పెట్టింది తినాల్సిందే..!
ABN , First Publish Date - 2020-07-08T11:34:16+05:30 IST
తిరుపతిలో కోవిడ్ ఐసొలేషన్ కేంద్రాల్లో ఉంటున్న బాధితులకు సరైన వైద్య సదుపాయాలు లేవు. కనీసం సరైన ఆహారం కూడా అందడం లేదన్న
కరోనా బాధితులకు అందని హై ప్రొటీన్ డైట్
స్విమ్స్, రుయా, శ్రీనివాసంలో ఇష్టారాజ్యం
పద్మావతి నిలయంలో మాత్రం పర్వాలేదు!
తిరుపతి, ఆంధ్రజ్యోతి : తిరుపతిలో కోవిడ్ ఐసొలేషన్ కేంద్రాల్లో ఉంటున్న బాధితులకు సరైన వైద్య సదుపాయాలు లేవు. కనీసం సరైన ఆహారం కూడా అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కరోనా బాధితులకు పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారం ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, ఆ విధమైన మెనూ అమలు కావడం లేదు.
స్విమ్స్ పద్మావతి కోవిడ్ ఆసుపత్రి, రుయా కోవిడ్ ఆస్పత్రి, శ్రీనివాసం ఐసొలేషన్ కేంద్రాల్లో ప్రొటీన్ ఫుడ్ కాదుకదా.. కనీస పోషక విలువలున్న ఆహారం కూడా అందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక వ్యక్తికి రోజుకు ఆహారం కోసం రూ300 వెచ్చిస్తున్నప్పటికీ అందుకు తగ్గట్టు మెనూ ఉండడం లేదు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌కు ఆహారం సరఫరా కాంట్రాక్ట్ అప్పగించారు. తొలుత మెనూ ప్రకారమే ఇచ్చినా. క్రమేపీ పలు ఐటెమ్స్ తగ్గించేస్తున్నట్టు సమాచారం.
ఇవ్వాల్సిన మెనూ ఇదీ
ఉదయం: వడతో పాటు ఇడ్లీ/దోశ/పొంగల్/అటుకుల ఉప్మాల్లో ఏదో ఒకటి
మధ్యాహ్నం: అన్నం, స్వీట్, ఆకుకూర, సాంబారు, పెరుగు, 2 కోడిగుడ్లు
సాయంత్రం స్నాక్స్: టీ/కాఫీ, డ్రైఫ్రూట్స్
రాత్రి: రైస్, స్వీట్, ఆకుకూర, సాంబారు, పెరుగు, 2 కోడిగుడ్లు
ప్రస్తుతం ఇస్తున్న మెనూ ఇదీ..
ఉదయం టిఫిన్ వరకు బాగానే ఇస్తున్నారు కానీ, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ముందస్తుగా ఒప్పుకున్న మెనూ ప్రకారం ఇవ్వడంలేదు. అన్నంతో పాటు కోడి గుడ్లు, ఒకరకం కూరతో సరిపెట్టేస్తున్నారు. రాత్రివేళల్లో ఒక్కోసారి పెరుగన్నం, పండ్లముక్కలు, గుడ్డుతో సరిపెడుతున్నారు. ఒక్కోసారి పొద్దునపూట కూడా రాత్రి మిగిలిన రైస్‌ను ఉదయం పులిహోర చేసి, అందులోకి ఒక చట్నీ కలిపి ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది తినలేక కొందరు ఇంటిదగ్గర నుంచి ఆహారం తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది.
తిరుచానూరు ‘పద్మావతి’లో పరవాలేదు
తిరుచానూరులోని శ్రీపద్మావతి కోవిడ్ నిలయంలో మాత్రం ఆహారం, సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వైద్యులు మాత్రం ఈ సెంటర్‌ను నాలుగు రోజులకోసారి మాత్రమే పరీశీలిస్తున్నట్టు సమాచారం. అప్పటిదాకా బాధితుల బాగోగులు నర్సులే చూసుకుంటున్నారు. ఇక్కడ తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్నవారు లేరు కాబట్టి పారాసిటమాల్, విటమిన్ మాత్రలు ఇస్తున్నారు.
సిబ్బంది తీరుపై విమర్శలు
స్విమ్స్, రుయా ఐసొలేషన్ వార్డుల్లో పనిచేసే సిబ్బందిపై బాధితులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏదైనా అవసరమని చెబితే సరిగ్గా స్పందించడం లేదని అంటున్నారు. డాక్టర్లు స్పందిస్తున్నా కిందిస్థాయి సిబ్బంది వలన ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో స్విమ్స్ పద్మావతిలో పడకల కొరత తరచూ తలెత్తుతోంది. ఆంబులెన్సుల్లో ఆస్పత్రి వద్దకు చేరుకున్న పాజిటివ్ వ్యక్తులు పడకలు ఖాళీ అయ్య్యేంతవరకు గంటల తరబడి బయటే తచ్చాడుతుండడంతో అక్కడ పనిచేసే సిబ్బంది భయపడుతున్నారు.
ఇక్కడికి అన్నీ తీవ్రమైన కేసులు వస్తున్నాయి కాబట్టి వెంటిలేటర్లు సరిపోవడంలేదని సమాచారం. దాదాపుగా అన్నీ కొత్త భవనాలు, టీటీడీ పర్యవేక్షణలో ఉండేవి కాబట్టి స్నానపు గదులు, ఇతరత్రా సౌకర్యాలు మాత్రం బాగానే ఉన్నాయి. కోవిడ్ బాధితుల కాంటాక్ట్ప్‌గా గుర్తించిన వ్యక్తులు కరోనా పరీక్షలు కోసం వెళితే బాగా ఆలస్యమవుతోంది. శ్వాబ్ శాంపిల్ ఇచ్చేందుకు ఉదయం 7 గంటలకు వెళితే సాయంత్రం 4 గంటల వరకు వేచివుండాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.