-
-
Home » Andhra Pradesh » Chittoor » extra bore will be sanctioned for beneficiaries who alreday have another bore
-
బోరున్నా ఉచిత బోరుకు అర్హులే
ABN , First Publish Date - 2020-12-15T06:03:52+05:30 IST
ఇప్పటికే బోరున్న రైతులు కొత్త బోరుకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

జలకళలో నిబంధనల సడలింపు
కలికిరి, డిసెంబరు 14: ఇక మీదట పొలంలో పాత బోరున్నాగానీ జలకళ పథకంలో ఉచిత బోరుకు అర్హులు కానున్నారు. ఈ మేరకు గతంలో జారీ అయిన మార్గదర్శకాల్లోని కొన్ని నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రైతు పొలంలో పాత బోరున్నా, బావి వున్నా అనర్హులుగా పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన దరఖాస్తులో ఎండిపోయిన బోర్లున్న రైతుల దరఖాస్తులే అధికంగా వుండటంతో దరఖాస్తుదారుల్లో ఎక్కువ భాగం అనర్హులుగా తేలారు. దీంతో కొన్ని నిబంధనలను సడలించారు. ఇక మీదట పాత బోర్లున్నాగానీ కొత్తగా ఉచిత బోరుకు అర్హులేనని ప్రభుత్వం పేర్కొంది. అయితే నిబంధనల ప్రకారం పాత బోరు నిరుపయోగమైందిగా ధృవీకరింపబడాల్సి వుంటుంది. ఇక రెండున్నర ఎకరాలు ఒకే చోట పొలం వున్న వారు మాత్రమే అర్హులుగా పేర్కొనగా ఇందులో కూడా ప్రస్తుతం కొంత మినహాయింపు ఇచ్చారు. ఒకే రైతుకు ఒకే చోట రెండున్నర ఎకరాలు లేకపోయినా ఇతరులతో కలుపుకుని ఉమ్మడి బోరుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో వచ్చే నీటిని కూడా అంతా పంచుకోవాల్సి వుంటుంది. ఒక కుటుంబానికి ఒక బోరు మాత్రమే పరిమితం చేశారు. ఈ కొత్త నిబంధన ప్రకారం కుటుంబంలో ఒకరి పేరు మీద మాత్రమే ఉచిత బోరు మంజూరవుతుంది. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు అర్హత లేదు. పొలంలో ఉచితంగా వేసిన బోరులో నీరు పడకుంటే దాన్ని కాంట్రాక్టరే మట్టితో పూడ్చేయాలని గతంలో నిబంధన వుండేది. దానికి బదులుగా ప్రస్తుతం నీళ్ళు పడకుండా విఫలమైన బోరు వేసిన రైతుకు నీరు పడే అవకాశముంటే మరో బోరు కూడా వేస్తారు. విఫలమైన బోరును పూడ్చేయకుండా రెండో బోరును రీచార్జీ చేయడానికి ఉపయోగపడే విధంగా దాన్ని సిద్ధం చేయాల్సి వుంటుంది. ఈ మేరకు సడలించిన నిబంధనలకు సంబంధించి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం ఆదేశాలు జారీ చేశారు.