-
-
Home » Andhra Pradesh » Chittoor » If you want to work you have to pay
-
పని కావాలంటే పైసలివ్వాల్సిందే!
ABN , First Publish Date - 2020-12-06T07:26:56+05:30 IST
మదనపల్లె తహసీల్దారు కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చే ప్రజలను నిత్యం తిప్పుకోవడం, కొర్రీలు వేస్తూ వెనక్కి పంపడం షరామామూలైంది.

మదనపల్లె తహసీల్దారు కార్యాలయానికి డబ్బు జబ్బు
మదనపల్లె, డిసెంబరు 5: మదనపల్లె తహసీల్దారు కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చే ప్రజలను నిత్యం తిప్పుకోవడం, కొర్రీలు వేస్తూ వెనక్కి పంపడం షరామామూలైంది. 22 మంది వీఆర్వోలు ఉన్న ఈ కార్యాలయంపై ఏసీబీ అధికారుల నిఘా ఉందన్న విషయం బహిరంగ రహస్యం. ఈ క్రమంలోనే బసినికొండ పంచాయతీ నక్కలకుంటకు చెందిన రైతు రామకృష్ణ నుంచి లక్షరూపాయలు లంచం తీసుకుంటూ వీఆర్వో గంగాధర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పట్టణానికి ఆనుకున్న పంచాయతీ కావడంతో భూముల విలువ పట్టణ స్థలాలకు సమానంగా వుంది. వన్‌బీ కోసం మీసేవలో దరఖాస్తు చేసుకుంటే ఏళ్లతరబడి పనులు చేయడంలేదు. ల్యాండ్ కన్వర్షన్, ఎన్‌వోసీలకు ఓ డీటీ స్థాయి అధికారి లంచావతా రంపై చర్చ నడుస్తోంది. వన్‌బీలు, పట్టాదారు పాసుపుస్త కాల కోసం వచ్చిన దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయం లో కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడి కార్యాల యంలో ఏ పని కావాలన్నా ఆ వీఆర్వోను సంప్రదిస్తే చాలు. ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేసుకున్న ఆ వీఆర్వోను ఎదిరించడానికి ఆర్‌ఐ నుంచి డీటీ వరకూ ఎవరూ సాహసించరు.
గంగాధర్ బాధితులెంతమందో!
ఏసీబీకి శనివారం పట్టుబడ్డ వీఆర్వో గంగాధర్ బాధితులు చాలామందే ఉన్నారు. పనుల కోసం కాళ్లరిగేలా తిరిగిన బాధితులు..ఆయన ఏసీబీకి పట్టుబడ్డ విషయం తెలియగానే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లెకు చెందిన చెడే కుమార్‌బాబు తన 30కుంటల భూమికి వన్‌బీ కోసం ఏడాది కాలంగా తిరుగుతున్నాడు.రూ.50వేలు డిమాండ్ చేయగా, రూ.30వేలకు ఒప్పందం కుదుర్చుకుని, రెండు నెలల క్రితం రూ.20వేలు ఇచ్చినట్లు బాధితుడు తెలిపారు. ఈరోజు, రేపు అంటూ తిప్పుకుంటూ చివరకు ఇలా ఏసీబీకి చిక్కాడని చెప్పాడు. మదనపల్లె పట్టణం నక్కలదిన్నెకు చెందిన కె.కృష్ణానాయక్ కుటుంబానికి బసినికొండ పంచాయతీ డ్రైవర్స్‌కాలనీ సమీపంలో 4.35ఎకరాలుంది.నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఈ భూమిని భాగపరిష్కారం చేసుకుని, ఆన్‌లైన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వన్‌బీ చేయడానికి సుమారు రూ.50వేల వరకు తీసుకున్నప్పటికీ రెండేళ్లుగా పని జరగనేలేదని వాపోతున్నారు. బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లెకు చెందిన జీవీఎన్ నాయుడు అలియాస్ బాబురెడ్డికి తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని తమ్ముడు, అమ్మ కలసి భాగపరిష్కారం చేసుకున్నారు.పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని తమ్ముడు, అమ్మ పేరున వన్‌బీలు చేసిన రెవెన్యూ అధికారులు బాబురెడ్డివి పక్కన పెట్టేశారు. మొత్తం 15నెంబర్లలోని కేవలం 25సెంట్ల భూమిని వన్‌బీ చేయడానికి మూడు సార్లు మీ-సేవ కేంద్రంలో నమోదు చేసుకున్నా.. ప్రయోజనం లేదు. విసిగి వేసారిన బాఽధితుడు బాబురెడ్డి..చివరకు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగమేఘాల మీద స్పందించిన రెవెన్యూ అధికారులు రెండు నెంబర్లలోని అయిదుసెంట్ల భూమిని వన్‌బీ చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలిన నెంబర్లను వదిలేయడంతో ఆయన రెండేళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గంగన్నగారిపల్లెకు చెందిన ఇ.రెడ్డెప్పకు తన భూమితో పాటు, కొనుగోలు చేసిన ఎకరా భూమికి వన్‌బీ చేయించుకోవడానికి వీఆర్వో గంగాధర్‌ను ఆశ్రయిం చాడు. రూ.5వేలు తీసుకున్న తర్వాత అయిదునెలలైనా పనికాకపోవడంతో రెడ్డెప్ప..వన్‌బీ మీద ఆశలు వదిలేశాడు.
ఏసీబీ వలలో బసినికొండ వీఆర్వో
మదనపల్లె అర్బన్, డిసెంబరు 5: భూవివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కోసం ఓ రైతు నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ శనివారం మదనపల్లె మండలం బసినికొండ వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. తిరుపతి ఏసీబీ ఏఎస్పీ శ్రీనివాస్ కథనం మేరకు.. బసినికొండకు చెందిన రామకృష్ణ భార్య తులసి పేరుమీద పాములయ్యగారిపల్లెలో 1.80 ఎకరాల భూమి ఉంది. 2007లో ప్రభుత్వం తులసీకి భూ పంపిణీలో డీకేటీ పట్టా ఇచ్చింది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయించడం కోసం రామకృష్ణ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. మరోసారి వన్‌బీ కోసం దరఖాస్తు చేసుకుని వీఆర్వో పి.గంగాధర్ అలియాస్ గంగాద్రిని కలిశాడు.కొందరు మధ్యవర్తులు రూ. 5లక్షలకు బేరం కుదిర్చి మొదట రూ.లక్ష ఇచ్చేటట్లు ఒప్పందం కుదిర్చారు. దీంతో బాధితుడు తిరుపతి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈక్రమంలో రైతు శనివారం పథకం ప్రకారం మదనపల్లె అవెన్యూరోడ్డులోని ఓ ల్యాబ్‌లో వీఆర్వో చేతికి డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోను తీసుకుని రెవిన్యూ కార్యాలయా నికి వచ్చి తహసీల్దార్ కుప్పుస్వామిని, సిబ్బందిని విచారించారు. అనంతరం గంగాధర్ ను అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు.

