సకాలంలో చేరని నిత్యావసరాలు

ABN , First Publish Date - 2020-06-04T10:33:38+05:30 IST

మదనపల్లె మండలస్టాకు పాయింట్‌(ఎంఎల్‌ఎస్‌) పరిధిలోని రేషన్‌ దుకాణాలకు ఇప్పటికీ నిత్యావసర వస్తువులు సరఫరా ..

సకాలంలో చేరని నిత్యావసరాలు

స్టాకంతా సకాలంలోనే చౌకదుకాణాలకు  చేరినట్లు ఆన్‌లైన్‌లో నమోదు


మదనపల్లె, జూన్‌ 3: మదనపల్లె మండలస్టాకు పాయింట్‌(ఎంఎల్‌ఎస్‌) పరిధిలోని రేషన్‌ దుకాణాలకు ఇప్పటికీ నిత్యావసర వస్తువులు సరఫరా కాలేదు. స్టేజ్‌-1(రేణిగుంట) నుంచి స్టేజ్‌-2(ఎంఎల్‌ఎ్‌స)కు చేరినా.. అక్కడి నుంచి మండలంలోని చౌకదుకాణాలకు రేషన్‌ సరుకులు సకాలంలో అందడం లేదు. దీంతో నిత్యం కార్డుదారులు బియ్యంకార్డు, సంచి చేతపట్టుకుని దుకాణాలకు వస్తున్నారు. స్టాకు రాలేదని కొందరు, వచ్చిన అరకొర స్టాకు అయిపోయిందని మరికొందరు డీలర్లు చెబుతున్నారు. తరచూ ఇదే మాట చెబుతున్నారంటూ కార్డుదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. మదనపల్లె ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలోని మదనపల్లె మున్సిపాలిటీ, మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట మండలాల పరిధిలోని 155 దుకాణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నాటికి స్ట్టేజ్‌-2 కాంట్రాక్టర్‌ బియ్యం, కందిపప్పు, చక్కెర, శనగలు, గోధుమపిండి తదితర నిత్యావసరాలను సరఫరా చేయాల్సి వుంది.


ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో సివిల్‌ సప్లయిస్‌ అధికారులు, స్టేజ్‌-2 కాంట్రాక్టర్‌ మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య తలెత్తింది.లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాలను ఉచితంగా అందజేస్తున్నాయి. నాలుగు విడతల పంపిణీ పూర్తికాగా, గతనెల 29వతేది నుంచి ఐదో విడత పంపిణీ సాగుతోంది. ఈ పంపిణీ ప్రారంభమయ్యే నాటికి బియ్యం తదితర వస్తువులు పాతికభాగం చౌకదుకాణాలకు చేరలేదు. మరికొన్ని షాపులకు సగం సరుకులు మాత్రమే సరఫరా చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే, గోదాములో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరని, హమాలీలు రాలేదని, బియ్యం దిగుమతికి కూలీలు దొరకలేదని కాంట్రాక్టర్‌ చెబుతున్నారు.


అయితే, గోదాములో మాత్రం స్టాకంతా సకాలంలో చౌకదుకాణాలకు చేరినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసి జిల్లాస్థాయి అధికారులను నమ్మిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సరుకులు చేరక, కార్డుదారులు డీలర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు. ఈ క్రమంలో రేషన్‌ దుకాణాలను విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేస్తే డీలర్లకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. రెండురోజుల క్రితం రొంపిచెర్లలోని ఓ రేషన్‌ దుకాణాన్ని విజిలెన్స్‌ సిబ్బంది తనిఖీ చేశారు. ఆన్‌లైన్‌లో పూర్తి స్టాకు ఇచ్చినట్లు చూపిస్తుండగా, దుకాణంలో సగమే ఉందంటూ కేసు నమోదు చేశారు. గోదాము నుంచి కొంత సరుకు మాత్రమే వచ్చిందనీ, మిగిలిన స్టాకు రావాల్సి ఉందని డీలరు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. అంగన్‌వాడీలకు సరఫరా చేయాల్సిన బియ్యం, కందిపప్పు, ఉప్పు, ఆయిల్‌ సరఫరా కూడా పరిస్థితి ఇదే బాటన పట్టింది. దీంతో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ ఆయాలు చౌకదుకాణం, ఇటు గోదాము చుట్టూ తిరుగుతూ విసిగిపోతున్నారు.

Updated Date - 2020-06-04T10:33:38+05:30 IST