తనివితీరా స్వామి దర్శనం!

ABN , First Publish Date - 2020-03-21T11:05:51+05:30 IST

శ్రీవారిని గురువారం తిరుమల స్థానికులు కనులారా దర్శించుకున్నారు. అధికారులు కల్పించిన అరుదైన అవకాశాన్ని ఆనందంగా వినియోగించుకున్నారు.

తనివితీరా స్వామి దర్శనం!

క్యూలైన్ల మూసివేతకు ముందు 

శ్రీవారిని దర్శించుకున్న స్థానికులు


తిరుమల, మార్చి 20: శ్రీవారిని గురువారం తిరుమల స్థానికులు కనులారా దర్శించుకున్నారు. అధికారులు కల్పించిన అరుదైన అవకాశాన్ని ఆనందంగా వినియోగించుకున్నారు. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే స్వామి దర్శనం లభించడంతో ఒక్కొక్కరు రెండుమూడు సార్లు కూడా స్వామిని మనసారా దర్శించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తిరుమలలోనే ఉంటున్న తాము తమఊరి దైవాన్ని స్పష్టంగా, తనివితీరా దర్శించుకునే అవకాశం లభించడం లేదని మదనపడుతున్న వీరంతా శుక్రవారం ఆ కొరత నుంచి బయటపడ్డారు. స్థానికులతో పాటు టీటీడీ, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, పోలీసు, ఆరోగ్య సిబ్బంది, ప్రెస్‌, సిబ్బంది  కూడా అతి తక్కువ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. 


అనుకోకుండా...

శ్రీవారి దర్శనార్థం ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన ఓ వృద్ధుడిలో కరోనా లక్షణాలు కనపడడంతో పాటు, ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ వారం రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేసింది. గురువారం మధ్యాహ్నం వరకు తిరుమలకు చేరుకున్న భక్తులందరికి అర్థరాత్రిలోపు దర్శనం పూర్తిచేయించి శుక్రవారం వేకువజాము నుంచి అన్ని రకాల దర్శనాలను రద్దు చేస్తున్నట్టు అధికారులు ముందుగా ప్రకటించారు. అయితే శుక్రవారం సుప్రభాతం, అభిషేకం సేవాటికెట్ల భక్తులతో పాలు పలువురు వీఐపీలు గురువారం ఉదయానికే తిరుమలకు చేరుకున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది.


దీంతో వారందరికీ దర్శనం పూర్తిచేయించి ఆ తర్వాత క్యూలైన్లు మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆమేరకు సుప్రభాతం, అభిషేకం, వీఐపీ బ్రేక్‌ కలిపి మొత్తం 1,074 మందికి దర్శనం చేయించారు. ఈలోపు   తిరుమలలోని స్థానికులు కొందరు శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. క్యూలైన్లు ఖాళీగానే ఉండడంతో స్థానికులతో పాటు, అప్పటిదాకా క్యూకాంప్లెక్స్‌ వద్దకు వచ్చిన వారందరికి సంతృప్తిగా దర్శనం చేయించి ఆ తర్వాత క్యూలైన్లు క్లోజ్‌ చేయమని ఆదేశాలు వచ్చాయి. ఈ సమాచారం క్షణాల్లో తిరుమలలో వ్యాపించడంతో  బాలాజీనగర్‌, ఆర్బీ సెంటర్‌లలో ఉండే స్థానికులు కుటుంబాలతో సహా తరలివచ్చి  మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీవారిని మనసారా దర్శించుకున్నారు. ఆలయంలో సిబ్బంది ఎవ్వరినీ నెట్టకపోవడంతో తనివితీరా స్వామిని దర్శించుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇలా మొత్తం 5,684 మంది స్థానికులు, సిబ్బందికి సంతృప్తికర దర్శనం లభించింది. 


చాలా రోజుల తర్వాత మంచి దర్శనం లభించింది..రేవతి, స్థానికురాలు

చాలా ఏళ్లుగా తిరుమలలోనే ఉంటున్నాం. రద్దీ లేదనప్పుడు స్వామి దర్శనానికి వెళుతుంటాం. అప్పుడు కూడా దాదాపు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. కానీ ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలో స్వామిని దర్శించుకున్నాం. చాలా రోజుల తర్వాత మంచి దర్శనం లభించింది. వీఐపీ తరహాలో నేరుగా వెళ్లి స్వామిని చూశాం(నవ్వుతూ). స్థానికంగా ఉన్న మేము ఈవాళ  కళ్లనిండుగా దేవుణ్ని చూడగలిగాం.

                                        

అనుకోకుండా రెండు సార్లు దర్శించుకున్నాం... నాగమణి, స్థానికురాలు  

క్యూలైన్లు ఖాళీగా ఉన్నాయని, కొద్దీ సేపట్లో దర్శనం మూసేస్తారని మా ఇంటి పక్కన వాళ్లు చెప్తుంటే విన్నాం. వెంటనే ఆలయం దగ్గరికి రాగా అందరిని ఆలయంలోకి పంపుతున్నారు. ఇక వెంటనే పిల్లలతో కలిసి దర్శనానికి వెళ్లాం. వెంటనే దర్శనం పూర్తికావడంతో రెండోసారి కూడా స్వామిని దర్శించుకున్నా. అనుకోకుండా రెండు సార్లు స్వామిని చూసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడు ఇలాంటి దర్శనం చేసుకోలేదు. 

Updated Date - 2020-03-21T11:05:51+05:30 IST