కార్పొరేషన్ల రుణాలు ఇవ్వకపోతే సబ్సిడీ వెనక్కు పంపండి

ABN , First Publish Date - 2020-06-19T11:11:53+05:30 IST

నిరుద్యోగులకు స్వయం ఉపాధి కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ రుణాలు గ్రౌండింగ్‌ చేయని బ్యాంకర్లపై జిల్లా లీడ్‌

కార్పొరేషన్ల రుణాలు ఇవ్వకపోతే  సబ్సిడీ వెనక్కు పంపండి

బ్యాంకర్లకు ఎల్డీఎం గణపతి ఆదేశం 


పీలేరు టౌన్‌, జూన్‌ 18: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ రుణాలు గ్రౌండింగ్‌ చేయని బ్యాంకర్లపై జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ గణపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాలు గ్రౌండింగ్‌ చేయకపోతే ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీని వెంటనే వెనక్కు పంపాలని ఆదేశించారు. పీలేరు మండల జాయింట్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం గురువారం పీలేరులోని వెలుగు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన 2016-17, 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరైన సబ్సిడీ రుణాల గ్రౌండింగ్‌ అమలు తీరుతెన్నులపై సమీక్షించారు.


ఈ సందర్భంగా పలు బ్యాంకులు ఇప్పటికీ రుణాలు అందజేయలేదని గుర్తించారు. దీంతో ఆయా బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు గతంలో 12.5 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇచ్చేవాళ్లమని, ప్రభుత్వ ఆదేశాలతో ఇకపై కేవలం 9.5 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని సూచించారు.  కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ ఏవో బాబారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఏవో గోవిందు, వెలుగు డీపీఎం లోకనాథ రెడ్డి, పీలేరు, కేవీపల్లె, పులిచెర్ల, రొంపిచెర్ల, ఎర్రావారిపాళెం, సదుం, చిన్నగొట్టిగల్లు మండలాల్లోని వివిధ బ్యాంకుల మేనేజర్లు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-19T11:11:53+05:30 IST