విగ్రహాల ప్రతిష్ఠ కేసు కొలిక్కి..?

ABN , First Publish Date - 2020-09-16T16:31:51+05:30 IST

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించిన కేసు కొలిక్కి వచ్చింది. సీసీ పుటేజీ ఆధారంగా..

విగ్రహాల ప్రతిష్ఠ కేసు కొలిక్కి..?

నిందితులు రామేశ్వరంవాసులు

సీసీ పుటేజీ ద్వారా గుర్తింపు 


శ్రీకాళహస్తి(చిత్తూరు): శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించిన కేసు కొలిక్కి వచ్చింది. సీసీ పుటేజీ ఆధారంగా విగ్రహాలు ఏర్పాటు చేసిన అగంతకులను పోలీసులు గుర్తించారు. వీరు తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంవాసులై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ నెల 6వ తేదీ ఉదయం 10.50 గంటలకు భిక్షాల గాలిగోపురం ద్వారా ముగ్గురు భక్తులు పెద్ద లగేజీ సంచులతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. క్యూలైను ద్వారా కంచుగడప వరకు వచ్చారు.  ఆ తరువాత ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు. వీరు లగేజీతో వెళుతున్నా ఆలయ సిబ్బంది వారిని ప్రశ్నించలేదు. ఆ తరువాత కాశీలింగం వద్దకు వెళ్లారు. అక్కడ శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలను ఏర్పాటు చేశారు.


ఆ తరువాత శనీశ్వరస్వామి, నటరాజస్వామి విగ్రహాలు ఉన్న మార్గంలో అమ్మవారి ఆలయం చేరుకున్నారు. గురుదక్షిణామూర్తిని దర్శించుకుని కంచు గడప మార్గంలోనే బయటకు వెళ్లారు. వీరు ఆలయంలో సుమారు అరగంటపైనే గడిపినట్లు సీసీ పుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో ఉండటంతో నిందితుల వివరాలను పోలీసులు, ఆలయ అధికారులు  గోప్యంగా ఉంచుతున్నారు. ఆలయం ఆధ్వర్యంలో వేసిన కమిటీ కూడా ఇంకా నివేదిక అందజేయలేదు. ఇదిలా ఉండగా తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి మంగళవారం సాయంత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చారు. విగ్రహాల ఏర్పాటు ఘటనపై విచారణ జరిపారు.  

Updated Date - 2020-09-16T16:31:51+05:30 IST