రోడ్డు ప్రమాదంలో ఐటీబీపీ హెడ్‌కానిస్టేబుల్ మృతి
ABN , First Publish Date - 2020-03-02T10:50:43+05:30 IST
కలికిరి మండలం పత్తేగడ సరిహద్దు భద్రతా దళం (ఐటీబీపీ) 53వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ దాసరి రాజేష్ బాబు (35) ఆదివారం కలకడ ఖతీఫ్ గార్డెన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

కలికిరి, మార్చి 1: కలికిరి మండలం పత్తేగడ సరిహద్దు భద్రతా దళం (ఐటీబీపీ) 53వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ దాసరి రాజేష్ బాబు (35) ఆదివారం కలకడ ఖతీఫ్ గార్డెన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కలకడ మార్గంలో ద్విచక్రవాహనంలో వెళుతుండగా ముందు వెళుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఓవర్ టేక్ చేసి పూర్తిగా ఎడమ వైపు వెళ్ళడంతో మట్టిలో వాహనం అదుపు తప్పి పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకొన్న 108 వాహనం సిబ్బంది రాజేష్ బాబును కలికిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. హల్మెట్ లేక పోవడం, తలకుబలమైన గాయం కావడం రాజేష్ బాబు మృతికి కారణమైంది. కాగా గుంటూరు జిల్లా రేపల్లె మండలం చోడాయపాళెం ఆయన స్వస్థలం. మృతుడు రాజే్‌షకు భార్య, పిల్లలు లేరు. తల్లిదండ్రులు ఏసుదాసు, రజనీ కుమారి. సోదరి సమీనా. 2007 జూన్ 6వ తేదీన ఐటీబీపీలో జాయిన్ అయ్యారు.
కలికిరి పత్తేగడ ఐటీబీపీ 53వ బెటాలియన్‌లో 2016జూన్4న చేరారు. ప్రస్తుతం హెడ్‌కానిస్టేబుల్ ర్యాంకులో కొనసాగుతుండగా ఇక్కడి నుంచి ఒరిస్సాలో నక్సలైట్ల ఏరివేత కార్యక్రమంలో పాల్గొని రెండు వారాల క్రితమే ఇక్కడికి తిరిగొచ్చారు. కాగా రాజేష్ బాబు మృతి వార్త తెలియగానే బెటాలియన్ కమాండెంట్ పంకజ్ శర్మ, డా.హర్షవర్ధన్, పలువురు ఇతర అధికారులు, రాజేష్ సహచరులు కలికిరి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించి సంతాపం వ్యక్తం చేశారు. ఐటీబీపీ అధికారులు రాజేష్ తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. సోమవారం శవ పరీక్షల అనంతరం రాజేష్ మృత దేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. కలికిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.