాల్లో రోడ్లన్నీ లాక్‌డౌన్‌కు మునుపటి తరహాలోనే వాహనాలతో రద్దీగా మారాయి.


ద్విచక్రవాహనాల్లో ఒక్కరే ప్రయాణించడాల్సి వుండగా ఇద్దరు, ముగ్గురు ప్రయాణిస్తున్నారు.


కార్యాలయాల్లో, దుకాణాల్లో, మద్యం షాపుల వద్ద జనం భౌతిక దూరం పాటించడం లేదు.


పట్టణాల్లో ఆటోల్లో మునుపటి తరహాలోనే కిక్కిరిసిన ప్రయాణాలు సాగుతున్నాయి.


పూర్తిగా రెడ్‌జోన్‌ పరిధిలో వున్న శ్రీకాళహస్తి పట్టణంలో కూడా ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ జనసంచారం యధేచ్చగా సాగుతోంది. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడంలేదు.


చిత్తూరు నగరంలో 80 శాతం మంది జనం మాస్కులు ధరించడం లేదు.


తిరుపతిలో మాస్కు లేకుండా కనిపిస్తే రూ. 500 జరిమానా విధిస్తామన్న కమిషనర్‌ హెచ్చరికలు గాలిలో కలిశాయి. పలు కూడళ్ళలో తరచూ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.


పుంగనూరు పట్టణం నాగపాళ్యంలో లాక్‌డౌన్‌కు మునుపటి రీతిలో జనం రద్దీ అగుపించింది.


బ్యాంకుల వద్ద కూడా ఖాతాదారులు ఒకరికొకరు ఎడంగా కాకుండా గుంపులుగా గుమిగూడి వుంటున్నారు.


మదనపల్లెలో వ్యాపారాలకు పేరుపడిన అప్పారావు వీధిలో వాహనాల ట్రాఫిక్‌, జనం రద్దీ ఆందోళన కలిగిస్తోంది.


పీలేరు, వాల్మీకిపురం, కలికిరి ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణీకులు భౌతికదూరం నిబంధనకు తిలోదకాలిచ్చారు. 


ప్రభుత్వ ఆఫీసుల్లో తీరు ఇది..


నిమ్మనపల్లెలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, గ్రామ సచివాలయ సిబ్బందితో బుధవారం ఎంపీడీవో లక్ష్మీపతి నిర్వహించిన సమావేశంలో ఎవరూ మాస్కులు ధరించకపోగా కనీసం భౌతికదూరం కూడా పాటించలేదు.


పుంగనూరు సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయంలో బుధవారం పనులపై వచ్చినవారు భౌతికదూరం పాటించకుండా గుంపులుగా కనిపించారు.


మదనపల్లె సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయం వద్ద పనులపై వచ్చిన జనం భౌతిక దూరం మరిచారు.


పీలేరు మండలంలోని పలు గ్రామ సచివాలయాల్లో సిబ్బంది కూడా మాస్కులు ధరించలేదు.


ప్రజాప్రతినిధులకేదీ బాధ్యత?


పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనల సందర్భంగా కార్యకర్తలు, జనం అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.


రామసముద్రంలో కూడా ఎమ్మెల్యే నవాజ్‌ బాషా పర్యటనలకు జనం అధికసంఖ్యలో గుమి గూడుతున్నారు.


చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు బుధవారం కూరగాయల పంపిణీ, ఉచిత నీటి ట్యాంకర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించగా కార్యకర్తలు, ప్రజలు మాస్కులు లేకుండానే గుంపులుగా పాల్గొన్నారు.


యంత్రాంగం మేలుకోకుండా పెను ప్రమాదం తప్పదు!

గతంలో లాక్‌డౌన్‌ నిబంధనలు కొంత కఠినంగా అమలు కావడంతో శారీరక ధారుడ్యం కలిగిన మగవారు, యువకులు మాత్రమే ఇళ్ళు వదిలిపెట్టి బయటకు వచ్చి పనులు చూసుకుని వెళ్ళడం జరిగింది. మహిళలు చాలా పరిమితంగానే ఇళ్ళు దాటి వచ్చారు. దీనివల్ల తొలి, మలి దశల్లో కరోనా వైరస్‌ 50 ఏళ్ళ లోపు వారికే సోకింది. వృద్ధులకు సోకడం అరుదుగానే జరిగింది. దానివల్లే జిల్లాలో ఆ రెండు దశల్లో మరణాలు సంభవించలేదు. వయసు తక్కువగా వుండడం, శారీరకంగా పటుత్వంతో వున్నందున కోవిడ్‌ బారి నుంచీ సులువుగా బయట పడగలిగారు. అయితే కోయంబేడు మూలాలు ఈ హద్దులను చెరిపివేశాయి.


కోయంబేడు మార్కెట్‌కు రాకపోకలు సాగించిన వారు, వారి ద్వారా కుటుంబీకులు, పరిచయస్తులు ఇలా పలువురు వైరస్‌ బారినపడ్డారు. వారిలో వృద్ధులు, చిన్న పిల్లలు కూడా వున్నారు. ఇపుడు ఇతర రాష్ట్రాల నుంచీ జిల్లావాసులు స్వస్థలాలకు వచ్చేస్తుండడంతో వైరస్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా చిన్న పిల్లల దగ్గర నుంచీ వృద్ధులు కూడా అధికంగా బాధితులవుతున్నారు. వృద్ధులు బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండడం, రోగ నిరోధకశక్తి తక్కువగా వుండడం వంటి కారణాలతో సులువుగా మృత్యువాతపడే అవకాశాలేర్పడుతున్నాయి. బుధవారం ఉదయం సంభవించిన రెండు కరోనా మరణాలూ ఈ తరహావే కావడం గమనార్హం. ఇతర రాష్ట్రాల నుంచీ వస్తున్న వారితో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి దశలోకి ప్రవేశిస్తోంది.


 ఇవి చేయండి


సరిహద్దులు దాటే ప్రతి ఒక్కరినీ క్వారంటైన్‌ కేంద్రానికి లేదా హోమ్‌ క్వారంటైన్‌ పాటించేలా చూడాలి.


మాస్కులు, శానిటైజర్ల వాడకాన్ని తప్పనిసరి చేయాలి. జరిమానా విధించాలి.


దుకాణాలు, కార్యాలయాల్లో భౌతికదూరం పాటించని వారికి కూడా జరిమానా విధించాలి. 


రోడ్లపై వాహనాల రాకపోకలను కఠినంగా నియంత్రించాలి.

 

వాహనాల్లో ప్రయాణీకుల సంఖ్యను కూడా నియంత్రించాలి.

 

కూరగాయలు, పళ్ళు, సరుకుల కొనుగోలు సందర్భంగా జాగ్రత్తలు పాటించేలా జనాన్ని చైతన్యవంతం చేయాల్సివుంది.


Updated Date - 2020-06-04T10:39:15+05:30 IST