టీటీడీ చరిత్రలో తొలిసారిగా..!

ABN , First Publish Date - 2020-05-08T09:15:09+05:30 IST

టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఫైనాన్స్‌ కమిటీ సమావేశాన్ని గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు.

టీటీడీ చరిత్రలో తొలిసారిగా..!

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా

ఫైనాన్స్‌ కమిటీ సమావేశం

 బోర్డు మీటింగ్‌ కూడా 

ఇలాగే నిర్వహించే ఆలోచన


తిరుమల, మే 7: టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఫైనాన్స్‌ కమిటీ సమావేశాన్ని గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే శ్రీవారి దర్శనాలను రద్దు చేసి, భక్తులను తిరుమలకు రానీయకుండా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల హుండీ, రిసెప్షన్‌, దర్శన టికెట్ల ద్వారా వచ్చే ప్రధాన ఆదాయాలు తగ్గిపోయాయి. దీనివల్ల ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఇతర ఖర్చులకూ టీటీడీ సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ధర్మకర్తల మండలి సబ్‌ కమిటీల్లో ఒకటైన ఫైనాన్స్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని భావించింది. లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో ఎన్నడూ లేనివిధంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించింది.


తిరుపతి పద్మావతి అతిథిగృహం నుంచి టీటీడీ అధికారులు, ఎక్స్‌అఫిసియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకరెడ్డి పాల్గొనగా.. కమిటీ సభ్యులైన రాజేష్‌శర్మ (ముంబై నుంచి), శ్రీనివాసన్‌ (చెన్నై నుంచి), కుపేంద్రరెడ్డి (బెంగళూరు నుంచి) పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ విజయవంతం కావడంతో ధర్మకర్తల మండలి సమావేశాన్ని కూడా ఇలాగే నిర్వహించాలని అధికారులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బోర్డు మీటింగ్‌లో శ్రీవారి దర్శన విధి విఽధానాలు, కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి. 

Updated Date - 2020-05-08T09:15:09+05:30 IST