-
-
Home » Andhra Pradesh » Chittoor » Lockdown again if not followed
-
జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ లాక్‌డౌన్
ABN , First Publish Date - 2020-06-23T10:31:28+05:30 IST
తిరుపతి నగరపాలకసంస్థ పరిధిలో ప్రస్తుతం 149 కరోనా కేసులు ఉన్నాయని, తగు జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ లాక్‌డౌన్ అమలు ..

మనముందున్న లక్ష్యం కొవిడ్‌ను జయించడమే
అభివృద్ధి కార్యక్రమాలకు ఢోకా లేదు ఫ కమిషనర్‌గా గిరీష బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది
తిరుపతి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరపాలకసంస్థ పరిధిలో ప్రస్తుతం 149 కరోనా కేసులు ఉన్నాయని, తగు జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ లాక్‌డౌన్ అమలు చేసే అవకాశం ఉందని కమిషనర్ గిరీష తెలిపారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి మంగళవారంతో ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. గత వారం రోజులుగా తిరుపతిలో ప్రమాదకర రీతిలో కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయన్నారు. 200 కేసులు దాటితే లాక్‌డౌన్ కఠినంగా ఉంటుందన్నారు. వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వే చేపట్టి, కొవిడ్ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటికి 2వేల మందికి పైగా పరీక్షలు చేయగా, అందులో అనూహ్యంగా 10 పాజిటివ్ కేసులు తేలాయన్నారు. అంటే వైరస్ సామాజిక వ్యాప్తి దశలో ఉన్నట్టు అర్థమవుతోందన్నారు.
ఇలాంటి వారిని మరో మూడు వేల మందిని గుర్తించామని, వారి నమూనాలనూ పరీక్షలు చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత అన్ని కార్పొరేషన్లలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. రాబోవు ఒకటి, రెండు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలో 24 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని కమిషనరు గిరీష చెప్పారు. బయటనుంచి వచ్చినవారు హోమ్ క్వారంటైన్‌లో ఉండకుండా బాధ్యతలేకుండా తిరిగేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి మనకు తెలియకుండా చాలామంది వచ్చేస్తున్నారన్నారు.
అలాంటి వారినుంచి వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు. నగరంలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి డోకాలేదన్నారు. అయితే కొవిడ్ కారణంగా మూడు నెలలుగా తిరుపతిలో ఆర్థికంగా అన్ని వర్గాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడు మనముందున్న కర్తవ్యం కొవిడ్‌ను జయించడమేనని, ఆదిశగా అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని గిరీష విజ్ఞప్తి చేశారు.