-
-
Home » Andhra Pradesh » Chittoor » Heavy ration rice confiscation
-
సత్యవేడు పోలీసులు జరిపిన దాడుల్లో.. భారీగా రేషన్‌బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-12-10T07:02:48+05:30 IST
నెల్లూరు జిల్లా తడలో సత్యవేడు పోలీసులు జరిపిన దాడుల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 110 టన్నుల రేషన్ బియ్యంతో పాటు 7 వాహనాలను స్వాధీనం చేసుకుని 8మందిని అరెస్టు చేశారు.

నెల్లూరు జిల్లా తడలో సత్యవేడు పోలీసుల దాడులు
110 టన్నుల తమిళనాడు రేషన్ బియ్యం, 7 వాహనాలు స్వాధీనం
8 మంది అరెస్టు
సత్యవేడు, డిసెంబరు 9: నెల్లూరు జిల్లా తడలో సత్యవేడు పోలీసులు జరిపిన దాడుల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 110 టన్నుల రేషన్ బియ్యంతో పాటు 7 వాహనాలను స్వాధీనం చేసుకుని 8మందిని అరెస్టు చేశారు. పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ కథనం మేరకు... మంగళవారం సాయంత్రం సత్యవేడులో ఎస్‌ఐ నాగార్జునరెడ్డి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా తడ నుంచి తమిళనాడుకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న మినీ లారీని గుర్తించారు. విచారించగా నెల్లూరు జిల్లా తడ వద్ద రహస్య స్థావరాల్లో తమిళనాడు రేషన్ బియ్యం నిల్వ చేసి రాష్ట్రంతో పాటు తమిళనాడులోని వివిధ ప్రదేశాలకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాలతో సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగార్జునరెడ్డి బృందం మంగళవారం అర్ధరాత్రి తడలోని రహస్య స్థావరాలకు చేరుకుని దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 110 టన్నుల తమిళనాడు రేషన్ బియ్యం, రెండు లారీలు, రెండు ఐచర్లు, మూడు మినీ వ్యాన్లను స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి మరో 13 మంది నిందితులను గుర్తించామని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.20 లక్షలు ఉంటుందన్నారు. బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించి నిందితులను రిమాండ్‌కు తరలించామని ఆయన తెలిపారు.
ఫ సరిహద్దులో పెట్రేగుతున్న బియ్యం ముఠా
తమిళనాడు రాష్ట్ర సరిహద్దుకు కూతవేటు దూరంలో ఇటు సత్యవేడు, అటు నెల్లూరు జిల్లా తడ మండలాలు ఉండడం అక్రమార్కులకు వరంగా మారింది. అక్రమ వ్యాపారాలు ఇక్కడ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నాయి. ప్రధానంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. తడ వద్ద పట్టుబడిన బియ్యం విషయంలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ప్రధానంగా మూడు దశల్లో అక్రమ రవాణా సాగుతున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని పేదల వద్ద నుంచి కిలో పది రూపాయలకు కొనుగోలు చేసి మిల్లర్లకు 20 రూపాయలకు అమ్ముతున్నారు. మిల్లుల్లో పాలిష్ చేసి సన్నబియ్యం కింద పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులకు మామూళ్లు అందుతున్నాయి. తడలో బియ్యం పట్టుబడిన వెంటనే అక్కడి అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఈ దాడుల్లో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, ఏఎస్‌ఐ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.