లాక్‌ డౌన్‌ అంతంతమాత్రమే

ABN , First Publish Date - 2020-03-30T11:21:10+05:30 IST

తిరుపతిలో ఆదివారం లాక్‌డౌన్‌ అసంపూర్ణమనే చెప్పాలి. శనివారం అర్ధరాత్రి నుంచి పలు చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద జనం కిటకిటలాడారు.

లాక్‌ డౌన్‌ అంతంతమాత్రమే

తిరుపతి, మార్చి29 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఆదివారం లాక్‌డౌన్‌ అసంపూర్ణమనే చెప్పాలి. శనివారం అర్ధరాత్రి నుంచి పలు చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద జనం కిటకిటలాడారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు ఇంటినుంచి బయటకు రావద్దని స్థానిక ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, కమిషనర్‌ గిరీష విజ్ఞప్తి చేశారు. రేషన్‌ పంపిణీ సందర్భంగా ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కువ చోట్ల సామాజిక దూరం పాటించలేదు. జీవకోన, మంగళం ప్రాంతాల్లో బారులు తీరారు. ప్రభుత్వం ఆదేశించినా, రేషన్‌షాపుల వద్ద శానిటైజర్‌, సబ్బు, నీళ్లు ఉంచలేదు. కొన్నిచోట్ల టోకెన్లు ఇచ్చి ఖాళీ సమయాల్లో సరుకులు తీసుకోమని చెప్పారు. వార్డు వలంటీర్లు ఇంటికి తెచ్చి రేషన్‌ ఇవ్వడం ఎక్కడా కనిపిపించలేదు. కాగా సరుకుల పంపిణీలో జాప్యం, ఎండ కారణంగా జనం  ఇబ్బంది పడ్డారు. ఏప్రిల్‌ 15వ తేది వరకు రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తామని కమిషనర్‌ గిరీష తెలిపారు. ఇంటికి ఒకరే రావాలని, కార్డుదారులందరికీ సరుకులు ఇస్తామన్నారు. 


ఉదయం 9 వరకు చికెన్‌.. మాంస దుకాణాలు 

నగరంలో చికెన్‌, మటన్‌ షాపులకు కమిషనరు గిరీష షరతులతో కూడిన అనుమతులిచ్చారు. ఉదయం  నాలుగు గంటలకే కేజీ, ఆరకేజీ లెక్కన అంతా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొనుగోలుదారులు  దూరం పాటించేలా ఇద్దరిని ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది, కొనుగోలుదారులు కచ్చితంగా మాస్క్‌లు ధరించాలన్నారు. చికెన్‌ కోసం ఒకేసారి ఎక్కువ మంది వస్తే టోకెన్‌ ఇచ్చి.. అరగంట, గంట తర్వాత మాసం ఇచ్చిపంపాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే దుకాణాన్ని సీజ్‌ చేసి, లైసెన్స్‌ రద్దుచేస్తామని హెచ్చరించారు. 


మున్సిపల్‌ గ్రౌండ్‌లో మార్కెట్‌పై విమర్శలు

నెహ్రూ మున్సిపల్‌ గ్రౌండ్‌లో మార్కెట్‌ ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఎదురుగా మెటర్నిటీ ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్‌ వార్డు ఉంది. అందులో పాజిటివ్‌ వచ్చిన ఒకరు చికిత్స పొందుతున్నారు.  ఈ పరిస్థితుల్లో కూరగాయల మార్కెట్‌ ఉండడం మంచిది కాదంటున్నారు. ఒకవేళ మార్కెట్‌ను మార్చలేకపోతే వెనుకగేటు నుంచే ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని  పలువురు కోరుతున్నారు.  నేడు మాస్‌ శానిటైజేషన్‌

నగరంలోని నంది సర్కిల్‌ నుంచి లీలామహల్‌ సర్కిల్‌, అత్తూరు డాబా వరకు, జీవకోన, శివజ్యోతి నగర్‌, సుబ్బారెడ్డి నగర్‌, అక్కారంపల్లె ప్రాంతాల్లో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మాస్‌ శానిటైజేషన్‌ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, కమిషనరు గిరీష తెలిపారు. శానిటేషన్‌, బ్లీచింగ్‌, సోడియ హైపో క్లోరైడ్‌ ప్రతి ఇంటి వద్ద, వీధుల్లో పిచికారీ చేసి మాస్‌ క్లీనింగ్‌ చేపట్టాలన్నారు. ఆదివారం వీరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పాజిటివ్‌ కేసులు వస్తే.. ఆయా ప్రాంతీఆల్లో గంట సమయంలోనే చర్యలు చేపట్టేందుకు ర్యాపిడ్‌ రెస్పాండ్‌ టీమ్‌ను సిద్ధం చేశామన్నారు. రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. టీ అంగళ్ల వద్ద గుమికూడటం వల్ల ఎక్కువ మందికి సోకే ప్రమాదముందన్నారు. సోమవారం నుంచి రేషన్‌, నిత్యావసరాల దుకాణాలు తప్ప ఇతర షాపులు తెరవకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే దుకాణాలను సీజ్‌ చేసి భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంచేస్తే చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. ఉప కమిషనర్‌ చంద్రమౌళేశ్వరరెడ్డి, డీఈ విజయకుమార్‌రెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్లు గోవర్ధ్దన్‌, చెంచయ్య పాల్గొన్నారు.


Updated Date - 2020-03-30T11:21:10+05:30 IST