శెభాష్ సీతక్క!
ABN , First Publish Date - 2020-04-08T11:50:18+05:30 IST
అతను తన రక్త సంబంఽధీకుడేమీ కాదు.. తాను వ్యాపారం చేసుకునే ప్రదేశంలో నివాసముండే ఓ యువకుడు.

తిరుమలలో మహిళా వ్యాపారి దాతృత్వం
వెయ్యి కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు
తిరుమల, ఏప్రిల్ 7: అతను తన రక్త సంబంఽధీకుడేమీ కాదు.. తాను వ్యాపారం చేసుకునే ప్రదేశంలో నివాసముండే ఓ యువకుడు. అతను కరోనా వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడని తెలిసి ఆ ప్రాంతంలో కూరగాయలు అమ్ముకునే మహిళ దిగులుపడింది. అతను ఆరోగ్యంగా తిరిగి తిరుమలకు చేరుకోవాలని స్వామికి మొక్కుకుంది. ఆమెతో పాటు స్థానికులందరూ ‘స్వామీ నీ సన్నిధికి కరోనా మహమ్మారి రాకుండా చూడు’మని కోరుకున్నారు. అందరి కోర్కెలు ఫలించి ఆ యువకుడు నెగెటివ్ రిపోర్టుతో బయటపడ్డాడు.
దీంతో ఎంతగానో సంతసించిన ఆ మహిళ మంగళవారం తిరుమల బాలాజీనగర్‌లోని దాదాపు వెయ్యి కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు వితరణ చేసి మొక్కు తీర్చుకుంది. తిరుపతికి చెందిన సీత(సీతక్క) తిరుమలలో స్థానికులు నివాసముండే బాలాజీనగర్‌లో గత కొన్నేళ్లుగా టీటీడీ అనుమతితో కూరగాయలు విక్రయిస్తోంది. నిత్యం వ్యాన్‌లో కూరగాయలు తీసుకువచ్చి విక్రయం అనంతరం తిరిగి తిరుపతికి వెళ్లిపోతుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం రెండుమూడు రోజులకు ఓ సారి మాత్రమే కూరగాయలతో తిరుమలకు వస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ నుంచి తిరుమలలోని తన సొంతింటికి చేరుకున్న యువకుడు మార్చి 31వ తేదీ రాత్రి కరోనా వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. దాంతో తిరుమల మొత్తం ఒక్కసారిగా హడలిపోయింది.
ఇది తెలిసి ఆ యువకుడు ఆరోగ్యంగా తిరిగి రావాలని సీతక్క శ్రీవారికి మొక్కుకుంది. రెండురోజుల తర్వాత అతనికి ఎలాంటి వ్యాధి లేదని తేలడంతో స్థానికులు ఊపిరిపీల్చుకోగా సీతక్క తన మొక్కు ప్రకారం మంగళవారం తిరుమలలో నివాసముండే దాదాపు వెయ్యి కుటుంబాలకు రూ.వంద విలువ కలిగిన కూరగాయల సంచులు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ బ్యాగులను వార్డు వలంటీర్లు స్థానికులు ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు.