ముగిసిన జడ్పీటీసీ స్ర్కూటినీ

ABN , First Publish Date - 2020-03-13T11:24:28+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిపోరు జరిగే జడ్పీ మండల పరిషత్‌ ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ 12 గంటల పాటు సాగింది.

ముగిసిన జడ్పీటీసీ స్ర్కూటినీ

రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ

నేడు ఆర్డీవో, కలెక్టరేట్‌ ఎదుట అప్పీళ్ళకు అవకాశం

రేపు ఉపసంహరణ - తుది జాబితా విడుదల


చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 12: స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిపోరు జరిగే జడ్పీ మండల పరిషత్‌ ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ 12 గంటల పాటు సాగింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగిన ఈ ప్రక్రియ కోసం వచ్చిన మహిళా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 11 గంటలకు జడ్పీ మీటింగ్‌ హాలులో జడ్పీటీసీ స్థానాల నామినేషన్లు ఆర్వో, జడ్పీసీఈవో కోదండరామిరెడ్డి నేతృత్వంలో ఆంగ్ల వర్ణమాల ఆధారంగా మండలాల వారీగా స్ర్కూటినీ జరిగింది. బి.కొత్తకోట మండలంతో ప్రారంభమై రాత్రి ఎర్రావారిపాళెం మండలంతో పూర్తయింది.


సోమ, మంగళ, బుధవారాల్లో మొత్తం 480 నామినేషన్లు 65 మండలాల జడ్పీటీసీ స్థానాలకు దాఖలైన విషయం తెల్సిందే. స్ర్కూటినీ కోసం వచ్చిన అభ్యర్థులను జడ్పీ మీటింగ్‌ హాలు వద్ద క్రింద షామియానా వేసి కుర్చీలు వేసారు. అక్కడ అభ్యర్థులను కూర్చోబెట్టి మండలాలవారీగా అభ్యర్థి, వారి వెంట ప్రతిపాదకుడిని మాత్రమే మొదటి అంతస్థులోని మీటింగ్‌ హాలులో వెళ్ళేందుకు పోలీసులు అనుమతించారు. స్ర్కూటినీ కార్యక్రమానికి కూడా అభ్యర్థులు, అనుచరులు చాలామంది తరలివచ్చారు. స్ర్కూటినీ ఆలస్యంగా జరుగుతుండడంతో పిలుపు కోసం వేచివుండాల్సి వచ్చింది. మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు అరగంట మాత్రమే భోజన విరామానికి అనుమతి ఇచ్చి తిరిగి ప్రక్రియ కొనసాగించారు. అన్ని పార్టీల, ఇండిపెండెంట్‌ అభ్యర్థులందరూ కలిసి ఎదురెదురుగా కూర్చోవడం కన్పించింది. టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సైతం కుప్పం మండలం టీడీపీ అభ్యర్థుల కోసం వచ్చి 4 గంటల పాటు ఓపిగ్గా ఉన్నారు. వైసీపీ నాయకులెవ్వరూ అక్కడికి రాలేదు.


నేడు అప్పీళ్ళకు అవకాశం

స్ర్కూటినీలో తిరస్కృతికి గురైన జడ్పీటీసీ అభ్యర్థులు శుక్రవారం కలెక్టర్‌ వద్ద, ఎంపీటీసీ అభ్యర్థులు, ఆర్డీవోల వద్ద అప్పీలు చేసుకోవాలి. అప్పీళ్ళపై వారు శనివారం నిర్ణయిస్తారు. అదే రోజు ఉపసంహరణ, తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు విడుదల చేస్తారు. జడ్పీ కార్యాలయం వద్ద గురువారం గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-03-13T11:24:28+05:30 IST