కొవిడ్ నిర్ధారణకు
ABN , First Publish Date - 2020-08-12T09:24:46+05:30 IST
కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ రాపిడ్, ట్రూనాట్, ఆర్టీపీఆర్ మాత్రమే ప్రామాణికమని స్విమ్స్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహ

సీటీ స్కాన్ ప్రామాణికం కాదు
స్విమ్స్ మెడిసిన్ విభాగాధిపతి అల్లాడి మోహన్
బంధువులు కోరితే కొవిడ్ మృతదేహాలివ్వాలన్న కలెక్టర్
తిరుపతి, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ రాపిడ్, ట్రూనాట్, ఆర్టీపీఆర్ మాత్రమే ప్రామాణికమని స్విమ్స్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ తెలిపారు. సీటీ స్కాన్‌లో వచ్చే కొవిడ్ అనేది ఐదు స్టేజ్లే ఉంటాయని, కొవిడ్ పాజిటివ్ ఆరో స్టేజ్‌గా కూడ ఉంటుందన్నారు. పద్మావతి కొవిడ్ ఆస్పత్రిలో బాధితులకు అందిస్తున్న చికిత్స విధానం, దాని అధ్యయనాలపై అల్లాడి మోహన్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులకు కలెక్టర్ భరత్‌గుప్తా తెలియజేశారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో డాక్టర్ అల్లాడి మాట్లాడుతూ.. శరీరంలో ఆక్సిజన్ శాతం 94 కన్నా తక్కువ ఉంటే చికిత్స అవసరం అవుతుందన్నారు.
కొవిడ్ సేవలందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీల్లో నిబంధనల్లో తేడాలు గమనించామని కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. అందరూ ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటించాలన్నారు. ఫీజులు, బిల్లుల విషయంలో పారదర్శకంగా ఉండాలన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఇప్పటికే ఒక ఆస్పత్రిలో అడ్మిషన్లు నిలిపేశామని తెలిపారు. స్వయంగా నిర్వహించిన తనిఖీల్లో పాజిటివ్ రిపోర్ట్‌తో అడ్మిషన్లు జరిగినా నమోదు రిజిస్టర్లో శాంపిల్ ఐడీ లేదన్నారు. తప్పనిసరిగా డాక్టర్లు, పారామెడికల్ 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. అనుమానిత, అత్యవసర కేసులు తప్పనిసరి కొవిడ్ నిర్ధారణ జరిపి, పాజిటివ్ అయితే ఆ ప్రాంత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
కొవిడ్ ఆస్పత్రుల్లో, అనుబంధ హోటళ్లలో ఫైర్ సేఫ్టీ డ్రిల్ జరపాలని సూచించారు ఆరోగ్యశ్రీ సేవలందించాలని, రూమ్ ఛార్జీలు, మెడిసిన్ అదనం అని ఉందని ఆమేరకే ఫీజులు ఉండాలన్నారు. బంధువులు అంగీకరిస్తే బాడీ బ్యాగ్‌లో డిస్ ఇన్ఫెక్షన్ చేసి మృతదేహాలను ఇవ్వాలన్నారు. ఒకవేళ కుటుంబీకులు కూడా ఐసొలేషన్‌లో ఉంటే ప్రైవేటు ఆస్పత్రులే దహన చర్యలు చేపట్టేలా అవగాహన కలిగి ఉండాలన్నారు. కొవిడ్, నాన్ కొవిడ్ వైద్యసేవలు విడివిడిగా చేయాలన్నారు. ఆస్పత్రులు, అనుబంధ హోటళ్ల వద్ద కొవిడ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డీఎంహెచ్‌వో పెంచలయ్య, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ బాలాంజనేయులు, పీడీ డ్వామా చంద్రశేఖర్, ఐఎంఏ రవిరాజు, ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు, డాక్టర్లు హాజరయ్యారు.
రుయా కొవిడ్ వార్డులో కలెక్టర్ తనిఖీ
రుయా కొవిడ్ వార్డులో కలెక్టర్ భరత్‌గుప్తా, జేసీ వీరబ్రహ్మం మంగళవారం రాత్రి పీపీఈ కిట్లు వేసుకుని అకస్మిక తనిఖీలు చేపట్టారు. కొవిడ్ బాధితులతో మాట్లాడారు. రుయాలో మెకనైజ్డ్ శానిటైజేషన్ విధానం అందుబాటులోకి రావాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. కొవిడ్ బాధితులకు ఆహారాన్ని సరఫరా చేసేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కొవిడ్ డ్యూటీల్లో ఉన్నవారి జాబితాను వార్డు ముందు ఉంచాలన్నారు. తమ తనిఖీల్లో డ్యూటీలో ఉన్నవారు లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.