ఆస్పత్రులకు ‘మాస్కుల’ కొరత

ABN , First Publish Date - 2020-03-24T10:48:50+05:30 IST

జిల్లావ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లోనూ మాస్కుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా కరోనా వైరస్‌ అనుమానితులకు చికిత్స చేయాలంటే సర్జికల్‌, ఎన్‌90 మాస్కులతోపాటు శానిటైజేషన్‌ రసాయనాలు ఎంత ముఖ్యమో వేరే చెప్పనక్కర్లేదు. అటువంటిది వీటి కొరత ఉండటంతో వైద్యసిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రులకు ‘మాస్కుల’ కొరత

ఆందోళన చెందుతున్న వైద్య సిబ్బంది


తిరుపతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లోనూ మాస్కుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా కరోనా వైరస్‌ అనుమానితులకు చికిత్స చేయాలంటే సర్జికల్‌, ఎన్‌90 మాస్కులతోపాటు శానిటైజేషన్‌ రసాయనాలు ఎంత ముఖ్యమో వేరే చెప్పనక్కర్లేదు. అటువంటిది వీటి కొరత ఉండటంతో వైద్యసిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


రుయాలో ఇలా..

తిరుపతిలోని రుయాస్పత్రినీ మాస్కుల కొరత వెంటాడుతోంది. ఉన్న కొద్దిపాటి సర్జికల్‌ మాస్కులను ఐసోలేషన్‌ వార్డులో విధులకు హాజరయ్యేవారికి పొదుపుగా ఇస్తున్నారు. ఇతర విభాగాల్లో పనిచేసే వైద్య సిబ్బందికి ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేకపోతున్నారు. ఇక రుయాలో పనిచేసీ మినిస్టీరియల్‌ స్టాఫ్‌ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వాళ్లే ప్రత్యామ్నాయ మాస్కులును తెచ్చుకుని వాడుకుంటున్నారు. శానిటైజేషన్‌ రసాయనాలు కూడా కొలతలు వేసి ఇస్తున్నట్లు తెలుస్తోంది, కరోనా ఐసోలేషన్‌ వార్డు కల్గిన రుయాకు ఇటీవల కలెక్టర్‌ నిత్యం తనిఖీల నిమిత్తం వస్తూనే ఉన్నారు. మాస్కుల కొరతపై వైద్యాధికారుల ఆయన దృష్టికి తీసుకెళుతున్నారు. అయినా ప్రయోజనం కనిపించడం లేదు. ఇక్కడే ఇలా ఉంటే ఏరియా ఆస్పత్రుల్లో చెప్పాల్సిన పనిలేదు. 


స్విమ్స్‌లోనూ అదే పరిస్థితి

స్విమ్స్‌లోనూ మాస్కులు కొరత ఏర్పడడంతో 500 గుడ్డ మాస్కులను తయారుచేయించారు. వీటినే స్టెరిలైజ్‌ చేసి వినియోగిస్తున్నారు. ఈక్రమంలో ఏపీఎంహెచ్‌డీసీ నుంచి 2,500 సర్జికల్‌ మాస్కులను తెప్పించుకున్నారు. వీటిని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి భద్రపరిచారు. స్విమ్స్‌లో ఐసోలేషన్‌ వార్డు, ఇతర ఆపరేషన్‌ థియేటర్లలో పనిచేసే సిబ్బందికి మాత్రమే మాస్కులు అందజేస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర వైద్య సేవలు అందించే వారికి మాస్కులు ఇవ్వడం లేదని సమాచారం. 


అధిక ధరవల్లేనా?

ఎన్‌90 మాస్కుల ధర సాధారణ రోజుల్లో రూ.50 ఉంటే ఇప్పుడు రూ.250లకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత ధరల ధరలు పెట్టి మాస్కులను కొనుగోలు చేయడానికి ఆస్పత్రులవారు వెనగడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 10 పడకలతో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటుచేశారు. ఇక్కడా మాస్కులు, శానిటైజర్స్‌ అందజేయలేదు. చిత్తూరులోని ఐసోలేషన్‌ వార్డులో ఎన్‌-95 మాస్కులు 200 ఉన్నాయి. 500కు పైగా సర్జికల్‌ మాస్కులు ఉన్నాయి. అయితే ఇవి ఏమాత్రం సరిపోవని వైద్య వర్గాలు అంటున్నాయి.  జిల్లాలో దాదాపు 1200 కోవిడ్‌ అనుమానిత కేసులున్నాయి. ఏమాత్రం పాజిటివ్‌ నమోదైనా పరిస్థితి అదుపుచేయడం కష్టతరమవుతుంది. ఈనేపథ్యంలో వైద్య సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించకుంటే వారు కూడా విధులకు హాజరుకాలేరు. 

Updated Date - 2020-03-24T10:48:50+05:30 IST