ఎన్నికల డీటీలకు పొడిగింపు ఉత్తర్వులు

ABN , First Publish Date - 2020-11-25T06:15:22+05:30 IST

రివర్షన్‌ తప్పదన్న వార్తలతో బెంబేలెత్తిపోయిన జిల్లాలోని 30 మంది డిప్యూటీ తహసీల్దార్లకు ఉపశమనం లభించింది.

ఎన్నికల డీటీలకు పొడిగింపు ఉత్తర్వులు

తరువాత కూడా పర్మినెంట్‌ చేసే అవకాశం

ఊపిరి పీల్చుకున్న 30మంది అధికారులు


కలికిరి, నవంబరు 24: రివర్షన్‌ తప్పదన్న వార్తలతో బెంబేలెత్తిపోయిన జిల్లాలోని 30 మంది డిప్యూటీ తహసీల్దార్లకు ఉపశమనం లభించింది. తాత్కాలికంగా ఊరట కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలకు తుది రూపమిచ్చే పని కోసం మొత్తం 175 డిప్యూటీ తహసీల్దార్లకు 2021 మార్చి 31 వరకూ పొడిగింపునిచ్చింది. దీంతో జిల్లాలో ఎన్నికల డిప్యూటీ తహసీలార్లుగా పనిచేస్తున్న వారందరికీ ఊరట లభించింది. నియోజకవర్గానికి ఒక్కో ఎన్నికల డీటీతోపాటు ఆర్డీవో, కలెక్టరు కార్యాలయాల్లో మరికొందరు ఎన్నికల డీటీలుగా కొనసాగుతున్నారు. మార్చి 31 వరకూ వీరికి స్థానచలనం లేకుండా ప్రభుత్వం పొడిగించింది. రెవెన్యూ శాఖగాకుండా నేరుగా ఆర్థిక శాఖ నుంచే ఈ ఉత్తర్వులు జారీ కావడం విశేషం. జీఏడీ సిఫారసుతో ఆర్థిక శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ఇందులో కొంతమంది డీటీలను శాశ్వతంగా నియమించుకునే వీలు కూడా లభించింది.  దీంతో రివర్షన్‌ తప్పదన్న ఆందోళనలో ఉన్న మరికొంత మందికి కూడా ఈ తాజా ఆదేశాల కారణంగా ఊరట లభించింది. మిగిలిన డీటీలను కూడా జనవరి నుంచి అమల్లోకి రానున్న రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ పర్యవేక్షణ పేరుతో కొనసాగనున్నారు. కాగా అవసరమైతే మార్చి 31 తరువాత కూడా ఎన్నికల డీటీల సేవలు అవసరమని భావించే పక్షంలో ముందస్తుగా జనవరి 31లోగా ఆర్థిక శాఖకు ఈ మేరకు ప్రతిపాదనలు అందజేసి అనుమతి పొందాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.  

Updated Date - 2020-11-25T06:15:22+05:30 IST