తంబళ్ళపల్లెకు కాయకల్ప చికిత్స
ABN , First Publish Date - 2020-12-15T06:14:03+05:30 IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో తంబళ్ళపల్లె నియోజకవర్గంలో పట్టాలు తప్పి నిస్తేజంగా మారిన తిరిగి పట్టాలెక్కుతోంది.
ఫలితమిస్తున్న చంద్రబాబు నిర్ణయాలు
తంబళ్ళపల్లె నియోజకవర్గంలో పట్టాలు తప్పి నిస్తేజంగా, స్తబ్దుగా మారిన తెలుగుదేశం తిరిగి పట్టాలెక్కుతోంది. నాయకత్వ సమస్యతో బలహీనపడ్డ పార్టీకి కాయకల్ప చికిత్స చేసే దిశగా అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు క్రమేపీ ఫలితాలనిస్తున్నాయి. సుమారు నెల రోజుల వ్యవధిలో అధిష్ఠానం వేసిన ఒక్కో అడుగూ ఒక తంబళ్ళపల్లెపైనే కాకుండా యావత్ పశ్చిమ మండలాలపైనే ప్రభావం చూపుతోంది. ఏడాదన్నరగా నియోజకవర్గానికి దూరంగా, పార్టీ పట్ల అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే శంకర్ తాజాగా నియోజకవర్గంలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆయనపై ఎంతోకొంత అసంతృప్తి, ఆగ్రహం వున్నప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలూ క్రమంగా సర్దుకుని సహకారమందించేందుకు సిద్ధపడుతున్నారు.
తిరుపతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గత ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత మాజీ ఎమ్మెల్యే శంకర్ నియోజకవర్గానికి దూరమయ్యారు. బెంగుళూరులో సొంత వ్యాపారాలు, వ్యవహారాలకే పరిమితమయ్యారు. దానివల్ల జిల్లాలోనే టీడీపీకి బలమైన క్యాడర్ వున్న ఈ నియోజకవర్గంలో నాయకత్వ సమస్య తలెత్తింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకనాధరెడ్డి బలంగా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తుండడం తో టీడీపీ క్యాడర్ కొంతమేరకు దెబ్బతింది. ఇన్‌ఛార్జి లేకపోవడం, సమస్య వస్తే ఆశ్రయించేం దుకు తగిన నాయకుడు అందుబాటులో లేక పోవడం, అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళతో చురుగ్గా వున్న మండలస్థాయి టీడీపీ నాయకులపై కేసులు నమోదు కావడం, ఇతరత్రా వేధింపులతో నాయకులు, కార్యకర్తలు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. చివరికి పార్టీ అధిష్ఠానం పిలుపిచ్చిన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ఐదు మండలాల్లో ఎవరూ ముందుకురాని పరిస్థితి. కేవలం బి.కొత్తకోట మండలంలో మాత్రమే మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పర్వీన్ తాజ్ కొంత చురుగ్గా వుండి పార్టీ ఉనికి కాపాడుతూ వచ్చారు.
ఆ ఇద్దరి కార్యాచరణతో పరిస్థితుల్లో మార్పు
నెల రోజుల వ్యవధిలో చంద్రబాబు తీసుకున్న రెండు నిర్ణయాలు తంబళ్ళపల్లె నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితులను మారుస్తున్నాయి. తొలుత రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగానూ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ కడప జిల్లాకు చెందిన ఆర్.శ్రీనివాసులురెడ్డిని నియమించారు. ఆయన కడప జిల్లాలో రాజకీయంగా వైఎస్ కుటుంబాన్ని సుదీర్ఘకాలం ఎదుర్కొని ఢక్కామొక్కీలు తిన్న కుటుంబం నుంచీ వచ్చినవారు. ఆ వెంటనే నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వీరిద్దరూ అధినేత పార్టీలో తమకు కట్టబెట్టిన స్థాయి రీత్యా దానికి పూర్తిస్థాయి న్యాయం చేసే దిశగా కార్యాచరణ ప్రారంభించారు. ముఖ్యంగా తమ పరిధిలో సమస్యాత్మకంగా వున్న తంబళ్ళపల్లె నియోజకవర్గంపై దృష్టి సారించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌తో చర్చించి, రాజకీయంగా తిరిగి క్రియాశీలం కావడానికి ఒప్పించారు. మరణాలు, అనారోగ్యాల నేపధ్యం కలిగిన పార్టీ నాయకుల కుటుంబాలను పరామర్శించే పేరిట నియోజకవర్గంలో పర్యటనలు మొదలు పెట్టేందుకు ముహూర్తం నిర్ణయించి కార్యరంగంలోకి దిగారు. పర్యటనకు వచ్చిన ఆ నేతల కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం తెలిసిందే. అధికార పార్టీ దూకుడు నిజానికి టీడీపీకి బాగా కలిసొచ్చింది. స్తబ్దుగా వున్న టీడీపీ శ్రేణులను ఆ ఘటన రెచ్చగొట్టింది. వారితో పాటు తటస్తంగా వున్న జనంలోనూ అధికార పార్టీ నేతల దౌర్జన్యకర వ్యవహారశైలి అసంతృప్తిని రేపింది. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ పట్ల నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ తీవ్ర అసంతృప్తి వుండేది. అయితే వైసీపీ దూకుడుతో పరిస్థితి తారుమారై టీడీపీ శ్రేణులు ఏకపక్షంగా శంకర్ వెంట నిలిచేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ వేడిలోనే నియోజకవర్గంలో పర్యటించి శ్రేణులను తిరిగి క్రియాశీలం చేయడానికి ముఖ్యనేతలంతా నిర్ణయించారు. ప్రస్తుతానికి నియోజకవర్గంలో పోలీస్ 30 యాక్టు, 144 సెక్షన్ వంటివి అమల్లో వున్నందున అట్టహాసంగా పర్యటించే ప్రయత్నం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఆలోపు మాజీ ఎమ్మెల్యే శంకర్ ఒక్కరే నియోజకవర్గంలో పర్యటించి బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించే కార్యక్రమం ప్రారంభించారు. దానికి సోమవారం శ్రీకారం చుట్టిన ఆయన బి.కొత్తకోట మండలానికి వెళ్ళి శ్రేణులను కలిశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు అక్కడకు వెళ్ళి ఆయన్ను కలవడం మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. కాగా ఒక్క తంబళ్ళపల్లెకే పరిమితం కాకుండా నల్లారి కిషోర్, శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి అమర్ పశ్చిమాన మిగిలిన నియోజకవర్గాలపై కూడా దృష్టి సారించి పార్టీకి పూర్వ వైభవం సాధించే దిశగా ప్రయత్నిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో జనబలమున్న నేత చల్లా రామచంద్రారెడ్డి రాజకీయంగా క్రియాశీలం కావడం ఆ ప్రాంతంలో పార్టీకి శుభసూచకమన్న అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అయితే ముఖ్యనేతల దూకుడు తాత్కాలికమేనా లేకుంటే ఇలాగే నిలకడగా వుండి పార్టీని పూర్తిస్థాయిలో తిరిగి పట్టాలెక్కిస్తుందా అన్నది వేచి చూడాల్సి వుంది.