స్ట్రాంగ్‌ రూమ్‌లోకి వెళ్లిపోయారు.. ఇక నగదు సర్దుకోవడమే తరువాయి.. ఆ సమయంలో..

ABN , First Publish Date - 2020-09-03T18:00:05+05:30 IST

స్ట్రాంగ్‌ రూమ్‌లోకి వెళ్లిపోయారు. ఇక నగలు, నగదు సర్దుకోవడమే తరువాయి. ఆ సమయంలో..

స్ట్రాంగ్‌ రూమ్‌లోకి వెళ్లిపోయారు.. ఇక నగదు సర్దుకోవడమే తరువాయి.. ఆ సమయంలో..

కొలమాసనపల్లె బ్యాంకులో దోపిడీ యత్నం 

గ్యాస్‌కట్టర్లతో స్ట్రాంగ్‌రూమ్‌ తలుపుల ధ్వంసం 

స్థానికుల కేకలతో పరారైన దుండగులు

ఇది మూడోసారి 


పలమనేరు(చిత్తూరు): స్ట్రాంగ్‌ రూమ్‌లోకి వెళ్లిపోయారు. ఇక నగలు, నగదు సర్దుకోవడమే తరువాయి. ఆ సమయంలో స్థానికుల కేకలతో దుండగులు పరుగు తీశారు. ఇలా దోపిడీకి విఫలయత్నం జరిగిన ఈ ఘటన పలమనేరు మండలం కొలమాసనపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకులో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ముగ్గురు దుండగులు బ్యాంకు వెనుక వైపు గోడకు కన్నం వేయడానికి ప్రయత్నించడంతో పెద్ద శబ్ధాలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఏదో జరుగుతుందనే అనుమానంతో గ్రామంలోని బ్యాంకు సిబ్బందికి సమాచారమిచ్చారు. ఇంతలోనే దుండగులు గోడకు వేసిన కన్నం నుంచి గ్యాస్‌కట్టర్లు, సిలిండర్లతో బ్యాంకు లోపలకు వెళ్లారు.


సీసీ కెమరాల సెన్సార్‌, అలారంతోపాటు ప్రధాన కరెంటు తీగలను తొలగించారు. గ్యాస్‌కట్టర్ల సాయంతో స్ట్రాంగ్‌రూమ్‌ తలుపులను కట్‌చేసి లోనికి వెళ్లారు. ఇంతలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. బ్యాంకులో ఎలాంటి శబ్ధం రాకపోవడం, దుండగులకు భయపడి పోలీసులకు సమాచారమిచ్చారు. ఇక సొమ్ము బ్యాగుల్లో నింపుకునే క్రమంలో దుండగులు స్ట్రాంగ్‌రూమ్‌లో లైటు వేశారు. లోపల దొంగలున్నారని గుర్తించి స్థానికులు కేకలు వేయడంతో వారు వెనుక వైపు కన్నం నుంచి పారిపోయారు. పలమనేరు సీఐ జయరామయ్య, ఎస్‌ఐ నాగరాజు అక్కడికి చేరుకొని చుట్టుప్రక్కల విసృతంగా తనిఖీలు చేసినా దుండగుల ఆచూకీ లభించలేదు. బ్యాంకులో సొమ్ము భద్రంగా ఉందని అధికారులు నిర్ధారించుకున్నారు.


కేవలం సీసీకెమరాలు, అలారం సిస్టమ్‌, స్ట్రాంగ్‌రూమ్‌ తలుపులు ధ్వంసమైనట్లు గుర్తించారు. చిత్తూరు నుంచి జాగిలాలు, వేలిముద్ర నిపుణులను రప్పించి వివరాలు సేకరించారు. బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదు మేరకు సీఐ జయరామయ్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానికుల అప్రమత్తతో దోపిడీకి అడ్డకట్ట వేశారు. కాగా, ఇదే బ్యాంకులో ఇలా దోపిడీకి ప్రయత్నించడం ఇది మూడోసారి. మూడేళ్ల కిందటా ఇదే తరహాలో కన్నంవేసి దోపిడీకి యత్నించి వెనుదిరిగారు. అయినా, సెక్యూరిటీని నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది.  


Updated Date - 2020-09-03T18:00:05+05:30 IST