అనారోగ్యంతో కామిశెట్టి కన్నుమూత

ABN , First Publish Date - 2020-09-20T16:35:44+05:30 IST

అన్నమయ్య పాట 1978 వరకు ఎవరికీ తెలియదు. పాడటానికి కూడా ఎవరూ ముందుకొచ్చేవారు..

అనారోగ్యంతో కామిశెట్టి కన్నుమూత

తిరుపతి(ఆంధ్రజ్యోతి‌): అన్నమయ్య పాట 1978 వరకు ఎవరికీ తెలియదు. పాడటానికి కూడా ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. అప్పటి టీటీడీ ఈవో పీవీఆర్కే ప్రసాద్‌ తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తూ పీహెచ్‌డీ చేస్తున్న వ్యక్తిని పిలిచి ఓ ప్రశ్న వేశారు. పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రొఫెసరవుతారా? అన్నమయ్య పాటకు ప్రచారం చేసి వేంకటేశ్వరస్వామికి సేవ చేస్తారా అని అడిగారు. అన్నమయ్యపాటకు ప్రచారం చేస్తానంటూ బాధ్యత తీసుకున్న ఆ వ్యక్తి తరువాత జీవితంలో పీహెచ్‌డీ జోలికి వెళ్లలేదు.అన్నమయ్య సంకీర్తనల వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా, సమీక్షకుడిగా వాటిని దేశవిదేశాల్లో బహుళ ప్రచారంలోకి తెచ్చిన ఆయన పేరు కామిశెట్టి శ్రీనివాసులు.


కడప జిల్లాకు చెందిన శ్రీనివాసులు 1963లో ఎస్వీయూలో తెలుగు సాహిత్యంపై ఎంఏ పూర్తి చేశారు. అన్నమయ్య కీర్తనల్లో పరిశోధన చేసిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వద్ద శిష్యుడిగా చేరారు.  అన్నమయ్య కీర్తనలపై అక్కడ ఆయన చూపిస్తున్న శ్రద్ధ పీవీఆర్కే ప్రసాద్‌ చెవిలో పడింది. 1978లో అన్నమాచార్య ప్రాజెక్టుకు ఆయన్ను వ్యవస్థాపక సంచాలకుడిగా నియమించారు. అన్నమయ్య పాటలను పాడేందుకు ముందుకు రాకపోవడంతో వాటి అర్థాలను వివరించి.... ట్యూన్‌ కట్టించి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి.సుశీల, ఎస్‌.జానకి, ఎస్పీ బాలసుబ్రమణ్యం, నేదునూరి కృష్ణమూర్తి, శోభారాజ్‌ వంటి ప్రఖ్యాతుల చేత అనేక కచేరీలు చేయించారు. క్యాసెట్లను వెలువరించారు.


అఖిల భారత సంగీత ఉత్సవాలను నిర్వహించి అనేకమందిని తిరుపతికి రప్పించారు. ప్రతి పాటకు ముందు తన వ్యాఖ్యానంతో ఆ పాటపట్ల ఆసక్తి పెంచారు. శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్‌ ప్రాజెక్టుకు తొలి డైరెక్టరుగా ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మితో పంచరత్నమాలను రికార్డు చేయించారు. అన్నమయ్య జీవిత చరిత్రపై ఆయన వ్యాఖ్యానంతో రూపొందిన క్యాసెట్‌ అన్నమయ్య చరిత్రను ఎంతోమందికి సులభంగా దగ్గర చేసింది. ఇంగ్లీషులో కూడా అనర్గళంగా మాట్లాడే నేర్పుండడంతో  అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌,సింగపూర్‌, దుబాయిల్లో కూడా అన్నమయ్య పాటలకు ప్రచారం చేశారు.టీటీడీ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగానూ పనిచేశారు.పదవీ విరమణ తర్వాత కూడా టీటీడీకి సేవలందించారు.


గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.కిడ్నీ సమస్యతో హైదరాబాదు లోని యశోద ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్న శ్రీనివాసులుకు అక్కడే కొవిడ్‌ సోకింది. దాన్నుంచి కూడా కోలుకున్న ఆయనకు వైద్యులు మళ్లీ కిడ్నీ చికిత్సను ప్రారంభించారు.శనివారం సాయంత్రం ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు.సంకీర్తనలకు వ్యాఖ్యానం అందించడంలో కొత్త ఒరవడి నెలకొల్పిన ఆయన సేవల గురించి తెలిసినవారు మరణవార్త విని తీవ్ర విషాదానికి లోనయ్యారు.

Updated Date - 2020-09-20T16:35:44+05:30 IST