మూడేళ్లొచ్చినా మంచంలోనే..

ABN , First Publish Date - 2020-06-04T10:43:58+05:30 IST

పూర్తి దివ్యాంగురాలైన తమ మూడేళ్ల కుమార్తెకు పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని గంగాధరనెల్లూరు మండలం ..

మూడేళ్లొచ్చినా మంచంలోనే..

హెరిడిటరీ బర్త్‌ ఆస్పిక్సియాతో చిన్నారి వేదన

స్పందనలో వినతులిచ్చినా మంజూవరవని పింఛను

ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు


గంగాధరనెల్లూరు, జూన్‌ 3: పూర్తి దివ్యాంగురాలైన తమ మూడేళ్ల కుమార్తెకు పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని గంగాధరనెల్లూరు మండలం వీరకనెల్లూరు దళితవాడకు చెందిన హరిభూషణం, అమ్ములు దంపతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కూలి పనులు చేసుకునే హరిభూషణం దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి  హేమశ్రీకి కాళ్ళు వంకర. మతిస్థిమితం కూడా సరిగా లేదు. కంటి చూపు కూడా తక్కువే. తల్లిదండ్రులు   రుయా, స్విమ్స్‌లలో వైద్యం చేయించినా ఫలితం మాత్రం రాలేదు. చిత్తూరు ప్రధానవైద్యశాల సదరన్‌ క్యాంపులో చూపించగా చిన్నారి హెరిడిటరీ బర్త్‌ ఆస్పిక్సియా లోపంతో బాధపడుతోందని వైద్యులు గుర్తించి వందశాతం దివ్యాంగురాలిగా  సర్టిఫికెట్‌ ఇచ్చారు. హేమశ్రీ వైద్యానికి ఇప్పటికీ నెలకు రూ.1500ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.


పింఛనైనా మంజూరైతే కాస్త ఆసరాగా ఉంటుందని పలుమార్లు మండల అధికారులకు, రెండు సార్లు కలెక్టరేట్‌ స్పందనలో వినతులిచ్చినా మంజూరు కాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి చిన్నారికి పింఛను మంజూరు చేయాలని, మెరుగైన వైద్యసేవలందించేందుకు దాతలు ముందుకు రావాలని  వారు వేడుకున్నారు.

Updated Date - 2020-06-04T10:43:58+05:30 IST