చిరుధాన్యాలతో తినుబండారాలు
ABN , First Publish Date - 2020-03-02T10:44:44+05:30 IST
కలికిరి కృషి విజ్ఞాన కేంద్రంలో చిరుధాన్యాలతో ఆహారపదార్థాల తయారీపై సోమవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నారు.

రేపటినుంచి మహిళలకు శిక్షణ
స్వయంఉపాధికి మంచి అవకాశం
కలికిరి, మార్చి 1: కలికిరి కృషి విజ్ఞాన కేంద్రంలో చిరుధాన్యాలతో ఆహారపదార్థాల తయారీపై సోమవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. స్వయంఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే మహిళలకు ఈ శిక్షణ ఎంతో ఆసరాగా వుంటుంది. చిరుధాన్యాల వినియోగంపై ప్రస్తుతం ప్రజల్లో మంచి ఆసక్తి నెలకొంది. చిరుధాన్యాల రకాలయిన సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు వంటి వాటి సాగు కూడా పెరుగుతోంది. తక్కువ పెట్టుబడులతో రైతులకు కూడా చిరుధాన్యాల పంటలకు గిట్టుబాటు ధర లభిస్తోంది. వాస్తవానికి చిరుధాన్యాలతో వంద రకాల పైబడి ఆహార పదార్థాలను తయారు చేయొచ్చునంటున్నారు ఆహార నిపుణులు.
మురుకులు, రొట్టెలు, దోసె, పకోడా, సంగటి, రిబ్బన్ పకోడి, కజ్జికాయలు, రాగి లడ్డూలు, ఇడ్లీలు, కొర్ర గవ్వలు, రాగి గవ్వలు, జొన్న చుడువా, సలిబిండి, మిక్చరు, రోజ్ ఫ్లవర్స్, బిస్కెట్లు, కొర్ర దద్ధోజనం, సామల పాయసం, జొన్న నిప్పట్లు, సజ్జ కుడుములు, రాగి, జొన్న పొంగడాలు, సజ్జ వడలు, పూరీలు వంటి వాటిని తయారు చేసుకోవచ్చు. పట్టణాల్లో ఇలా తయారు చేసే ఆహారపదార్థాలకు డిమాండు కూడా బాగానే ఉంటుంది. స్వయం ఉపాధిగా వీటి తయారీవైపు మొగ్గు చూపే మహిళలు దుకాణాలకు, హోటళ్ళకు కూడా ఈ ఆహార పదార్థాలు సరఫరా చేయొచ్చు. అంతేకాకుండా గృహిణలు సైతం చిన్నపాటి శిక్షణ తీసుకుని రుచికరమైన ఆహార పదార్థాలతో ఇంటిల్లిపాదినీ అలరించవచ్చు. ఈనెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ కలికిరి కేవీకే ఉచితంగా ఈ శిక్షణ ఏర్పాటు చేస్తోంది. ఆసక్తి గల మహిళలు పేరు నమోదు చేసుకోవడానికి 8508 87745 నంబరును సంప్రదించవచ్చు.