నేత్రపర్వం... మహేశ్వరుడి విశ్వరూప దర్శనం

ABN , First Publish Date - 2020-02-16T09:59:02+05:30 IST

పంచభూత లింగాల్లో వాయులింగంగా శ్రీకాళహస్తిలో వెలసిన ము క్కంటి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల16వ తేదీ నుంచి వైభవంగా జరగనున్నాయి.

నేత్రపర్వం... మహేశ్వరుడి విశ్వరూప దర్శనం

శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ధూర్జటి కళాప్రాంగణం 


శ్రీకాళహస్తి అర్బన్‌, ఫిబ్రవరి 15: పంచభూత లింగాల్లో వాయులింగంగా శ్రీకాళహస్తిలో వెలసిన ము క్కంటి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల16వ తేదీ నుంచి వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆలయం పరిసరాల్లో ఉన్న ధూర్జటి కళాప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుపు తుంటారు. 13 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక భక్తిగీతాలు, శాస్త్రీయ నృత్యాలతో పాటు ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు సాగుతుంటాయి. 

వేదికకు ధూర్జటి నామం సార్థకం

 శ్రీకాళహస్తీశ్వరాలయ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహించే వేదికకకు మహాకవి ధూర్జటి నామాన్ని సార్థకం చేశారు. ఇది ఎన్నో దశాబ్దా లుగా  కొనసాగుతూ వస్తోంది. ధూర్జటి నామాన్ని నిర్ణ యించడంలో ఓ విశిష్టత కూడా దాగి ఉంది. శ్రీకృష్ణదే వరాయులు ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ధూర్జటి మహాకవి ప్రథముడు. అంతే కాకుండా ధూర్జటి శ్రీకాళహస్తిలో జన్మించారు. ప్రాణక్షేత్రం, మూగజీవుల కు ముక్తిని ప్రసాదించిన వైభవాలను వర్ణిస్తూ ధూర్జటి కవి శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని ఇక్కడే రచించారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని కూడా ఆయన కలంనుంచి జాలువారింది. అందుకే నేటికీ ధూర్జటి నామం అక్కడ సార్థకంగా నిలిచింది. 

వేదికలో సందేశాత్మకం

 సన్నిదివీధిలో ధూర్జటి కళాప్రాంగణం సిద్ధం చేస్తారు. అయితే ప్రతి సంవత్సరం వేదికపై పౌరాణిక సందేశాత్మక దృశ్య ప్రతిమలను ఏర్పాటు చేస్తుంటారు. యేటా ఉత్సవాలకు కొద్దిరోజుల ముందు నుంచే వేదిక అలంకరణకు ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతుంటారు. ప్రతిమలను రూపొందించే కళాకారులకు బాధ్యతలు అప్పగిస్తుంటారు. 

మహేశ్వరుడి విశ్వరూప దర్శనం

 ఈ యేడాది ధూర్జటి కళాప్రాంగణం వేదికపై మహేశ్వరుడి విశ్వరూప దర్శనం అనే దృశ్యాన్ని రూపొందించారు.గతేడాది క్షీరసాగర మథనం, అంతకు ముందు శివపార్వతుల కల్యాణం దృశ్య వేదికలను అలంకరించారు. భక్తకన్నప్ప నిష్కల్మశ భక్తితో శివలింగాన్ని పూజిస్తుంటాడు. భక్తుడిని పరీక్షిం చేందుకు పరమేశ్వరుడు నేత్రం నుంచి రక్తం ధారను చిందిస్తాడు.అది చూసి చలించిన కన్నప్ప తన నేత్రాల ను భగవంతునికి అర్పించేందుకు సిద్ధమవుతాడు. దాంతో భక్తికి పరవశించిన పరమశివుడు కన్నప్పకు విశ్వరూప దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తాడు. ఇదే దృశ్య రూపకంగా రూపొందించారు.అయితే ఇక్కడే శ్రీకాళహ స్తి క్షేత్ర విశిష్టత కళ్లకు కట్టేలా ఓ వైపు శ్రీ(సాలె పురుగు), మరో వైపు కాళ(పాము), మధ్యలో హస్తి (ఏనుగు) ప్రతిమలను ఏర్పాటు చేశారు. విశ్వరూప దర్శనంలోని మహేశ్వరుడికి కుడివైపున ఎనిమిది, ఎడమవైపున ఎనిమిది తలలను ప్రతిబింబించారు. ఒక్కో శిరంలో వివిధ దేవతామూర్తులు, రుషులు, మునులను సాక్షాత్కరించారు. ఇక మొత్తం 20 హస్తాలతో నిరాకారుడు అయిన పరమేశ్వరుడు భక్తుడికి దర్శనం భాగ్యం కల్పించిన దృశ్యం అది. ఇది శ్రీకాళహస్తికి చెందిన సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రతాప్‌ అనే యువకుడు తీర్చిదిద్దిన సందేశాత్మక దృశ్యమాలిక. 

ముస్తాబవుతున్న వేదిక

 ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. వేదిక ప్రాంగణం శరవేగంగా ముస్తాబవుతోంది. చలువపందిళ్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇక వేదిక ఆనుకుని గతంలో రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండేవి. గత యేడాది స్వల్ప ప్రమాదం సంభవించినా ఎలాంటి నష్టం జరగలేదు. ఈయేడాది గత అనుభవం దృష్ట్యా అధికారులు శనివారం రెండు ట్రాన్స్‌ఫార్మర్లను శాశ్వతంగా ధూర్జటి కళాప్రాంగణం నుంచితొలగించి దూరంగా ఏర్పాటు చేశారు. 


ఈశ్వరేచ్ఛ

పరమశివుడి విశ్వరూప దర్శనం ప్రతిమను రూపొందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో రెండుసార్లు ఇలాంటి వేదికలను తీర్చిదిద్దాను. శ్రీకాళహస్తికి చెందిన నేను హైదరాబాద్‌లో సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ (సెట్టింగ్స్‌) వేస్తుంటాను. శ్రీకాళహస్తి వాసిగా శివయ్య అంటే ఎంతో భక్తిభావం. ఈయేడాది 15 రోజుల నుంచి ఎంతో నిష్టగా సుమారు పదిమంది శ్రమించాం. విశ్వరూప దర్శనం శ్రీకాళహస్తి క్షేత్రాన్ని ఒక్క దృశ్యంలో తెలిపే అధ్భుత ఘట్టంగా భావిస్తున్నాం.

- ప్రతాప్‌, సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌


Updated Date - 2020-02-16T09:59:02+05:30 IST