ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడ్డుకుంటారా?

ABN , First Publish Date - 2020-10-31T10:09:14+05:30 IST

ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడ్డుకుంటారా అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి వైసీపీ నేతలపై మండిపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులను

ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడ్డుకుంటారా?

మాజీ మంత్రి అమరనాథరెడ్డి ధ్వజం

 అధికార పార్టీ ప్రోద్బలంతో అల్లరిమూకల ఆగడాలు 


చిత్తూరు సిటీ, అక్టోబరు 30: ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడ్డుకుంటారా అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి వైసీపీ నేతలపై మండిపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని కోరుతూ ఈనెల 26 నుంచి 30వతేది వరకు టీడీపీ పాదయాత్రకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న పార్టీ నేతలను పోలీసులు గృహనిర్భంధం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాదయాత్రకు అనుమతినివ్వాలని కోరుతూ మాజీ మంత్రి అమరనాథరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీలు, నాయకులు శుక్రవారం కలెక్టర్‌, ఎస్పీని కలసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గానికి హంద్రీ-నీవా జలాలను తీసుకు వచ్చి సాగు, తాగునీటి సమస్య తీర్చే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఆ మేరకు 86శాతం పనులు పూర్తి చేయగా, మిగిలిన పనులను పూర్తిచేయాలని సీఎం జగన్‌కు లేఖ రాయగా ఆయన స్పందించలేదని చెప్పారు. దీంతో ప్రజలతో కలసి ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈనెల 26 నుంచి 30వతేది వరకు కార్యక్రమ నిర్వహణకు అనుమతినివ్వాలని కలెక్టర్‌, ఎస్సీ ఇతర ఉన్నతాధికారులకు లేఖలు పంపామని వివరించారు.


అనంతరం రామకుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించగా, పోలీసుల సమక్షంలో అధికార పార్టీ నేతలు అడ్డుకుని తమపై కర్రలతో దాడి చేశారని వాపోయారు. ప్రజా ప్రయోజనాల కోసం టీడీపీ శాంతియుత పోరాటాలు చేస్తోందన్నారు. అయితే అధికార పార్టీ ప్రోద్బలంతోనే తమ పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో అల్లరిమూకలు చేరి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, పార్టీ నాయకులు పీఎస్‌ మునిరత్నం, మనోహర్‌, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-31T10:09:14+05:30 IST