ప్రజల ఆరోగ్య భద్రతపైనా దృష్టి

ABN , First Publish Date - 2020-06-22T11:08:19+05:30 IST

కరోనా నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం కృషిచేస్తోంది. ఇటు సిబ్బందితోపాటు అటు పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయించే ప్రజల ఆరోగ్యరక్షణపైనా దృష్టి

ప్రజల ఆరోగ్య భద్రతపైనా దృష్టి

కరోనా కట్టడికి ఎస్పీ ప్రత్యేక చర్యలు  

పోలీసు స్టేషన్లలో తాత్కాలిక రిసెప్షన్‌ సెంటర్లు


చిత్తూరు, జూన్‌ 21: కరోనా నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం కృషిచేస్తోంది. ఇటు సిబ్బందితోపాటు అటు పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయించే ప్రజల ఆరోగ్యరక్షణపైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌ శనివారం అన్ని పోలీసు స్టేషన్లలో తాత్కాలిక రిసెప్షన్‌ సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఆ మేరకు సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు కరోనా బారినపడకుండా స్టేషన్‌ ముఖద్వారం వద్దే ఫుట్‌ పుష్‌ శానిటైజర్లు, డిజిన్‌ఫెక్షన్‌ స్ర్పేయర్లను అందుబాటులో ఉంచారు. అర్జీలను స్వీకరించే పోలీసు అధికారులు, సిబ్బంది కూడా మాస్కులు, గ్లౌజులు, ఫేస్‌ షీల్డులు ధరించడాన్ని ఎస్పీ తప్పనిసరి చేశారు.


ప్రతి స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు శానిటైజ్‌ చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అన్ని స్టేషన్లలో ఆక్సీమీటర్లను అందుబాటులో ఉంచారు. వీరందరికీ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించే బాధ్యతలను స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు అప్పగించారు. ఇక వయసు ఆధారంగా అధికారులు, సిబ్బందిని మూడు కేటగిరీలుగా విభజించి విధులను అప్పగిస్తున్నారు. కరోనా వేళ స్టేషన్లకు వచ్చే ప్రజల ఆరోగ్య రక్షణతోపాటు, ఇటు పోలీసు కుటుంబసభ్యులు వైరస్‌ బారినపడకుండా జిల్లా పోలీసు ఉన్నతాధికారి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. 

Updated Date - 2020-06-22T11:08:19+05:30 IST