ఆలస్యమైతే అనుమతిలేదు..!

ABN , First Publish Date - 2020-03-04T09:08:50+05:30 IST

బుధవారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి.

ఆలస్యమైతే అనుమతిలేదు..!

 నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు 

జిల్లాలో 135కేంద్రాలు.. 1,01,874 మంది విద్యార్థులు

ప్రయోగ పరీక్షల తరహాలో కొత్తగా టాస్క్‌ఫోర్స్‌


తిరుపతి(విద్య), మార్చి 3: బుధవారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. తొలిరోజు ఫస్టియర్‌ విద్యార్థులకు సెకండ్‌లాంగ్వేజ్‌ పరీక్ష జరగనుంది. ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే చేరుకోవాలి. పరీక్షలు ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత కేంద్రాల్లోకి అనుమతించరు. 5 నిమిషాల ఆలస్యానికీ సరైన కారణాన్ని పరీక్షా కేంద్రాల్లోని అధికారులకు వివరించాలి. జిల్లాలో ప్రథమ సంవత్సరం 52,287మంది, ద్వితీయ సంవత్సరంలో 49,587మంది (జనరల్‌, ఒకేషనల్‌) చొప్పున 1,01,874మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికి 135కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఐవో కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రతి గదిలోనూ విద్యార్థులు డెస్క్‌ మీద కూర్చుని పరీక్ష రాయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేలరాతలు ఉండకూడదని ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష గదికి వచ్చే ముందే విద్యార్థులను సిబ్బంది తనిఖీ చేయాలి.


వారి వద్ద ఎలాంటి బిట్లు, పేపర్లు లేకుండా చూడాలి. ఒకవేళ పరీక్ష గదిలో విద్యార్థి డీబారైతే, అతడితోపాటు ఇన్విజిలేటర్‌ కూడా బాధ్యుడవుతాడని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కావాలి. అప్పటి నుంచి ఆయా కళాశాలల బోధనేతర సిబ్బంది, ఇతరులెవరూ పరీక్షల గదిలోకి అనుమతించరు. ఈసారి కొత్తగా ఆయా కళాశాలలకు పరీక్షల ఇన్‌చార్జ్‌లుగా ఆయా ప్రిన్సిపాళ్లను కాకుండా వేరే కళాశాల వారిని నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోని ప్రతి గదిలోను, కళాశాల ప్రధాన కార్యాలయం, వెలుపల వరండాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రంలోకి సిబ్బంది తీసుకురావటం కూడా కెమెరాల్లో రికార్డు కావాల్సి ఉంటుంది. 


పరీక్షలపై ప్రత్యేక నిఘా 

ఈఏడాది కొత్తగా ప్రయోగపరీక్షల తరహాలో టాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేశారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో నలుగురు సీనియర్‌ అధ్యాపకులను నియమించారు. 2 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పలు కేంద్రాల్లో పరీక్షలను పర్యవేక్షిస్తాయి. కలెక్టర్‌ భరత్‌గుప్తా పర్యవేక్షణలో ఆర్‌ఐవో, డీవీఈవో కమిటీలతోపాటు 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 12 సిట్టింగ్‌ స్క్వాడ్లు, 3 డీఈసీ, ఒక హైపవర్‌ కమిటీ అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు, పరీక్షా సమయంలో సమీపంలోని జెరాక్స్‌ కేంద్రాలను మూసివేయాలి.


విద్యార్థులు ఎలకా్ట్రనిక్‌ పరికరాలు తీసుకు రాకూడదు. సీఎస్‌ల వద్ద మాత్రమే సెల్‌ఫోన్లు ఉండాలి. ప్రతికేంద్రంలో ఏఎన్‌ఎం, తాగునీరు, మరుగుదొడ్లు, గాలి, వెలుతురు ఉండేలా చర్యలు చేపట్టినట్లు ఆర్‌ఐవో కృష్ణయ్య చెప్పారు. విద్యార్థులు వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లను అనుమతిస్తామని, వాటిపై ప్రిన్సిపాళ్ల సంతకం అవసరంలేదన్నారు. సౌకర్యవంతంగా పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలుపుతూ విద్యార్థులకు అభినందనలు చెప్పారు. 

Updated Date - 2020-03-04T09:08:50+05:30 IST