‘మీకు నక్క కావాలా..? నాగలోకం కావాలా..?’
ABN , First Publish Date - 2020-12-13T06:18:54+05:30 IST
ఉప ఎన్నికలో ఎంపీ సీటిస్తే నగరాన్ని స్వర్ణమయం..

‘తిరుపతి’ సీటిస్తే స్వర్ణమయం చేస్తాం
రివర్స్ టెండర్ల పేరిట జగన్ అవినీతి
బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
తిరుపతి(ఆంధ్రజ్యోతి): ‘ఏ సీటూ లేకుండానే తిరుపతిని బీజేపీ (కేంద్ర ప్రభుత్వం) ఎంతో అభివృద్ధి చేసింది. ఉప ఎన్నికలో ఎంపీ సీటిస్తే నగరాన్ని స్వర్ణమయం చేస్తాం’ అని ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం కూడలిలో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు చంద్రబాబుకు మూడు.. జగన్‌కు 22 ఎంపీ సీట్లున్నా ఇన్నేళ్లలో వారు చేసిన అభివృద్దేమీలేదన్నారు. తిరుపతి స్మార్టు సిటీకి సిటీకి రూ.రెండువేల కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ కేటాయించారన్నారు. పలు మార్గాలను నాలుగులేన్లుగా అభివృద్ధి చేస్తున్నారని, అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారని, అనేక కేంద్ర విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేశారని వివరించారు. అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ, వైసీపీలకు సవాల్ చేస్తున్నానన్నారు. దమ్ముంటే చర్చకు ఒకే వేదికపైకి రావాలన్నారు.
ఎన్నికలకు ముందు జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు రాష్ట్రంలో ఏంజరుగుతుందో మీరే చూడాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని, దీనికి అనువుగా అటవీశాఖలో అధికారుల స్థానాలను ఖాళీగా ఉంచేశారని ఆరోపించారు. రివర్స్ టెండర్ల పేరిట జగన్మోహన్‌రెడ్డి రివర్స్‌లో అవినీతి చెస్తున్నారని విమర్శించారు. ఎవరికీ తెలియని పేర్లతో ఉన్న మద్యాన్ని విక్రయిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. రూ.ఐదు వేలకోట్ల శ్రీవారి నగదును రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవాలన్న ప్రయత్నాన్ని బీజేపీ అడ్డుకుందని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు దీనిని బీజేపీ వ్యతిరేకిస్తుందని, గుణపాఠం చెబుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
జగన్‌కు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, మీకు నక్క కావాలా... నాగలోకం కావాలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీహరి బీజేపీలో చేరారు. దీనికి ముందు బీజేపీ శ్రేణులు అంబేడ్కర్ విగ్రహం నుంచి కర్ణాలవీధి, కృష్ణాపురంఠాణా, గాంధీరోడ్డు, తిలక్‌రోడ్డు మీదుగా కార్పొరేషన్ కార్యాలయం కూడలి వరకు రైతు మద్దతు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జాతీయ కార్యదర్శులు సునిల్‌దియోధర్, సత్య, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, భవానీశంకర్, ఈశ్వర్‌యాదవ్ తదితరులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరుపతిపై బీజేపీ దృష్టి
ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతిపై బీజేపీ దృష్టిపెట్టింది. తిరుపతిపై తమకున్న శ్రద్ధ ఏపాటిదన్నది ఈ సభ ద్వారా చెప్పారు. సోము వీర్రాజు అధ్యక్షతన తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉదయం ఇక్కడ నిర్వహించడం ద్వారా తమ ప్రాధాన్యాన్ని చాటారు.
