కట్టుకున్నోడే కడతేర్చాడు..

ABN , First Publish Date - 2020-03-25T11:01:19+05:30 IST

అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను కట్టుకున్న భర్తే కుటుంబ సభ్యులతో కలిసి కడతేర్చిన ఘటన కురబలకోట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

కట్టుకున్నోడే కడతేర్చాడు..

పెద్దపల్లె వద్ద వివాహిత హత్య 


కురబలకోట, మార్చి 24: అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను కట్టుకున్న భర్తే కుటుంబ సభ్యులతో కలిసి కడతేర్చిన ఘటన కురబలకోట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు... మట్లివారిపల్లె పంచాయతీ పెద్దపల్లెకు చెందిన మల్‌రెడ్డి(32) ప్రైవేట్‌ బస్సు డైవర్‌. ఏడేళ్ల క్రితం మదనపల్లెకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.  వీరు బతుకుదెరువు నిమిత్తం మదనపల్లెకు వెళ్లి కాపురం పెట్టారు.  కొద్దిరోజులుగా ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో పలుమార్లు గొడవపడ్డారు.


కొద్దిరోజుల క్రితం భర్త కుటుంబసభ్యులతో కలిసి హత్య చేసి పెద్దపల్లెకు సమీపంలోని పొలంలో పూడ్చి పెట్టాడు. ఆనవాళ్లు తెలియకుండా పొలాన్ని దున్నేశాడు. తర్వాత తనకు ఏమీ తెలియనట్లు తన భార్య అదృశమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తల్లి తన కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగా పలువురిని విచారించారు. మృతురాలి భర్తపై అనుమానం రావడంతో అతనితో పాటు కుటుంబ సభ్యులను విచారించడంతో హత్య జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పూడ్చిన స్థలం వద్ద విచారణ చేపట్టారు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more