చిన్నారుల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా ?

ABN , First Publish Date - 2020-03-24T10:42:42+05:30 IST

పసిపిల్లల క్షేమాన్ని ఐసీడీఎస్‌ అధికారులు గాలి కొదిలేసినట్టున్నారు. ఈనెల 31 వరకూ అంగన్‌వాడీలను మూసివేయాల్సిందిగా శనివారం ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి కె.దమయంతి టెలీ కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేసినప్పటికీ సోమవారం జిల్లాలో పలుచోట్ల అంగన్‌వాడీలను యధావిధిగా తెరిచారు.

చిన్నారుల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా ?

 అంగన్వాడీలకు ఆలస్యంగా సెలవులు

సోమవారమూ కేంద్రాల్లో గుంపులుగానే చిన్నారులు


     చిత్తూరు/చిత్తూరు అర్బన్‌ మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పసిపిల్లల క్షేమాన్ని ఐసీడీఎస్‌ అధికారులు గాలి కొదిలేసినట్టున్నారు. ఈనెల 31 వరకూ అంగన్‌వాడీలను మూసివేయాల్సిందిగా శనివారం ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి కె.దమయంతి టెలీ కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేసినప్పటికీ సోమవారం జిల్లాలో పలుచోట్ల అంగన్‌వాడీలను యధావిధిగా తెరిచారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పిల్లల్ని ఇలా ఒకేచోట గుంపులుగా కూర్చోబెట్టడం ఏమిటని ప్రశ్నిస్తే తమకు జిల్లా అధికారులనుంచి ఉత్తర్వులు అందలేదని నిర్వాహకుల సమాధానం. 


మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ వెంకటేశ్వరపురం, బి.కొత్తకోట మండలం బడికాయలపల్లె, సింగంవారిపల్లె, నిమ్మనపల్లె మండలం ఎగువమాచిరెడ్డిగారిపల్లె, తొట్టెంబేడు మండలం బసవయ్యపాలెం, కేవీబీపురం మండలం కొత్తూరు, ములకలచెరువు మండలం ఇందిరాకాలనీపీటీఎం మండలం కొండయ్యగారిపల్లె, పలమనేరు మండలం పెంగరగుంట అంగన్వాడీ కేంద్రాలు సోమవారం చిన్నారులతో కిటకిటలాడాయి.


చౌడేపల్లె, ఐరాల, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, రామకుప్పం వంటి మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు కేంద్రాలను తెరచి ఉంచినా చిన్నారులను వారి తల్లిదండ్రులు పంపలేదు. ఐసీడీఎస్‌ పీడీ ఉషాఫణికర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు 31వ తేదీ వరకూ సెలవులివ్వాలని ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు అందాయని, పౌష్టికాహార సరుకులను పిల్లలు, గర్భిణుల ఇళ్లకే చేరవేయనున్నట్లు చెప్పారు.  కేంద్రాలను మంగళవారం నుంచి నెలాఖరువరకు మూసేయాలని ఆదేశించామన్నారు. దీంతో ఎట్టకేలకు జిల్లాలోని 4768 అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడనున్నాయి. 

Updated Date - 2020-03-24T10:42:42+05:30 IST