రవాణాకు ‘కరోనా’ బ్రేక్‌!

ABN , First Publish Date - 2020-03-18T10:47:04+05:30 IST

‘కరోనా’ ప్రభావం రైల్వే, ఆర్టీసీపై పడింది. మంగళవారం 59 బస్సులను ఆర్టీసీ అధికారులు తగ్గించారు.

రవాణాకు ‘కరోనా’ బ్రేక్‌!

59 బస్సులను తగ్గించుకుంటున్న ఆర్టీసీ అధికారులు 


తిరుపతి (ఆటోనగర్‌), మార్చి 17: ‘కరోనా’ ప్రభావం రైల్వే, ఆర్టీసీపై పడింది. మంగళవారం 59 బస్సులను ఆర్టీసీ అధికారులు తగ్గించారు. రైల్వేలో తత్కాల్‌ టిక్కెట్‌ బుకింగ్‌ సమయంలో రద్దీ లేకపోవడం విశేషం. వివిధ ప్రాంతాల నుంచి రోజువారీగా 60 వేల మందికిపైగా భక్తులు తిరుపతికి వస్తారు. కరోనా నేపథ్యం.. టీటీడీ సూచనలతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు గణనీయంగా తగ్గారు. దీంతో రైలు ప్రయాణికుల సంఖ్య 40 శాతం తగ్గింది. సాధారణంగా ముందస్తు టిక్కెట్ల రిజర్వేషన్‌ మాత్రం వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్నాయి. మిగిలిన 40 శాతం తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌కు డిమాండ్‌ తగ్గింది. అలాగే, ప్రధాన పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ లేక 59 బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు.


తిరుపతి-తిరుమల మధ్య 20 శాతం బస్సులతోనే రాకపోకలు సాగిస్తున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి తిరుమలకు రద్దీగా వెళ్లే ఆర్టీసీ బస్సులు భక్తుల కోసం గంటల తరబడి వేచి ఉన్నాయి. తిరుపతి నుంచి కాణిపాకానికి రెండు, శ్రీకాళహస్తికి పది, కాంచీపురానికి రెండు, చెన్నైకి ఐదు, బెంగళూరుకు నాలుగు చొప్పున బస్సు సర్వీసులను రద్దుచేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సులను నడుపుతామని ఆర్‌ఎం తిమ్మాడి చెంగల్‌రెడ్డి తెలిపారు. భక్తుల సంఖ్య తగ్గడంతో మంగళవారం కొన్ని బస్సులు తగ్గించామన్నారు. గ్రామీణ బస్సులను తగ్గించలేదన్నారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న కారణంగా గ్రామీణ, నగర ప్రాంతాలకు యథావిధిగా బస్సులు నడుస్తాయన్నారు.

Updated Date - 2020-03-18T10:47:04+05:30 IST