సుమతిని చంపాలనుకోవడం అమానవీయం
ABN , First Publish Date - 2020-12-17T05:30:00+05:30 IST
ములకలచెరువులో నర్సు సుమతిపై సొంత బావే హత్యకు ప్రయత్నించిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ
తిరుపతి రూరల్, డిసెంబరు 17: ములకలచెరువులో నర్సు సుమతి(24)పై సొంత బావే పెట్రోలు పోసి, హత్యకు ప్రయత్నించిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్‌లో గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రుయాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించామని చెప్పారు. మూగజీవాలపై విషప్రయోగం చేయడం, ఇంట్లో నిద్రిస్తున్న మరదలు సుమతిపై పెట్రోలు పోసి చంపాలనుకోవడం అమానవీయం అన్నారు. వారంలోపు అన్నిరకాల చర్యలు తీసుకోవడానికి కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. పెళ్లి కాదన్నందుకు ఇంత క్రూరంగా వ్యవహరించడం సరికాదన్నారు. మహిళలపై హింసను నివారించడానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నిరకాల చర్యలు చేపడుతున్నారన్నారు. సమావేశంలో పలువురు కమిషన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.