నిబంధనాలు

ABN , First Publish Date - 2020-12-28T06:23:12+05:30 IST

పశువుల కొనుగోలులో లేనిపోని నిబంధనలపై ఆందోళన చెందుతున్న చిత్తూరు జిల్లా రైతులు

నిబంధనాలు
ప్రభుత్వ నిబంధనలు తొలగించాలని కోరుతున్న ఐరాల పాడిరైతులు

పశువుల కొనుగోలులో నిబంధనలపై రైతుల ఆందోళన 


  ఐరాల, డిసెంబరు 27: పాడి పశువుల పెంపకంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు గత ప్రభుత్వం సబ్సిడీపై కాపులకు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేసింది. 2017-18వ సంవత్సరంలో మంజూరైన రుణాలను రైతులు పూర్తి స్థాయిలో వినియోగించుకోక పోవడంతో ప్రభుత్వం నుంచి మంజూరైన సగం సబ్సిడీ మొత్తం వెనక్కు వెళ్లనుంది. అయితే పశువుల కొనుగోలుకు పెట్టిన షరతుల వల్లే తాము ముందుకు రావడం లేదని, వాటిని తొలగిస్తే రుణం తీసుకుని పశువులను కొనుగోలు చేసేందుకు సిద్ధమని రైతులు అంటున్నారు. ఐరాల మండలంలో 47మంది కాపులకు ఆవులు కోనుగోలు చేయడానికి 2017-18వ ఆర్థిక సంవత్సరంలో రుణాలు మంజూరయ్యాయి. ఒక్కోక్క రైతుకు లక్ష రూపాయల చొప్పున రూ.47లక్షలు వివిధ బ్యాంకుల ద్వారా విడుదలైంది. అయితే లబ్ధిదారులు పశు వులను తమిళనాడు రాష్ట్రం నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం షరతు పెట్టింది. దీంతో మండలంలోని కొందరు రైతులు ఆ రాష్ట్రంలో ఆవులను కొనుగోలు చేశారు. అయితే ఆ రాష్ట్రానికి చెందిన పశువులు జిల్లాలోని వాతావరణ పరిస్థితులకు ఇమడలేక చాలా వరకు మృత్యువాత పడ్డాయి. దీంతో లబ్ధిదారులు తమిళనాడు రాష్ట్రం నుంచి కొనుగోలు చేసిన ఆవులను ఐదారువేలకే అమ్మేసుకున్నారు. మొదటి విడతలో లబ్ధిదారులు పశువులను కొని నష్టపోవడంతో రెండో విడతలో ఆవులను కొనుగోలు చేసేందుకు, రుణం పొందేందుకు పాడి రైతులు ముందుకు రాలేదు. పశువులను తమిళనాడులోనే కొనాలని షరతు పెట్టారని, అలా కాకుండా తీసుకున్న రుణానికి ఇష్టమొచ్చిన చోట  కొనుగోలు చేసుకునేందుకు అనుమతించాలని రైతులు కోరుతున్నారు. కాగా పశువుల కొనుగోలుకు రైతులు ముందుకు రావడం లేదంటూ ఆయా బ్యాంకర్లు మంజూరైన నిధులను తిరిగి వెనక్కి పంపే ప్రయత్నాల్లో ఉన్నారు.   

Updated Date - 2020-12-28T06:23:12+05:30 IST