అంతర్రాష్ట్ర ‘ఎర్ర’ స్మగ్లర్ అరెస్టు
ABN , First Publish Date - 2020-12-03T07:13:46+05:30 IST
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ఉయ్యాల సుబ్రహ్మణ్యం పట్టుబడ్డాడు.

భాకరాపేట, డిసెంబరు 2: కూలీ నుంచి అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదిగిన ఉయ్యాల సుబ్రహ్మణ్యం అలియాస్ బిత్తలోడును అరెస్టు చేసినట్లు పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. బుధవారం భాకరాపేటలోని సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. ఎర్రచందనం కూలీగా చేరిన సుబ్రహ్మణ్యం కొన్నేళ్లుగా దాదాపు వంద టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. భాకరాపేట, ఎర్రావారిపాళెం, రొంపిచెర్ల, పీలేరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, చిత్తూరు, కటికనహల్లి, బెంగళూరు ప్రాంతాల్లోని స్మగ్లర్లతో సంబంధాలు కల్గి ఉన్నాడు. 18 నెలల క్రితం బెయిల్‌పై విడుదలై మళ్లీ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతడిపై రొంపిచెర్ల, ఎర్రావారిపాళెం, గంగవరం పోలీస్స్టేషన్లతోపాటు టాస్క్ఫోర్సు పోలీస్‌స్టేషన్, చామల అటవీశాఖ పరిధిలో నాన్ బెయిల్‌బుల్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో బోడేవాండ్లపల్లె అడవుల్లో ఉన్నాడన్న సమాచారంతో పీలేరు రూరల్ సర్కిల్ పరిధిలోని ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ విభాగంలోని ఎస్ఐలు రవినాయక్, హరిప్రసాద్, సిబ్బంది మునిరత్నం, రాజేష్, విజయ్, అనిల్ బృందం నిఘా పెట్టి, అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. బిత్తలోడుది ఎర్రావారిపాళెం మండలంలోని పులిబోనుపల్లె స్వగ్రామం కాగా.. ప్రస్తుతం కేవీపల్లె మండలంలోని గర్నిమిట్ట కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.