-
-
Home » Andhra Pradesh » Chittoor » Efforts to elevate culture
-
తెలుగు భాష, సంస్కృతి ఔన్నత్యానికి కృషి
ABN , First Publish Date - 2020-12-31T04:53:33+05:30 IST
తెలుగు భాష, సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామని శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ పేర్కొన్నారు.

ఓఆర్‌ఐ సందర్శనలో శాసన మండలి చైర్మన్ షరీఫ్
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 30: తెలుగు భాష, సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామని శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి అధ్యయన కమిటీ చైర్మన్ హోదాలో బుధవారం ఆయన ఎమ్మెల్సీలతో కలిసి ఎస్వీయూ ఓఆర్‌ఐ విభాగాన్ని సందర్శించారు. రెండు గంటల పాటు ఓఆర్‌ఐను పరిశీలించారు. అనంతరం సెనేట్ హాలులో జరిగిన నిర్వహించిన కార్యక్రమంలో ఓఆర్‌ఐ లక్ష్యాలు, పనితీరు, పరిశోధన, రాత ప్రతుల పరిష్కరణ, ప్రచురణ తదితరాలపై ఓఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ టి.సురేంద్రరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ.. ఇతర భాషలు నేర్చుకున్నప్పటికీ తెలుగుపై ఆసక్తి పెంచుకోవాలని కోరారు. తెలుగులో మాట్లాడటం, రాయడంపై యువత దృష్టి సారించాలన్నారు. తమ గతంలో తంజావూరు, ప్రస్తుతం తిరుపతిలోని చారిత్రక ప్రాధాన్యం గల కేంద్రాలను సందర్శిస్తున్నామని చెప్పారు. ఓఆర్‌ఐలోని అరుదైన తాళపత్రాలను డిజిటలైజ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేసారు. సభాధ్యక్షత వహించిన ప్రొఫెసర్ పేట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. ఎస్వీయూ తెలుగు విభాగంలో ఇప్పటి వరకు 500 మంది పీహెచ్‌డీ చేశారని తెలిపారు. అంతకు ముందు ఎస్వీయూ వీసీ కె.రాజారెడ్డి, రిజిస్ట్రార్ పి.శ్రీధర్ రెడ్డి తదితరులు షరీఫ్‌ను సత్కరించారు.
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాన్ని ఈ కమిటీ సందర్శించి, రిజిస్ట్రార్ కృష్ణమూర్తితో చర్చించారు. పద్మావతి మహిళా వర్సిటీలో వీసీ జమున, రిజిస్ట్రార్ మమతతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, కత్తి నరసింహారెడ్డి, బుద్దా వెంకటేశ్వరరావు, పీవీఎన్ మాధవ్, ఎస్వీయూ, పద్మావతి వర్సిటీ తెలుగు విభాగాధిపతులు ఆర్.రాజేశ్వరమ్మ, కె.మధుజ్యోతి, తెలుగు ప్రొఫెసర్లు ఎస్.రాజేశ్వరి, మేడిపల్లె రవికుమార్, కడియాల వెంకటరమణ, వై.సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.