పాజిటివ్‌ వచ్చిందా... భయపడకండి

ABN , First Publish Date - 2020-07-19T12:02:06+05:30 IST

నాలుగున్నర నెలల కిందట అయ్యో చైనా అనుకున్నాం. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏ దేశంలో ఎన్ని కేసులో అని

పాజిటివ్‌ వచ్చిందా... భయపడకండి

ఇల్లు కూడా భద్రమే!

హోం ఐసొలేషన్‌పై పెరుగుతున్న ఆసక్తి


చిత్తూరు, తిరుపతి- ఆంధ్రజ్యోతి :  నాలుగున్నర నెలల కిందట అయ్యో చైనా అనుకున్నాం. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏ దేశంలో ఎన్ని కేసులో అని ఆశ్చర్యంగా మాట్లాడుకున్నాం. నెల తిరక్కముందే మనదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్‌లు అని లెక్కలేసుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత ఏ జిల్లాలో ఎన్నో పట్టికలు తయారు చేసుకున్నాం. తర్వాత తర్వాత మండలాలవారీ జాబితాలు సిద్ధమయ్యాయి. ఆ దశా దాటిపోయింది. ఏ ఊళ్లో ఎన్నో ఆరాతీయడం మొదలెట్టాం.


ఇప్పుడిక ఏ వీధిలో ఎన్ని కేసులో సరిచూసుకుంటున్నాం. జిల్లాలో ఒక సునామీలా విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌ వ్యాప్తి వేగాన్ని చూస్తుంటే ఇక రానున్న రోజుల్లో ఏ ఇంట్లో ఎందరు పాజిటివ్‌ అని మాట్లాడుకుంటామనిపిస్తోంది. ఒకప్పుడు చైనాను వణికించిన వైరస్‌ ఇప్పుడు మన ఊళ్లోనూ ప్రతి గడపనూ గడగడలాడిస్తోంది. తొలి రోజుల్లో మంత్రదండాలు తిప్పి, ఉపన్యాసాలు దంచిన నాయకులంతా చేతులెత్తేశారు. ప్రభుత్వ నియంత్రణ చర్యలన్నీ నీరుగారిపోయాయి. అధికార యంత్రాంగం అసహాయంగా నిలబడుతోంది.


మనల్ని మనం కాపాడుకోవడానికి ఇప్పుడిక మిగిలింది స్వీయ నియంత్రణ మాత్రమే. ఎవరో ఏదో చేస్తారని ఆశపడి నిర్లక్ష్యంగా ఉంటే మన చాపకిందకి వైరస్‌ చల్లగా చేరుకుంటుంది. వైరస్‌ సోకడం అన్నది ఒక సాధారణ అనివార్య స్థితిగా మారిపోతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల మీదా, ప్రభుత్వ యంత్రాంగం అందించే సేవల మీదా మాత్రమే ఆధారపడే పరిస్థితి దాటిపోయింది. ప్రజలు సొంత జాగ్రత్తలకు సిద్ధపడాలి.


అధైర్య పడి జావగారిపోకుండా అప్రమత్తంగా ఉండాలి.  పాజిటివ్‌ వచ్చింది కదా అంబులెన్స్‌ వస్తుందని ఆశపడే రోజులు పోయాయి. కోవిడ్‌ ఆసుపత్రులు, క్వారెంటైన్‌ కేంద్రాలు త్రీస్టార్‌ లాడ్జీలకన్నా లగ్జరీగా ఉన్నాయన్న నాయకుల మాటలు అబద్దాలని తేలిపోయింది. పెడుతున్న ఆహారం మీద, వసతుల మీదా అసంతృప్తులు వీడియోలుగా మారి వైరల్‌ అవుతున్నాయి.   వైరస్‌ విజృంభిస్తున్న తీరు చూస్తే ఉన్న కోవిడ్‌ ఆసుపత్రులు సరిపోవని తేలిపోతోంది. ప్రభుత్వం అనుమతిచ్చినా ప్రయివేటు ఆసుపత్రులు ఇప్పటికీ ధైర్యంగా ముందుకు రావడంలేదు.


ఈ దశలో హోం ఐసొలేషన్‌ గురించిన చర్చ ప్రజల్లో నడుస్తోంది. జిల్లాలో ఇప్పటికే పాజిటివ్‌ బాధితుల్లో 11 మంది ఇలా  ఇళ్ళలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆసుపత్రికన్నా ఇల్లే భద్రమని కొందరు అంటున్నారు. పాజిటివ్‌ అని తేలగానే ఏమవుతుందో అనే భయంతో అందరూ ఆసుపత్రులను కోరుకుంటున్నారు కానీ, లక్షణాలు లేని వారు ఇంట్లో మరింత సురక్షితంగా ఉండవచ్చని ఆధికారులు కూడా సూచిస్తున్నారు. 

ఒక సునామీలా జిల్లాలో విరుచుకుపడుతోంది కరోనా వైరస్‌. తిరుపతి నగరం అయితే అతలాకుతలం అయిపోతోంది. 


హోమ్‌ ఐసొలేషన్‌ ఇలా..

తాజా మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్‌ వచ్చిన ఆరోగ్యవంతులు అధికారుల అనుమతి తీసుకుని హోమ్‌ ఐసొలేషన్‌ (ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకోవడం)లో ఉండొచ్చు. హోమ్‌ ఐసొలేషన్‌ పట్ల ఆసక్తి చూపిస్తే.. నిబంధనల ప్రకారం ఛాతి ఎక్స్‌రే, అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారు. రిపోర్టుల్లో ఎలాంటి ఇబ్బంది లేదని తేలితే అధికారులు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండేందుకు అనుమతిస్తారు.  50 ఏళ్ల లోపు వయసు కలిగి ఆరోగ్యవంతులుగా ఉన్నవారికే అనుమతి లభిస్తుంది. బీపీ, షుగర్‌, కిడ్నీ సమస్య, ఆస్తమా వంటి దీర్ఘకాలిక రోగాలు ఉండకూడదు. కరోనా లక్షణాలు లేనివారు మాత్రమే ఇంట్లో ఉండి చికిత్స తీసుకునేందుకు అర్హులు. వీరికి మాస్కులు, మందులు తదితరాలున్న కిట్‌ను ప్రభుత్వమే అందజేస్తుంది. సందేహాలు వస్తే సంప్రదించడానికి  వైద్య సిబ్బంది ఫోన్‌ నంబర్లను వారికి ఇస్తారు. వైద్య సిబ్బంది రోజువారి పర్యవేక్షణ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయినపుడు  అధికారులకు ఫోన్‌ చేసి ఆసుపత్రులకు వెళ్లొచ్చు. 


ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

హోం ఐసోలేషన్‌లో ఉండాలనుకునే వారు సిటీ స్కాన్‌, ఎక్స్‌రేలు తీసుకుని ఉండాలి.

అటాచ్డ్‌ బాత్‌రూం ఉండే గదిని ఎంచుకోవాలి.

బాధితులు వినియోగించే వస్తువులు ఇంట్లో మరెవ్వరూ వాడకూడదు.

ఆహారాన్ని అందించే కుటుంబ సభ్యులు తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకోవాలి.

పల్స్‌ ఆక్సీమీటర్‌, ధర్మామీటర్‌ దగ్గర పెట్టుకోవాలి. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనిపించినప్పుడల్లా పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్‌ శాతాన్ని, పల్స్‌ రేటు చూసుకోవాలి. 95 కన్నా ఆక్సిజన్‌ (శాచురేషన్‌) తక్కువగా ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. థర్మామీటర్‌తో అప్పుడప్పుడు ఉష్ణోగ్రతలు చూసుకుంటూ ఉండాలి. 

షుగర్‌ వ్యాధిగ్రస్తులు గ్లూకోమీటర్‌ కూడా ఇంట్లో పెట్టుకుంటే మంచింది. 

స్తోమతగలవారు డిజిటల్‌ బీపీ మిషన్‌ తెచ్చిపెట్టికుంటే బీపీని చెక్‌చేసుకోవచ్చు.

వైద్యులు సూచించిన మందులను మాత్రమే సూచించిన విధంగా వాడాలి.

-డాక్టర్‌ పెన్నా కృష్ణాప్రశాంతి, సీనియర్‌ ఫిజీషియన్‌


14 రోజులు ఇంట్లోనే 

 హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారు అధైర్యపడనవసరం లేదు. నిరంతరం వైద్య సహాయం అందుతుంది. వారి వ్యాధి లక్షణాలను సంబంధిత హెల్త్‌ వర్కర్‌ పర్యవేక్షిస్తుంటారు. నిత్యం టెలిమెడిసిన్‌తో అనుసంధానమై ఉంటారు. ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వీరికి డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి, ఎన్ని రోజులు తర్వాత పరీక్ష చేసుకోవాలి? అన్న సందేహాలు వస్తుంటాయి.  14 రోజుల తర్వాత వారి పరిధిలోని పీహెచ్‌సీలోగాని, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లోగాని కొవిడ్‌ పరీక్ష చేస్తారు. ఏదైనా అత్యవసరమనిపిస్తే 108కు ఫోన్‌ చేయొచ్చు. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు భయాన్ని వీడాలి. ధైర్యంగా ఉండి కొవిడ్‌ను జయించాలి. 

-డాక్టర్‌ సుబ్బారావు, కొవిడ్‌ జిల్లా నోడల్‌ అధికారి


కోవిడ్‌ ఆసుపత్రికా.. ఇవి తీసుకెళ్ళండి!

ప్రభుత్వ కోవిడ్‌ ఆసుపత్రుల్లోనే ఉండాలనుకునేవారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉంటాయనుకుని వెళ్లిపోకుండా రోజూ తాము వాడుకునే అత్యవసరాలన్నీ వెంట తీసుకువెళ్ళాలి.  దుప్పటి, తువ్వాలు, సబ్బు, బ్రష్‌, పేస్ట్‌, రెండు జతల బట్టలు, స్నాక్స్‌,  ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉండే సెల్‌ఫోన్‌, ఉంటే ల్యాప్‌ట్యాప్‌, ట్యాబ్‌ వంటివి తీసుకెళితే మంచిది.


పాజిటివ్‌ అయితే..ఎవరిని ఎక్కడ ఉంచుతారు?

అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైన  బాధితులను రాష్ట్ర స్థాయి ఆసుపత్రి స్విమ్స్‌లో ఉంచి వైద్యమందిస్తారు. 

లక్షణాలుండి, వయసు మళ్లినవారిని జిల్లా స్థాయి ఆసుపత్రులైన చిత్తూరు ప్రధాన ఆసుపత్రిలో, తిరుపతి రుయాలో ఉంచుతారు. 

లక్షణాలు లేని ఆరోగ్యవంతులను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లకు తరలిస్తారు. 

కరోనా బాధితులతో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన వ్యక్తులను ఏర్పేడు మండలంలోని వికృతమాల క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచుతున్నారు. 


సౌకర్యాలు లేకుంటే వీరికి ఫిర్యాదు చేయవచ్చు

స్విమ్స్‌ రాష్ట్ర స్థాయి ఆసుపత్రి: చంద్రశేఖర్‌, డ్వామా పీడీ- 91211 01111

రుయా, జిల్లా స్థాయి అసుపత్రి: డా.భారతి, సూపరింటెండెంట్‌-98499 03120

చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి: డా.మూర్తి, సూపరింటెండెంట్‌- 80085 53649

పద్మావతి నిలయం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌: తుడా సెక్రటరీ లక్ష్మి-94933 73598, అదనపు బాధ్యతలు: ఆర్‌సీపురం ఎంపీడీవో రాజశేఖర్‌రెడ్డి- 94910 71349ట్రైనీ కలెక్టర్‌ విష్ణచరణ్‌ 95051-85268


విష్ణనివాసం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌: డీపీవో సాంబశివారెడ్డి- 94910 71325, 

వికృతమాల క్వారంటైన్‌ సెంటర్‌: ఏర్పేడు తహసీల్దార్‌ ఉదయ్‌ సంతోష్‌- 94910 77044, ఏర్పేడు ఎంపీడీవో విష్ణు- 94910 71352, తిరుపతి హౌసింగ్‌ ఈఈ మహేంద్ర- 70939 30996.

Updated Date - 2020-07-19T12:02:06+05:30 IST