తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయబోయేది ఇతనేనా!?

ABN , First Publish Date - 2020-10-31T15:37:21+05:30 IST

ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి బలమైన అభ్యర్థి కరువయ్యారా?

తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయబోయేది ఇతనేనా!?

ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి బలమైన అభ్యర్థి కరువయ్యారా? ఆ అధికార పక్షంతో రహస్య స్నేహం కొనసాగిస్తున్న పార్టీ.. అదే అదునుగా భావించి అత్యుత్సాహం ప్రదర్శిస్తోందా? లేక ప్రధాన ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయడానికి.. అధికార పార్టీకి సహకరిస్తుందా? మరి ప్రధాన ప్రతిపక్షం ఎలాంటి వ్యూహం అనుసరిస్తోంది? ఇంతకీ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ? అసలు అవి ఏ ఎన్నికలు? వాచ్ దిస్ ఇంట్రస్టింగ్ స్టోరీ.


రాజుకున్న ఎన్నికల వేడి!

తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ మృతి చెందటంతో.. ఈ స్థానానికి  త్వరలో జరుగనున్న ఉపఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మామూలుగా అయితే ఎవరైనా ప్రజాప్రతినిధి మృతిచెందినపుడు.. ఆ కుటుంబంలోని ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మిగిలిన పార్టీలు సహకరించడం ఆనవాయితీ. అయితే ఈసారి అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. అన్ని పార్టీల కంటే ముందుగా బీజేపీ.. తిరుపతి పార్లమెంటు స్థానం ఉపఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇటీవల తిరుపతికి వచ్చిన బీజేపీ జాతీయ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవధర్.. ఈ విషయాన్ని ప్రకటించటంతో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలకు పోటీ అనివార్యంగా మారిందని అవగతమైంది. దీంతో అవి ఉపఎన్నికలకు అన్నివిధాలా సంసిద్ధమవుతున్నాయి.


పారిశ్రామికవేత్త పేరు ఖరారైందా..!?

ఈ ఉపఎన్నికల్లో కీలకమైన అంశం బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం. ఈ కుటుంబం నుంచి బరిలో దిగేంతవారు లేకపోవటం.. అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ పార్లమెంటు ఎన్నికలు ఏకగ్రీవం అయితే బల్లి దుర్గాప్రసాద్ భార్యకు అవకాశం ఉండేది. అయితే పోటీ అనివార్యం కావటం, పైగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న తిరుపతి పార్లమెంట్ స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో సానుభూతి ఓట్లు రాబట్టడం సాధ్యం కాదని అధికార పార్టీ భావిస్తోందట. అందుకే బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. తిరుపతి పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వుడు కావటంతో.. తమ అడుగులకు మడుగులు ఒత్తేలా ఉండే నాయకుడుకే అవకాశమివ్వాలని వైసీపీ పెద్దలు అనుకున్నారట. అందుకు అనుగుణంగా హైదరాబాద్‌కు చెందిన మధు అనే పారిశ్రామికవేత్త పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం.


జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో..!?

ఇదిలాఉంటే.. బీజేపీ-జనసేన నేతలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టునున్నట్టు ఇప్పటికే సునీల్ దేవధర్ ప్రకటించారు. బీజేపీకి చెందిన నాయకుడినే ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించుతారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే బీజేపీ నేతలు.. ముఖ్యంగా సునీల్ దేవ్‌ధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావులు ఉమ్మడి అభ్యర్థి విషయంలో తప్పకుండా జగన్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని.. ఆ పార్టీకి చెందినవారే బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. వారిద్దరికి జగన్ నుంచి లబ్ధి చేకూరుతోందనేది వారి వాదన. ఇక తమ పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంలో బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇతర పార్టీలోని బలమైన నాయకుడిని బీజేపీలో చేర్చుకుని మరీ.. పార్లమెంటు ఉపఎన్నికల బరిలో నిలపాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి రావెల కిశోర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్న రిటైర్డు ఐఏఎస్ అధికారి శ్రీనివాసులు.. కమలం పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.


ఉనికి చాటుకోవడానికి..!

మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ఖరారు చేశారని సమాచారం. 2019 ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరఫున ఆమె పోటీచేసి ఓటమి చెందారు. ఇప్పుడు మళ్లీ పనబాక లక్ష్మీనే సిద్ధంగా ఉండాలని ఫోన్‌ ద్వారా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. తొలుత వర్ల రామయ్య, డాక్టర్ జ్యోస్న పేర్లను కూడా పరిశీలించి.. చివరకు పనబాక లక్ష్మీ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో ఆమె.. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల టీడీపీ నాయకులతో టచ్‌లోకి వస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మళ్లీ చింతా మోహన్ రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకోవటానికి జిల్లాకు చెందిన పార్టీ నేతలను అక్కడక్కడ తిప్పుతూ నిరసనలు చేయిస్తున్నారు. ఆయన చీల్చబోయే ఓట్లపై కూడా వివిధ రకాలుగా అంచనాలున్నాయి.


అప్పుడు సరే.. ఇప్పుడెలా ఉంటుందో..!?

ఇక గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయనే విషయానికొద్దాం. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో బీజేపీ- జనసేన పొత్తుతో పోటీలోకి దిగితే.. 2009 ఎన్నికల ఫలితాలు పునరావృతమయ్యే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి 1,71,638 ఓట్లు, బీజేపీకి 21,696 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు అలాగే బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థికి పడినా.. రెండు లక్షల ఓట్లు కూడా దాటే పరిస్థితి లేదని అంచనా. అంటే 2009 ఎన్నికల్లోలా.. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ- జనసేనలకు మూడో స్థానం మాత్రమే దక్కే పరిస్థితి ఉందట. అయితే అప్పుడు దేశ ప్రధాని కోసం ఓటరు ఆలోచించి ఓటు వేశారు. అప్పట్లో చిరంజీవిపై అభిమానం కూడా పని చేసింది. 


కానీ ఇప్పుడు జరిగే ఉపఎన్నికల్లో ఓటరు.. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తీర్పు ఇచ్చే అవకాశముంది. ఎందుకంటే.. రాష్ట్ర రాజధాని విషయంలో గానీ, ప్రత్యేక హోదా విషయంలో గానీ, ఇతర ఏ అంశంలో గానీ రాష్ట్రంలో బీజేపీ నేతల తీరుకు, కేంద్రంలోని పార్టీ పెద్దల తీరుకు తేడా ఉంటోంది. ఈ అంశాలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు. వాటిపై వారి స్పందన ఏమిటనేది కచ్చితంగా తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో వెల్లడికానుంది. మరి ఆ స్పందన ఎలాఉండనుందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే!

Read more