-
-
Home » Andhra Pradesh » Chittoor » jaganannathodu srikalahasti chittoor
-
‘అన్నతోడు’.. ఇది అన్యాయమన్నా!
ABN , First Publish Date - 2020-11-25T07:00:45+05:30 IST
ప్రభుత్వ పథకాల ద్వారా అందే స్వల్ప లబ్ధి కోసం..

తిరుపతి(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల ద్వారా అందే స్వల్ప లబ్ధి కోసం పేదలను, వృద్ధులను తిప్పలకు గురి చేసిన వుదంతమిది. రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పేరిట రూ. 10 వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ పథకం బుధవారం నుంచీ అమల్లోకి రానుంది. దానికోసం ముందస్తుగా శ్రీకాళహస్తి పట్టణంలో వైసీపీ నేతలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా లబ్ధిదారులైన చిరువ్యాపారులను రప్పించారు. నెత్తిన బుట్టలు పెట్టుకుని కొందరు, తోపుడు బళ్ళతో కొందరు పట్టణమంతా ర్యాలీలో తిరిగారు. స్వయంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ర్యాలీకి నాయకత్వం వహించి, చివరగా లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగం కూడా చేశారు. తలమీద బరువైన బుట్టలు పెట్టుకుని, తోపుడు బళ్థు తోసుకుంటూ ర్యాలీలో కనిపించిన లబ్ధిదారుల్లో పలువురు వృద్ధులు, మహిళలు కూడా వున్నారు. వారి అవస్థలు చూసిన పలువురు ‘అన్నతోడు... ఇది అన్యాయమన్నా’ అంటూ వ్యాఖ్యానించడం కనిపించింది.
మరోవైపు కొవిడ్-19 మహమ్మారి ధాటికి జిల్లాలో వైరస్ సోకిన బాధితుల సంఖ్య 86 వేలకు చేరుకుంది. ఆ వైరస్ బారిన పడి 823 మంది మరణించారు. మరణాల్లో ఈ జిల్లాయే రాష్ట్రంలో తొలి స్థానంలో కొనసాగుతోంది. ఇదివరకే భారీ ర్యాలీలతో శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా వైరస్ విజృంభించడానికి కారకులయ్యారని విమర్శల పాలైన అధికార పార్టీ నేతలు తమ తీరు మార్చుకోలేదని తాజా ఘటన నిరూపించింది. తమ సొంత ప్రచారాల కోసం నేతలు బాధ్యత మరచి పేదలు, వృద్ధులు, మహిళలను ఇబ్బందుల పాలు చేయడం, కరోనా వైరస్ వ్యాప్తికి దోహదపడేలా వ్యవహరించడం తగదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.